Sunday, April 28, 2024

పురాతన ఆలయాలే లక్ష్యం.. కోటగుళ్లలో గుప్త నిధుల కోసం తవ్వకాలు..!

గణపురం : గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. పురాతన ఆలయాల్లో గుప్త నిధులు ఉన్నాయనే ప్రచారంతో దుండగులు తవ్వకాలు జరపడం సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు గుట్టుచ‌ప్పుడు కాకుండా విచార‌ణ చేప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది.. ఇంతకీ గుప్తనిధులు బయటపడ్డాయా.. లేదా..?

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలకేంద్రలోని కాకతీయుల కళాక్షేత్రం గణపేశ్వర ఆలయ ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో ఆలయ సమీపంలో భారీగా నిధి దొరకడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందులో కొంత సొత్తుని పోలీసులు రికవరీ కూడా చేశారు. కాగా ఇప్పుడు ఏకంగా ఆలయ పరిసరాల్లోని జమ్మి వృక్షం సమీపంలో తవ్వకాలు జరగడం, ఆ ప్రాంతంలో నల్ల మట్టి ఉనుక బూడిద కనిపిస్తుండ‌టంతో గుప్తనిది దొరికి ఉండవచ్చు అనే ప్రచారం జోరు అందుకుంది. ఇంతకు నిధి దొరికిందా లేదా? తవ్వకాలు జరిపిన వారు ఇక్కడి వారేనా లేదా.. ఇతర ప్రాంతాలకు చెందినవారా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. కొద్ది సంవత్సరాల తర్వాత తాజాగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించి గోప్యంగా విచారణ చేపడుతున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement