Monday, September 25, 2023

AP | నిఫా వైరస్‌ పై అప్రమత్తం.. రాపిడ్‌ రెస్పాన్స్‌ టీంల ఏర్పాటు

అమరావతి, ఆంధ్రప్రభ: కేరళలో నమోదవుతున్న నిఫా వైరస్‌ కేసుల నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం అయింది. వైరస్‌ రాష్ట్రాన్ని తాకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆసుపత్రులకు మార్గదర్శకాలను జారీ చేసింది. సూపరింటెండెంట్‌లు తూ.చ తప్పకుండా వీటిని అమలు చేయాల్సిందిగా డీఎంఈ డీఎస్‌వీఎల్‌ నరసింహం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పల్మోనాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ ఫ్యాకల్టీతో కూడిన రాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి టీచింగ్‌ ఆసుపత్రిలో ఐదు గదులతో స్పెషల్‌ వార్డును సిద్ధం చేస్తున్నారు.

సైన్‌ బోర్డులతో ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడం, నిఫా వైరస్‌ కోసం కేటాయించిన ఐసోలేషన్‌ గదులను సిద్ధం చేస్తున్నారు. కేసులు నమోదైతే టెస్టింగ్‌ కోసం పీపీ ఈ కిట్స్‌ తగినంత స్టాక్‌ను సిద్ధం చేస్తున్నారు. యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ అందుబాటులో ఉంచుకోవాల్సిందిగా అన్ని ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశారు. ఆక్సిజన్‌ కొరత లేకుండా ముందస్తు జాగ్రతలు చేపట్ట్లారు. నిఫా పాజిటివ్‌ కేసులు వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఆసుపత్రుల సిబ్బందికి అవగాహనా కల్పించాల్సిందిగా సూపరింటెండెంట్స్‌కు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -
   

యమడేంజర్‌

నిఫా వైరస్‌.. కరోనా వైరస్‌ కంటే ప్రమాదకరమైనదని ఐసీఎంఆర్‌ చెబుతోంది. నిఫా వైరస్‌ సోకిన వారిలో మరణాల రేటు 40 నుంచి 70 శాతం ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. నిఫా వైరస్‌ పందులు, గబ్బిలాల నుంచి వ్యాపిస్తోంది. ముందుగా ఈ వ్యాధి జంతువులకు సోకి వాటినుంచి మనుషులకు సోకుతుంది. నిఫా వైరస్‌ కు సరైన చికిత్స, వ్యాక్సిన్‌ కూడా అందుబాటులో లేదు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.

2018లో తొలిసారి కేరళను వణికించిన నిఫా వెరస్‌.. ఇప్పుడు మరోసారి కలవరపెడుతోంది. ఈ వైరస్‌ భారిన పడి కేరళలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి క్రమ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అలర్ట్‌ అయింది. ఇటీవలే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజినీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

పిల్లలకే ఎక్కువ ప్రమాదం

పల్లలు ఎక్కువగా ఈ నిఫా వైరస్‌ బారిన పడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వాతావరణ మార్పుల నేపథ్యంలో జలుబు, జ్వరం, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఈ క్రమంలో పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గుతోందని, ఈ క్రమంలో నిఫా వైరస్‌ దాడి చేసే ప్రమాదం ఉంది కాబట్టి పిల్లల ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచిస్తున్నారు. భౌతిక దూరం, పరిశుభ్రత పాటించడంపై చిన్నారుల్లో అవగాహన కల్గించడం ద్వారా వైరస్‌ భారిన పడకుండా జాగ్రత్తలు తీసుకొనే అవకాశం ఉందన్నారు.

పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచడానికి అవసరమయ్యే ఫుడ్‌ ని అందించాల్సి ఉంటుంది. సాధారణంగా పిల్లలు జంక్‌ ఫుడ్‌ నే ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ఈ సమయంలో తినకూడదు కాబట్టి. శుచి శుభ్రతతో ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని పిల్లలకు పెట్టడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మార్కెట్‌ లేదా బహిరంగ ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు మాస్క్‌ పెట్టుకోవడం, భౌతిక దూరంగా పాటించడం ద్వారా అన్ని వయసుల వారు వైరస్‌ భారిన పడకుండా తప్పించుకొనే అవకశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement