Saturday, October 12, 2024

తిరుమల బ్రహ్మోత్సవాలు : హంస వాహన సేవ (ఆడియోతో…)

3. హంసవాహనం సేవ అంతరార్ధం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజార్యుల వారి వివరణ

చిన్న శేషవాహన సేవ జరిగిన నాటి సాయంత్రం మలయప్ప స్వామి హంస వాహనం పై విహరిస్తారు. శ్వేత వర్ణంతో పాలని, నీటిని వేరు చేయగల ఏకైక పక్షి ‘హంస’ కావున దీనిని జ్ఞానానికి ప్రతీకగా వ్యవహరిస్తారు. అంటే మంచిచెడులేవో తెలిపి దేనిని ఆచరించాలో తెలియజేసే దానిని జ్ఞానం అంటారు. జ్ఞానాన్ని స్వీకరించి అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. పాలను స్వీకరించి నీటిని విడిచిపెట్టాలి. జ్ఞానాన్ని ప్రభోదించే సర్వసంఘ పరిత్యాగులైన సన్యాసులను పరమహంసలు అంటారు.

ఒకసారి బ్రహ్మలోకంలో ఋషులందరూ ఎవరు కనబడినా మీరెవరు? అని అడుగుతారని ఇచ్చట మీరు అన్నదానికి అర్థం ఏమిటని బ్రహ్మను ప్రశ్నించారు.
శరీరాన్ని ఉద్దేశించా లేక ఆత్మనా, ఒకవేళ శరీరమే అయితే ఏ రూపమో ప్రత్యక్షంగా కనబడుతోంది. ఆత్మ స్వరూపం ఒక్కటే కావున ఆత్మను ఎవరని అడగడం కుదరదు కావున మీరెవరు అనే ప్రశ్న తప్పు కాదా అని బుషులు బ్రహ్మను ప్రశ్నించారు. సమాధానం తెలియని బ్రహ్మ శ్రీమన్నారాయణుని స్మరించగా వారికి తత్త్వమును తెలుపడానికి స్వామి ఒక హంస రూపంలో వారి ముందుకు వచ్చారు. హఠాత్తుగా వచ్చిన హంసను చూసిన ఋషులు మీరెవరని అడుగగా హంసగా కనబడుతున్నాను మరియు లోపల ఉన్న ఆత్మ మీలో ఉన్న దాని వంటిదే, మరి మీరెవరు అని మీరే ఎలా అడిగారు అని హంస రూపంలో ఉన్న స్వామి తిరిగి ప్రశ్నించగా ఇదంతా చూసిన ఋషులు వచ్చింది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని తెలుసుకొని సాష్టాంగ దండ ప్రణామం చేసి చేతులు జోడించి స్వామీ! మా సందేహాన్ని తొలగించండని ప్రార్థించారు. నేను మనిషిని, నేను పశువును, నేను రాక్షసుడిని అని చెబితే అవన్నీ శరీరాలు, నేను అంటే శరీరం కాదు శరీరమే ఆత్మ అనుకున్న వారే నేను మనిషిని అంటారు. కాని ఆత్మజ్ఞానం ఉన్నవారు భగవంతుడు ఆత్మగా ఉన్నా, జీవాత్మ ఆత్మగా ఉన్నా మానవ శరీరాన్ని అని చెప్పాలి, వీరే ఆత్మజ్ఞానులు. మీరెవరు అన్న ప్రశ్నకు ఆత్మ జ్ఞానం ఉన్న వారా లేనివారా అని అర్థం . ఇలా ఆత్మ, అనాత్మ వివేకాన్ని క్షీర – నీర న్యాయంతో తొలగించిన అవతారం హంసావతారం.

అందుకే మనలోని అహంకారాన్ని తొలగించి ఆత్మ వివేకాన్ని కలిగించాలనే అనుగ్రహ బుద్ధితో స్వామి హంసను తన వాహనంగా చేసుకొని ఆత్మను శరీరం మోయటం లేదు, ఆత్మే శరీరాన్ని మోస్తుందని తెలియజేస్తున్నాడు. పరమాత్మ జీవాత్మకు ఆధారం అదేవిధంగా జీవాత్మ శరీరానికి ఆధారం, ఈ ఆత్మను తాను స్వయంగా మోసుకొని తన లోకానికి చేర్చేవాడు పరమాత్మ అన్న ధర్మ సూక్ష్మాన్ని బోధించడమే హంస వాహనంలోని ఆంతర్యమని స్వామి స్వయంగా హంస వాహనం పై విహరిస్తూ బోధిస్తాడు.

- Advertisement -

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు,
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement