Saturday, April 27, 2024

Delhi | తెలంగాణపై ఏఐసీసీ వ్యూహాత్మకం.. టీపీసీసీ ముఖ్యుల‌తో రాహుల్, ఖర్గే భేటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏఐసీసీ మంగళవారం కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశం కోసమే తెలంగాణ పీసీసీ ముఖ్య నేతలను ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో వ్యూహరచన చేయనుంది. మంగళవారం మధ్యాహ్నం గం. 12.00 నుంచి గం. 2.00 వరకు సమావేశం జరగనుందని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం ఎజెండా ఖరారు చేయడం కోసం సోమవారం సాయంత్రం గం. 6.00 సమయంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ థాక్రే నేతృత్వంలో తెలంగాణ పీసీసీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు.

ఇందులో ఇంచార్జి కార్యదర్శులతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు జానా రెడ్డి, దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ మధుయాష్కి, మల్లు రవి, టీపీసీసీ నేతలు మహేశ్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మాజీ మంత్రి జానా రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో నేతల మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం ఎలా అన్న అంశంపై చర్చించినట్టు చెప్పారు.

- Advertisement -

ఖాళీగా ఉన్న డీసీసీల భర్తీ విషయంలో నెలకొన్న పోటీతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకరి కంటే ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు, ఆశావాహులు ఉన్న చోట సర్దిచెప్పడం ఎలా అన్న అంశాలపై కూడా సమావేశంలో చర్చించామని జానారెడ్డి అన్నారు. అదే సమయంలో కొత్తగా చేరుతున్న నేతల కారణంగా ఆయా నియోజకవర్గాల్లో అభద్రతాభావానికి గురవుతున్న నేతలను బుజ్జగించే అంశంపై కూడా చర్చించినట్టు తెలిసింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసి జాబితాను విడుదల చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించినట్టు తెలిసింది.

ముందే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని, ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థుల కంటే పైచేయి సాధించవచ్చని చెప్పినట్టు తెలిసింది. కర్ణాటకలోనూ ఇదే సూత్రం ఫలించిందని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే సగానికి పైగా అభ్యర్థులను ప్రకటించారని గుర్తుచేశారు. రేపటి సమావేశంలో అభ్యర్థుల ఎంపిక గురించి కూడా చర్చించాలని, ఎజెండాలో ఆ అంశాన్ని కూడా చేర్చాలని పట్టుబట్టినట్టు తెలిసింది. సోమవారం నాటి సమావేశంలో పైన పేర్కొన్న నేతలతో పాటు ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి బలరాం నాయక్, చిన్నా రెడ్డి, జగ్గా రెడ్డి సహా ఢిల్లీ చేరుకున్న టీపీసీసీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement