Friday, May 3, 2024

‘పిడి’కిలి ఉత్తిదే..!

  • రెచ్చిపోతున్న నకిలీ విత్తనాల మాఫియా
  • జిల్లాలో ఏటా పెరుగుతున్న కేసులు
  • కర్ణాటక నుంచి పత్తి విత్తనాల దిగుమతి
  • గ్రామాలకు వెళ్లి నేరుగా విక్రయాలు
  • ఎవరిపైనా నమోదు కాని పిడి కేసులు

(ప్రభన్యూస్‌ ప్రతినిధి, వికారాబాద్‌) : జిల్లాలో ఏటా నకిలీ పత్తి విత్తనాల విక్రయాలు పెరిగిపోతున్నాయి. ప్రతిఏటా పెద్ద మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఖరీఫ్‌ సీజన్‌కు ముందు నకిలీ విత్తనాలపై అటు పోలీసు శాఖ..ఇటు వ్యవసాయ శాఖ అధికారుల ప్రత్యేక భేటీ జరుగుతుంది. ఈ భేటీలో నకిలీ పత్తి విత్తనాలను అరికట్టడంపైనే ప్రధానంగా చర్చిస్తారు. నకిలీ విత్తనాలను విక్రయించే వ్యక్తులపై పిడి చట్టం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని పోలీసు..వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటిస్తారు. ఇటీవల కాలంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడిన వారిలో ఒక్కరిపై కూడా పిడి చట్టం కింద కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. దీంతో జిల్లాలో ఏటా నకిలీ విత్తనాల విక్రయాలు పెరిగిపోతున్నాయనే వాదన వినిపిస్తోంది. పిడి చట్ట ప్రయోగం కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం కావడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.

ఖరీఫ్‌(వానాకాలం)లో జిల్లాలో రైతులు దాదాపు 6 లక్షల ఎకరాలలో వివిధ పంటలను సాగు చేస్తారు. ఇందులో ప్రధానంగా కంది.. పత్తి పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 3 లక్షల ఎకరాలలో రైతులు పత్తి పంటను సాగు చేస్తున్నారు. ఏటా పత్తి పంట సాగు విస్తీర్ణం పెరుగుతోంది. రైతులు అధికంగా పత్తి పంటను సాగు చేయడంతో పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాలను దిగుమతి చేసుకొని రైతులకు అంటగడుతున్నారు. జిల్లాలో ఈ తరహా మోసం ప్రతిఏటా ఎక్కువ అవుతోంది. నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఏటా గట్టి చర్యలు చేపడుతోంది. పోలీసు శాఖతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. అయినా జిల్లాలో ఏటా నకిలీ విత్తనాల విక్రయాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అధిక దిగుబడి పేరుతో నకిలీ విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నారు.

- Advertisement -

వరుసగా గత రెండేళ్లుగా జిల్లాలో భారీగా నకిలీ పత్తివిత్తనాలు పట్టుబడుతున్నాయి. పోలీసు శాఖ ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్‌ విభాగం నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషిస్తోంది. జిల్లా నలుమూలలా నిఘా వేసి నకిలీ విత్తనాలను విక్రయించే ముఠాలను పట్టుకుంటున్నారు. గత రెండేళ్లుగా జిల్లాలో ఒకే వ్యక్తి పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలను విక్రయించి పట్టుబడ్డారు. ఈ వ్యక్తిని వరుసగా రెండేళ్లు పోలీసు అధికారులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు. యాలాల మండలంకు చెందిన ఈ వ్యక్తి నుంచి క్రితంసారి ఏకంగా 10 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా వరుసగా ప్రతి ఏటా నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న వ్యక్తిపై పోలీసు శాఖ పిడి చట్టం కింద కేసు నమోదు చేయాల్సి ఉండింది. సాధారణ కేసులు నమోదు చేయడంతో అలా జైలుకు వెళ్లి ఇలా తిరిగి బెయిల్‌పై వస్తున్నారు. అదే పనిగా ప్రతి ఏటా నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

నకిలీ పత్తి విత్తనాల విక్రయంలో సిద్దహస్తుడైన యాలాల మండలం సంగెంకు చెందిన వ్యక్తి క్రితంసారి తన వ్యాపారంను జిల్లా అంతటా విస్తరించాడు. జిల్లాలోని అనేక ఎరువుల దుకాణాల వారి నుంచి ముందస్తుగా డబ్బులు తీసుకొని నకిలీ పత్తి విత్తనాలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఒక్కో ఎరువుల దుకాణం నుంచి దాదాపు రూ.50 వేల వరకు వసూలు చేశాడు. రూ.50 వేలు చెల్లిస్తే రూ.లక్ష విలువైన పత్తి విత్తనాలను ఇస్తానని చెప్పి చాలా మంది నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఆతరువాత నకిలీ విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడడంతో డబ్బు చెల్లించిన ఎరువుల వ్యాపారులు చేతులుకాల్చుకోవాల్సి వచ్చింది. జిల్లాలో పేరొందిన ముఠాలు ప్రతిఏటా నకిలీ పత్తి విత్తనాలను కర్ణాటక నుంచి వివిధ మార్గాలలో తీసుకవచ్చి రహస్య ప్రదేశాలలో నిల్వ ఉంచి గ్రామాలకు వెళ్లి రైతులకు విక్రయిస్తున్నారు. ఈ ముఠాలపై పోలీసు శాఖ పిడి చట్టంను ప్రయోగించకపోవడంతో ప్రతిఏటా అదే పనిగా నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. పిడి చట్టం కింద కేసు నమోదు చేస్తే ఏడాది వరకు బెయిల్‌ రాదు. ఖరీఫ్‌ ప్రారంభంకు ముందు పిడి చట్టం పేరుతో పోలీసు..వ్యవసాయ శాఖ అధికారులు హడావుడి చేయడం తప్ప ఎవరిపైనా నమోదు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement