Friday, May 17, 2024

Delhi | తెలుగు ఐఏఎస్ అధికారి రాజశేఖర్‌కు క్లీన్‌చిట్..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ ప్రభుత్వంలో వేధింపులు, బెదిరింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎస్ అధికారి వైవీవీజే రాజశేఖర్‌కు క్లీన్‌చిట్ లభించింది. ఆయనపై చేసిన ఆరోపణలు కల్పితమైనవి, నిరాధారమైనవని త్రిసభ్య కమిటీ తేల్చి చెప్పింది. ఢిల్లీ ప్రభుత్వంలో విజిలెన్స్ విభాగం ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వ అవకతవకలు, అక్రమాలను బయటపెట్టారు.

వాటిలో ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అధికారిక నివాసానికి విలాసవంతమైన మరమ్మత్తు పనులు వంటివి కూడా ఉన్నాయి. వరుసపెట్టి కేజ్రీవాల్ సర్కారు చేస్తున్న పన్నుల్లో అక్రమాలు, అవకతవకలను బయటపెడుతున్న రాజశేఖర్‌ను బదిలీ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. వాటిని ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ అడ్డుకోవడంతో వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.

- Advertisement -

చివరకు సుదీర్ఘ విచారణ అనంతరం ప్రభుత్వాధికారుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ తీర్పు వచ్చిన కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్సును తీసుకొచ్చి ఉన్నతాధికారుల బదిలీ అధికారాన్ని లెప్టనెంట్ గవర్నర్‌కు అప్పగించింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్సుకు చట్టరూపం తీసుకొచ్చింది.

ఇదిలా ఉంటే.. కేజ్రీవాల్ ప్రభుత్వం రాజశేఖర్‌ను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుంది. అంతే, రాజశేఖర్‌పై వరుసపెట్టి ఫిర్యాదులు వచ్చిపడ్డాయి. అవినీతి ఆరోపణలపై సస్పెండైన ఐఏఎస్ అధికారి ఉదిత్ ప్రకాశ్ రాయ్, ఆయన భార్య, ఢిల్లీ సర్వీసు అధికారి ఏవీ ప్రేమ్‌నాథ్ సహా మరో ముగ్గురు వ్యక్తులు రాజశేఖర్‌పై ఫిర్యాదు చేశారు. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తమను బెదిరించారని, వేధింపులకు గురిచేశారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.

ఈ ఆరోపణలపై విచారణకు ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటైంది. వారిలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి అశ్వని కుమార్, విజిలెన్స్ కార్యదర్శి సుధీర్ కుమార్, సర్వీసెస్ విభాగం కార్యదర్శి అనిల్ కుమార్ సింగ్ ఉన్నారు. ఈ హైలెవెల్ కమిటీ రాజశేఖర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపింది.

సస్పెండైన అధికారి ఉదిత్ ప్రకాశ్ రాయ్ తనపై వచ్చిన ఆరోపణల నుంచి తప్పించుకోవడం కోసం తన అక్రమాలను బయటపెట్టిన అధికారిపై తప్పుడు ఆరోపణలు చేశారని కమిటీ తన నివేదికలో పేర్కొంది. చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని కూడా వెల్లడించింది. తప్పు చేసిన అధికారులపై క్రమశిక్షణాచర్యలు చేపట్టకుండా అడ్డుకోవడం కోసం దురుద్దేశంతో బురదజల్లే ప్రయత్నం చేశారని కమిటీ పేర్కొంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement