Sunday, May 19, 2024

Congress | యువతకు ఉజ్వల భవిష్యత్.. ఉద్యోగావకాశాలు పెంచుతాం : ఖర్గే

కాంగ్రెస్ పార్టీ ‘రోజ్‌గార్ క్రాంతి (ఉపాధి విప్లవం) తీసుకువస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం ప్రకటించారు. కాంగ్రెస్ గ్యారంటీలతో యువత భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందని ఆయన చెప్పారు. యువతకు ఉద్యోగావకాశాలు పెంచేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటామ‌ని, వారి ఆకాంక్షల సాఫల్యానికి, పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సాహానికి పార్టీ ఈ పథకం ద్వారా కృషి చేస్తుందని ఖర్గే హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే ‘యువ న్యాయ్’ గ్యారంటీలను అమలు పరుస్తుందని ఖర్గే పునరుద్ఘాటించారు.

‘యువ న్యాయ్’ పథకం కింద పార్టీ ఇవ్వనున్న గ్యారంటీలను ఖర్గే వివరించారు. ‘భారతీ భరోసా’ గ్యారంటీ కింద తమ పార్టీ జాబ్ క్యాలెండర్ ప్రకారం 30 లక్షల కొత్త కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుందని, ‘పెహ్లీ నౌకీ పక్కీ’లో భాగంగా ఏడాదికి ఒక లక్ష రూపాయలు వంతున విద్యాధిక యువజనులు అందరికీ ఒక ఏడాది అప్రెంటిస్‌షిప్ హక్కు కల్పిస్తుందని ఖర్గే తెలియజేశారు. ‘పేపర్ లీక్ సే ముక్తి’ గ్యారంటీ కింద పార్టీ అన్ని పేపర్ల లీక్‌లను పూర్తిగా కట్టడి చేయడానికి ఒక చట్టం చేస్తుందని పార్టీ అధ్యక్షుడు తెలిపారు.

జిగ్ కార్మికులకు మెరుగైన పని పరిస్థితులు, సామాజిక భద్రత కల్పిస్తుందని, యువత కోసం రూ. 5000 కోట్ల స్టార్టప్ నిధి ఏర్పాటు చేస్తుందని ఖర్గే తెలియజేశారు. ఐదు న్యాయ్‌లు & నారీ న్యాయ్, యువ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, కిసాన్ న్యాయ్, హిస్సేదారి న్యాయ్ కింద 25 గ్యారంటీలతో లోక్‌సభ ఎన్నికలలో ప్రచారానికి కాంగ్రెస్ వ్యూహం రూపొందించింది. అధికారంలోకి వచ్చినట్లయితే వాటిని అమలు చేస్తామని పార్టీ వాగ్దానం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement