Sunday, April 28, 2024

TS | 106 ఎకరాలు అటవీశాఖదే.. 39 ఏండ్లకు సుప్రీం తీర్పు

ప్రభన్యూస్‌ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్‌ జిల్లా భూపాలపల్లి పట్టణంలోని కొంపల్లి గ్రామశివారులో సర్వేనెంబర్‌ 171లో గల 106-34 ఎకరాలు అటవీ శాఖకు చెందినదే అని భూపాలపల్లి డిఎఫ్‌ఓ వసంత ప్రభన్యూస్‌కు తెలిపారు. ఇట్టి భూమిపై గల కేసులో సుప్రీంకోర్టు (గురువారం) తీర్పును వెలువరించిందన్నారు. సర్వే నెంబర్‌ 171 కొంపల్లిశివారులో గల అటవీ భూమి పూర్తిగా అటవీశాఖకు చెందుతుంది అని సుప్రీంకోర్టు తన తీర్పులో నిర్దారించిందన్నారు.

ఈ కేసులో ఫిబ్రవరి నెలలో వాదనలు ముగియగా, సుప్రీంకోర్టు గురువారం తీర్పును వెలువరించింది. సరేనెంబర్‌ 171లో గల 106-34 ఎకరాల భూమిపై మహ్మద్‌ అబ్దుల్‌ ఖాసిం అనే వ్యక్తి హక్కును కోరుతూ 1985లో వరంగల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో కేసు వేయడం జరిగిందన్నారు. ఈ కేసులో తీర్పు 1994లో అటవీ శాఖకు అనుకూలంగా వెలువడగా, సదరు వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ 1994లో వేయడం జరిగిందన్నారు.

ఈ అప్పీల్‌ పిటిషన్‌ పై 2018లో హైకోర్టు అటవీశాఖకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ తీర్పుపై మహ్మద్‌ అబ్దుల్‌ ఖాసిం రివ్యూ పిటిషన్‌ ను హైకోర్ట్‌ లో దాఖలు చేయగా మార్చి 2021 లో హైకోర్టు సదరు 106 ఎకరాల అటవీ భూమి మహ్మద్‌ అబ్దుల్‌ ఖాసింకు చెందునని తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ తీర్పుపై అటవీశాఖ మే 2021లో సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవు పిటిషన్‌ ను ఫైల్‌ చేసింది.

ఫిబ్రవరి 2024 లో ఇట్టి స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ పై వాదనలు విన్న ఇద్దరు జడ్జిల ధర్మాసనం గురువారం తీర్పును వెలువరించిందని తెలిపారు. ఈ తీర్పులో సదరు 106 ఎకరాల భూమి అటవీశాఖకే చెందునని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాకుండా పైవేట్‌ వ్యక్తులకు అనుకూలంగా అఫిడవిట్‌ లను దాఖలు చేసిన అధికారులపై ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకొనవలసిందిగా ధర్మాసనం రాష్ట్ర ప్రభుతాన్ని కోరింది.

ధర్మాసనం తన తీర్పులో హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరించి, కనీసం తనదిగా నిరూపించుకోలేని వ్యక్తికి, 106 ఎకరాల అటవీ భూమిని గిప్టుగా ఇచ్చిందని పేర్కొంది. ఈ కేసులో అటవీశాఖ తరపున ఐశ్వర్య భాటి, అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, శ్రావణ్‌ కుమార్‌, ఏఓఆర్‌, మహ్మద్‌ అబ్దుల్‌ ఖాసిం తరపున నీరజ్‌ కిషన్‌ కేల్‌, సీనియర్‌ అడ్వకేట్‌, ఎల్‌.నరసింహ రెడ్డి, సీనియర్‌ అడ్వకేట్‌ లు వాదించారు.

- Advertisement -

ఈ కేసులో సుప్రీంకోర్టులో వాదనలు జరిగే సందర్భంగా అటవీశాఖ అట్టి భూములు అటవీశాఖకే చెందునని వాదించగా, రెవెన్యూ డిపార్ట్మెరట్‌ మాత్రం అట్టి 106 ఎకరాలపై పైవేటు వ్యక్తికే హక్కులు కలవని అఫిడవిట్‌ దాఖలు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి రెండు ప్రభుత్వ శాఖలు విభిన్న వాదనలు వినిపించడంతో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒకే వాదనను దాఖలు చేయవలసిందిగా చీఫ్‌ సెక్రటరీని గత అక్టోబర్‌ లో సుప్రీంకోర్టు ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున చీఫ్‌ సెక్రటరీ దాఖలు చేసిన అఫిడవిట్‌ లో సదరు 106 ఎకరాల అటవీ భూమిగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడంతో అట్టి వాదనను సుప్రీంకోర్టు తన తీర్పుతో సమర్ధించి 106 ఎకరాల అటవీ భూమిగా గుర్తిస్తూ తీర్పును వెలువరించిందని భూపాలపల్లి డీఎఫ్‌వో వసంత తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement