Saturday, May 4, 2024

చింత మడక టు సీఎం…జన్మదినం సందర్భంగా కేసీఆర్ ప్రస్థానంపై కథనం

మెదక్‌ జిల్లా సిద్దిపేట మండలంలోని మారుమూల గ్రామమైన చింతమడకలో 1954, ఫిబ్రవరి 17న ఓ మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించారు. కేసీఆర్‌ విద్యాభ్యాసం చింతమడక, దుబ్బాక, సిద్దిపేట, హైదరాబాద్‌లలో కొనసాగింది. ఓయూ ఆర్ట్స్‌ కళాశాలలో ఏంఎ (తెలుగు సాహిత్యం) చదివిన కేసీఆర్‌ బాల్యం నుండే రాజకీయ లక్షణాలతో ఎదిగారు. మొదట యువజన కాంగ్రెస్‌ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేసీఆర్‌ కొద్ది కాలానికే అనేక సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచారు. మొట్టమొదటిసారిగా 1983లో టీడీపీ అభ్యర్థిగా సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మదన్మోహన్‌ చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో ఇదే సిద్దిపేట నియోజకవర్గం నుంచి రెండోమారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మదన్మోహన్‌ను ఓడించారు. ఇక అప్పటి నుంచి ఆయనకు తిరుగులేదు. ఓటమి అంటేనే తెలియదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రవాణాశాఖ మంత్రిగా, ఉప సభాపతిగా, కేంద్రంలో కొన్ని నెలల పాటు కార్మికశాఖ మంత్రిగా చేశారు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన అనేక పదవులు చేపట్టారు. చేపట్టిన ప్రతి పదవికి ఆయన వన్నె తెచ్చారు. ఏ పదవి చేపట్టినా దానిపై తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. అనేక పదవులు చేపట్టినా.. పదవులకే వచ్చె తెచ్చినా.. ఈ ప్రాంత ప్రజల కోసం ఇంకా ఏదో చేయాలనే పట్టుదలే ఆయనను తెలంగాణ ఉద్యమంవైపు నడిపించింది.

ఆకారం బక్కపలచ.. ఆలోచన ఆకాశమంత

చూడడానికి బక్క పలచగా ఉండే కేసీఆర్‌ వ్యూహాలను రచించడంలో, ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో దిట్ట. తాను అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి ఏదైనా చేయడం, ఎంత దూరమైనా వెళ్లడం ఆయన నైజం. ఆయన ఆలోచనలు ఆకాశమంత ఎత్తున ఉంటాయి. ప్రత్యర్ధులకు అందవు. చిక్కవు

చరిత్రలో ఒకడు

సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన కేసీఆర్‌.. ఉద్యమాన్ని ఊపిరిగా భావించి.. ప్రేమించి.. శ్వాసించి.. తన వాగ్దాటితో.. వ్యూహ చాతుర్యంతో అహింసా మార్గంలో.. చిన్న రక్తపు బొట్టు కూడా చిందకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. భారతదేశ పటంలో తెలంగాణాను 29వ రాష్ట్రంగా ఏర్పడేలా చేసిన సాధకుడు కేసీఆర్‌. తెలంగాణ ప్రజల్లో బలంగా నాటుకుపోయిన తెలంగాణ వాదాన్ని, రాష్ట్ర ఆకాంక్షను గుర్తించి 2001, ఏప్రిల్‌ 17న తెలుగుదేశం పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి, డిప్యూటి స్పీకర్‌ పదవిని గడ్డిపోచలా వదిలి తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షకు గొంతుకై ఉద్యమంలోకి దూకారు. పార్టీ ఆవిర్భావ సందర్భంలో కేసీఆర్‌ను అనేక మంది వ్యతిరేకించారు. కానీ ఆయన మాత్రం అవేమీ లెక్క చేయలేదు. ఉద్యమంలోకి దూకినపుడే స్వార్థం అన్న పదానికి ఆస్కారం లేకుండా ‘అయితే హీరో లేదంటే జీరో’ అనే నినాదంతో ఉద్యమాన్ని మొదలుపెట్టారు. కేవలం తన మాటల్ని మాత్రమే పెట్టుబడిగా చేసుకుని మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని గల్లి నుంచి ఢిల్లి దాకా, ఢిల్లి నుంచి ఖండాంతరాల దాకా ఉద్యమ నినాదాన్ని తీసుకువెళ్లారు.

- Advertisement -

అపర చాణక్యుడు

ఆర్థికంగా అంత స్థోమత లేకపోయినా, రాజకీయంగా వారసత్వం లేకపోయినా కేవలం ధైర్యం, తెలంగాణ సెంటిమెంటు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఆయుధంగా చేసుకుని రాజకీయాల్లో గట్టిగా నిలదొక్కుకున్న ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్‌. ఇది అసాధరణం. దేశరాజకీయాల్లో ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా.. ఇలా రాష్ట్రాన్ని సాధించి, తానే పాలించిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్‌. ఆయన అపర చాణక్యుడు. ఎత్తుగడల్లో తిరుగులేని నాయకుడు.

తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ చచ్చుడో..

తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ చచ్చుడో.. ఇలాంటి నినాదం ఇవ్వాలంటే ఎన్ని గుండెలుండాలి? ఎంత ధైర్యం కావాలి? తెలంగాణ రాష్ట్రం వచ్చే దాకా.. నేను లక్ష్యం నుంచి పక్కకు జరగ.. నేను లక్ష్యం నుండి పక్కకు జరిగితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి.. ఇలాంటి మాటలు మాట్లాడాలంటే ఎంత నిబద్దత ఉండాలి.

దటీజ్‌ కేసీఆర్‌

కేసీఆర్‌ నిలువెత్తు మానవతామూర్తి. అందుకే ఆయన పథకాల్లో మానవీయత కనిపిస్తుంది. మానవీయ పాలన.. దేశంలోని మిగతా ముఖ్యమంత్రులకు, పాలనాదిగ్గజాలకు భిన్నమైన దారిలో పయనం. ఇవే కేసీఆర్‌ను హీరోలా నిలిపాయి. ఆయన ఏ పనిచేసినా సాధారణంగా ఉండదు. ముందు ఇది అయ్యేపని కాదనిపిస్తుంది. ఆయన ప్రయత్నం ప్రారంభించాక ఇది కాదు.. వృధాప్రయాస అనిపిస్తుంది. ప్రయత్నం మరికొంత ముందుకు వెళ్ళాక అవును అవుతుందేమో.. న్యాయం కదా అనిపిస్తుంది. తర్వాత దటీజ్‌ కేసీఆర్‌. అసాధ్యాలను సుసాధ్యం చేశాడనిపిస్తుంది. స్థూలంగా ఇదీ కేసీఆర్‌ అంటే. రాజకీయ నిర్ణయమైనా.. పాలనానిర్ణయాలైనా కేసీఆర్‌ అందరి దారిలో వెళ్ళడు. ఆయన దారి ప్రత్యేకం. ఆలోచన ప్రత్యేకం. అందరూ వెళ్ళే మూసదారి కాదు.. ముళ్ళబాట అయినా భవిష్యత్తును అద్భుతంగా మార్చేదానినే ఎన్నుకుంటాడు. ఆయన ఆలోచన నిత్యనూతనం. ఆయన ఆచరణ భవిష్యత్తుకు మార్గదర్శనం.

Advertisement

తాజా వార్తలు

Advertisement