Monday, April 29, 2024

కోహినూర్.. కరువు.. షర్మిలక్క..!

హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వైఎస్ఆర్ అభిమానులు, మద్దతుదారులతో వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల ప్రసంగించారు. కోహినూర్ వజ్రం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే పుట్టిందని, కానీ కరువు జిల్లా, వలసల జిల్లాగా పాలమూరు జిల్లా మారిపోయిందని ఆమె అన్నారు. నాన్న వైఎస్ఆర్ తలపెట్టిన కోయిల్‌సాగర్, కల్వకుర్తి లాంటి ప్రాజెక్టుల ద్వారా 15 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని ఆయన చెప్తుండేవారని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడే 80, 90 శాతం పూర్తయిన ఆ ప్రాజెక్టులు ఇప్పటికైనా పూర్తయ్యాయా అని ఆమె ప్రశ్నించారు. వలసలు ఆగిపోయాయా అని నిలదీశారు.

వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఒక్క ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు 2 లక్షల మంది లబ్ధి పొందారని ఆమె పేర్కొన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందన్నారు. రాజన్న హయాంలోని స్వర్ణ యుగం మళ్లీ తెలంగాణలో రావాలంటే వైఎస్ఆర్ అభిమానుల సలహాలు, సూచనలు ఈ రాజన్న బిడ్డకు అవసరమని, తనను ఆశీర్వదించాలని షర్మిల కోరారు. కాగా ఈనెల 9న ఆదిలాబాద్ జిల్లా నేతలతో వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. అటు ఏప్రిల్ 9న ఖమ్మం వేదికగా ఆమె పార్టీ ప్రకటన చేస్తారని, జూలై 8న హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహిస్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement