Tuesday, April 30, 2024

ఎమ్మెల్యే కానివాడు సీఎం అవుతాడా?

ఆంధ్రప్రదేశ్ లో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో జనసేనతో పొత్తుపెట్టుకొని ముందుకు సాగుతోంది. అంతేకాదు, ఏపీకి కాబోయే సీఎం పవన్ కల్యాణ్ అంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవలే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ చర్చకు దారితీశాయి. వపన్ కు బీజేపీ అధిష్ఠానం పెద్దపీట వేయబోతోందా ? అనే చర్చలు సాగుతున్నాయి. అయితే, తాజాగా ఈ అంశంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. నేరుగా ఎవరి పేరును ప్రస్తావించకుండానే ఆయన సెటైర్లు వేశారు.

ఇప్పుడు జరుగుతున్నది తిరుపతి లోక్ సభ స్థానం ఉపఎన్నికని… అలాంటప్పుడు కాబోయే సీఎం ఫలానా అంటూ బిస్కెట్ వేయడం కాక మరేమిటని విజయసాయి ఎద్దేవా చేశారు. సీఎం సీటును ఆఫర్ చేస్తున్న పార్టీకి రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేదని విమర్శించారు. దాన్ని తీసుకునే పార్టీకి కనీసం ఉనికి కూడా లేదన్నారు. ‘జోగిజోగి రాసుకుంటే బూడిద రాలిందట… కనీసం ఎమ్మెల్యే కూడా కానివాడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కుతాడట’ అని అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement