Friday, May 17, 2024

నేటి సంపాద‌కీయం – ఎవ‌రు పాపాల భైర‌వులు?

ఓడిపోయిన వారు తమ ఓటమికి ఫలానావారు కారణమంటూ ఆరోపణలు చేయడం సహజమే. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎంలు) వచ్చిన తర్వాత ఇప్పుడు వాటిలో లోపాల వల్లనే ఓడిపోయామంటూ ప్రకటనలు చేయడం అందరికీ అలవాటైంది. ఇవి అమలులోకి వచ్చి మూడు దశాబ్దాలుదాటినా ఇప్పటికీ వీటినే పాపాలభైరవులుగా చేసి తమ వైఫల్యాల ను కప్పిపుచ్చుకోవడానికి రాజకీయ పార్టీల నాయకులు ప్రయత్నించడం విడ్డూరం. ఉత్తరప్రదేశ్‌లో ఈ వీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందని సమాజ్‌వాదీ పార్టీ నాయకు డు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ గురువారం ఫలితాలు వెలువడటానికి ముందే ఆరోపించారు. వారణాసిలో ఒక డిస్ట్రిక్టుమేజస్ట్రేట్‌ (డిఎం) సస్పెన్షనే ఇందుకు నిదర్శనమని అన్నారు.అయితే, ఆరోపణలు రావడంతో ఆ అధికారిని పారదర్శకత కోసం ప్రధాని మోడీ ఆదేశంపై ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసిందనీ,అంతమాత్రాన అక్రమా లు జరిగాయని నిర్ధారణకు రావడం సరికాదని కమలనాథులు వాదిస్తున్నారు.ఈవీఎంలపై ఇప్పుడే కాదు.. ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఆరోపణలు వస్తున్నాయి.

వాటిపై ఎలక్ట్రానిక్‌ నిపుణులు ఆ యంత్రాలతో ప్రదర్శనను నిర్వహించి అక్రమాలు జరపడానికి వీలు లేకుండానే వీటిని తయారు చేస్తున్నట్టు వివరణలు ఇస్తున్నారు. ఆ ఆరోపణల వాడివేడి కొద్దిరోజులు మాత్రమే ఉంటుంది. ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ వస్తుంటాయి. అఖిలేష్‌ యాదవ్‌కి ఈ ఎన్నికల్లో తమ పార్టీకి ఎక్కువ సీట్లు రావడంతో శుక్రవారం స్వరం మార్చారు. ప్రధానమంత్రి స్వయంగా సుడిగాలి పర్యటనలు జరిపి దాదాపు ప్రతినియోజకవర్గంలో ప్రచారం చేసినా కిందటి సారి కన్నా తక్కువ సీట్లు వచ్చాయంటే ఆ పార్టీ పట్ల వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని అఖిలేష్‌ తాజాగా వ్యాఖ్యానించారు. అయితే, ఈవీఎంలపై ఆరోపణను తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ అందుకున్నారు. వారణాసి డిస్ట్రిక్ట్‌ మేజస్ట్రేట్‌ సస్పెన్షన్‌కి దారి తీసిన సంఘటనపై విచారణ జరిపించాలనీ, ఏ ఈవీఎం కారణంగా ఆ అధికారి సస్పెన్షన్‌కి గురి అయ్యారో ఆ ఈవీఎంపై ఫోరెన్సిక్‌ తనిఖీ జరిపించాలని ఆమె డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు అలాంటి హక్కు ఉన్న మాట నిజమే అయినప్పటికీ, ఇవే ఈవీఎంలను పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లి ఎన్నికల్లోనూ ఉపయోగించారు. అప్పుడు రాని అనుమానం ఆమెకు ఇప్పుడెందుకు వచ్చిందని కమలనాథులు నిలదీస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ అన్ని పార్టీలనూ సంప్రదించి, అందరి అభిప్రాయాలను సేకేరించిన తర్వాతే వీటిని ప్రవేశపెట్టింది.

ఈవీఎంలపై విరుచుకుని పడటం ఓటమి చెందిన పార్టీలకు ఒక అలవాటుగా మారింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు రెండేళ్ళ తర్వాత వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌ కావని కూడా అన్నారు. అది నిజమే. ఈలోగా గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో కూడా అసెంబ్లి ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో సాధించిన విజయోత్సాహంతో ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం నాడు అహ్మదాబాద్‌లో భారీ రోడ్‌ షో నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవాల్సిన అవసరాన్నిమమత ఈ ఫలితాల నేపథ్యంలో గుర్తించారు. గోవాలో కాంగ్రెస్‌తోపొత్తు పెట్టుకోకపోవడం వల్లనే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న వాస్తవాన్ని ఆమె గుర్తించారు. కాంగ్రెస్‌ ఆధారపడదగ్గ పార్టీ కాదని అంటూనే ఆ పార్టీ పొత్తుకోసం ముందుకు వస్తానంటే కాదంటామా అని ప్రశ్నించారు. అంటే కాంగ్రెస్‌ని దూరంగా ఉంచి బీజేపీతో పోరాటం సాగించలేమన్న వాస్తవాన్ని కూడా ఆమె గ్రహించారు. మూడు దశాబ్దాల నుంచి ఈ అంశంపై కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలు మథనం చేస్తున్నాయి. ఇటీవల కూడా ప్రాంతీయ పార్టీల న్నింటినీ కలిపి ఒక కూటమిగా ఏర్పాటు చేయాలని మమత ప్రతిపాదించారు.

అయితే ఆచరణలో అది సాధ్యం కాదని ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు అంగీకరిస్తూ ఉంటారు. కాంగ్రెస్‌ కలిసి రాకపోవడానికి, కాంగ్రెస్‌ని కలుపుకుని వెళ్లలేకపోవడానికి కారణాలేమి టో ఆమెకు తెలుసు.ఆమాటకొస్తే దేశ ప్రజలందరికీ తెలుసు. తాజా ఫలితాల నేపథ్యంలో బీజేపీయేతర పార్టీలు ఐక్య సంఘటన కోసం ప్రయత్నించే సందర్భం లో కాంగ్రెస్‌ని కలుపుకుని వెళ్ళాల్సి ఉంటుంది.అలాగే, కాంగ్రెస్‌ కూడాగతంలో మాదిరిగా తమ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండాఉందని అనుకుంటే అది భ్రమే అవుతుంది. ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీకి ఈసారి వచ్చిన ఓటు షేర్‌ 2శాతంకూడాలేదు.ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్షాలు కసరత్తు చేయాలి తప్ప ఊహాజనితమైన లెక్కలతో బరిలోకి దిగితే మళ్ళీ పరాభవం తప్పకపోవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement