Friday, April 26, 2024

నేటి సంపాదకీయం – ఉక్రెయిన్‌లో ప్రచ్చన్నయుద్ధం

అమరికా, సోవియట్‌ యూనియన్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు లేకపోయినా, సోవియట్‌ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత కూడా గతంలో దానికి నేతృత్వం వహించిన రష్యా పాతధోరణిలోనే వ్యవహరిస్తూండటంతో తాజాగా సమస్యలు తలెత్తుతున్నాయి. ఉక్రెయిన్‌లో తాజా పరిణామాలే ఇందుకు నిదర్శనం. ఉక్రెయిన్‌ గతంలో సోవియట్‌ యూనియన్‌లో అంతర్భాగంగా ఉండేది. ప్రస్తుతం స్వతంత్ర దేశంగా ఉన్న ఆ దేశంలో అసంతృప్తి వర్గాలను ఎగదోస్తూ రష్యా అశాంతిని సృష్టిస్తోందని అమెరికా, దాని మిత్ర దేశాలూ ఆరోపిస్తున్నాయి. అయితే, గతంలో తమ దేశంలో అంతర్భాగంగా ఉండటం వల్ల ఉక్రెయిన్‌లో తమ ఆస్తులను కాపాడుకోవడానికి, తమదేశస్థుల రక్షణకు జోక్యం చేసుకోవల్సి వస్తున్నట్టు రష్యా చెబుతోంది. అమెరికా కన్ను ఉక్రెయిన్‌పై పడటంతోముందు జాగ్రత్త కోసం రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో తమ భూభాగంలో లక్ష మంది సైనికులను మోహరించింది. అమెరికా ఏ క్షణంలో దాడి
చేసినా తిప్పికొట్టేందుకు ఈ సైన్యాన్ని సరిహద్దులలో సిద్ధం చేసినట్టు రష్యా చెబుతోంది. అయితే, గతంలో ఉక్రెయిన్‌లోని క్రిమియా ప్రాంతాన్ని సొంతం చేసుకున్నట్టే రష్యా ఉక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాలను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. క్రిమియా ద్వీపాన్ని 2014లో రష్యా సొంతం చేసుకున్నప్పటి నుంచి ఉక్రెయిన్‌లో ఏదో రీతిలో అశాంతి చెలరేగుతోంది. అంతకు ఒక ఏడాది ముందే ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్‌ యనుకోచ్‌పై సాయుధ తిరుగుబాటు జరగడంతో ఆయన రష్యా వెళ్ళి అక్కడ తలదాచుకున్నారు. ఇప్పుడు ఆయన అందిస్తున్న సమాచారం ప్రకారమే ఉక్రెయిన్ లోని ఇతర ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి రష్యా ప్రయత్నిస్తోందన్నది అమెరికా,
ఆ దేశం నేతృత్వంలోని నాటో కూటమి దేశాల అనుమానం.

అయితే, తమ ప్రాంతంలో అమెరికాకు ఎటువంటి పని లేకపోయినాపొరుగు దేశాలను ఉసిగొల్పుతూ ఉక్రెయిన్‌లో అశాంతిని అమెరికా సృష్టిస్తోందని రష్యా ఆరోపిస్తోంది. మరో వంక చైనా ఈ పరిణామాలను శ్రద్ధగా గమనిస్తోంది. దక్షిణ చైనాసముద్ర తీరంలోని దీవులపై పెత్తనం కోసం చైనా సాగిస్తున్న యత్నాలను అమెరికా వ్యతిరేకిస్తోంది. దక్షిణ చైనా సముద్ర తీర ప్రాంతమంతా తమ అధీనంలోనిదేననీ, తీర ప్రాంతాల్లోని వియత్నాం, తదితర దేశాలు తమకు అనుకూలంగానే ఉండేవనీ, ఇప్పుడు అమెరికా ఉసిగొల్పడం వల్ల తమపై కాలుదువ్వుతున్నాయని చైనా ఆరోపిస్తోంది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో దీవులను కైవసం చేసుకోవడానికి చైనా అనుసరిస్తున్న విధానాలనే, ఉక్రెయిన్‌, దానితో పాటు స్వతంత్ర దేశాలైన ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌ అంతర్భాగ దేశాలను తన అధీనంలోకి తెచ్చుకోవడానికి
రష్యా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రష్యాకు చైనా నైతిక మద్దతు ఇస్తోంది. ఈ దేశాలకు రష్యా మద్దతు ప్రకటిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా హెచ్చరించింది. అఫ్ఘ‌నిస్తాన్‌లో ఇరవై ఏళ్ళ క్రితం జోక్యం చేసుకుని ధన, ప్రాణనష్టాన్ని చవి చూసిన అమెరికా ఇప్పుడు ఉక్రెయిన్‌లో నేరుగా జోక్యం చేసుకోకుండా, చుట్టుపక్కల దేశాలను పురికొల్పుతోంది. ఉక్రెయిన్‌లోప్రస్తుత అశాంతికి మూల కారణం అదే.

అయితే, ఉక్రెయిన్‌లో ప్రజా స్వామ్యం, ప్రాంతీయ సమగ్రతలను కాపాడేందుకే జోక్యం చేసుకుంటునాం అంటూ అమెరికా చేస్తున్న వాదనను రష్యా తోసిపుచ్చుతోంది. ఉక్రెయిన్‌తో అమెరికాకు ఏ విధంగానూ సంబంధం లేదనీ, ఒకప్పుడు తమ దేశం నేతృత్వంలోని యూఎస్‌ఎస్‌ఆర్‌ కూటమిలోని దేశాలకు తమ దేశం మద్దతు ఇవ్వడం తప్పులేదని రష్యా వాదిస్తోంది. గతంలో అగ్రరాజ్యాల మధ్య ప్రచ్ఛన్నయుద్దం జరిగినట్టుగానే ఇప్పుడు అమెరికా, రష్యాలమధ్య ప్రచ్చన్నయుద్ధం సాగుతోంది. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణను ఆసరాగా చేసుకుని ఈ ప్రాంతంలో జోక్యం చేసుకునేందుకు చైనా తగిన అవకాశం కోసం ఎదురుచూస్తోంది. చైనా ఇప్పుడు తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలన్న కాంక్షతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. వివాదాన్ని సమసిపోయేట్టు చేయగలిగితే చేయాలి కానీ, ఆజ్యం పోసి పెద్దది చేయాలని ఏ
దేశం ప్రయత్నించినా అది తప్పే. ఉక్రెయిన్‌లో పలు ప్రాంతాల్లో ప్రజలు పూర్వపు అనుబంధాన్ని బట్టి రష్యా వైపే మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వచ్చాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement