Monday, April 29, 2024

నేటి సంపాదకీయం-తీరు మారని పార్లమెంటు!

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఒక రోజు ముందే ముగిశాయి. ఈసారి సమావేశాల్లో ప్రతిపక్షాల డిమాండ్లకు కేంద్రం దిగి వచ్చింది. ముఖ్యంగా, ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రెండింటిని ప్రైవేటీకరణ చేయడం కోసం ప్రభుత్వం తలపెట్టిన యత్నాన్ని ప్రతిపక్షాలు అడ్డుకోగలిగాయి.అలాగే, క్రిఎ్టో కరెన్సీ విషయంలో ప్రభుత్వం తొందరపాటును నిరోధించగలిగాయి. నవంబర్‌ 29వ తేదీన ప్రారంభమైన ఈ సమావేశాల్లో పదకొండు బిల్లులను ఆమోదించినట్టు ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ ఈ సమావేశాలు ఇటు ప్రభుత్వానికీ, అటు ప్రతిపక్షాలకు మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. ఢిల్లి సరిహద్దులలో సాగిన రైతుల ఆందోళనను విరమింపజేయడం కోసం వ్యవసాయ బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. బ్యాంకుల ప్రైవేటీకరణ అంశంపై ఈసారి ప్రతిపక్షాలు గట్టిగా ప్రతిఘటించడం వల్లనే ప్రభుత్వం ఇందుకు సంబంధించిన బిల్లును పక్కన పెట్టింది. ప్రభుత్వరంగంలో 27 బ్యాంకులుండేవి. మోడీ ప్రభుత్వం వాటిని 12కి తగ్గించింది. ఇంకా తగ్గించడం భావ్యం కాదని ప్రతిపక్షాలు వాదించాయి.

బ్యాంకుల ప్రైవేటీకరణపై ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా, దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల సమ్మె నిర్వహించి ప్రభుత్వం పై ఒత్తిడి తేవడం ఒక కారణం కావచ్చు. అంతేకాకుండా, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా రిజర్వేషన్ల అమలు బాధ్యతనుంచి తప్పించుకోవచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా కనిపిస్తోందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తడంతో ప్రభుత్వంవెనక్కి తగ్గింది. ఇందుకు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లి ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే సాగు చట్టాల ఉపసంహరణ, బ్యాంకుల ప్రైవేటీకరణ, క్రిఎ్టోకరెన్సీ అంశాలపై ప్రభుత్వం వెనకడుగు వేసిందన్న విశ్లేషకుల వ్యాఖ్యలు వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మళ్ళీ యోగి ఆదిత్యనాథ్‌దే అధికారమని బీజేపీ చెప్పు కుంటున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయని ప్రతిపక్షాలు నిర్వహించిన సర్వేల్లో స్పష్టం అవుతోంది.

సాగు చట్టాలపై ఆందోళన సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ లఖింపూర్‌ ఖేరీలో రైతులపై నుంచి ట్రాక్టర్లను నడిపించింది కేంద్ర మంత్రి కుమారుడేనని సిట్‌ దర్యాప్తులో నిర్ధారణ కావడంతో ఆ మంత్రి రాజీనామా కోసం ప్రతిపక్షాలు పట్టుబట్టిన కారణంగా ప్రస్తుత సమావేశాల చివరలో సభలు సజావుగా నడవలేదు. అలాగే, కిందటి సమావేశాల్లో రాజ్యసభలో జరిగిన ఘటనలకు సంబం ధించి 12మంది సభ్యులను ఈ సెషన్‌లో సస్పెండ్‌ చేసిన అంశంపై సభను సభ్యులు అడ్డుకున్నారు. దేశంలో కరోనా తరంగాలు తగ్గినట్టు కనిపిస్తున్నా, దాని స్థానే ఒమిక్రాన్‌ వైరస్‌ విజృంభించడం గురించి పార్లమెంటులో తగిన రీతిలో చర్చ జరగలేదన్న అసంతృప్తి ప్రజల్లో వ్యక్తం అవుతోంది. రిజర్వు బ్యాంకు తొందరపడవద్దన్నా క్రిఎ్టో కరెన్సీకి సంబంధించిన బిల్లును ఈ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించింది. క్రిఎ్టో కరెన్సీకి సంబంధించిన విధి విధానాలు ఖరారు కాకపోవడమే ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి కారణంగా తెలుస్తోంది.. ఈసారి సమావేశాలను సక్రమంగా సాగనీ యకపోవడం పట్ల రాజ్యసభ చైర్మన్‌,ఉపరాష్ట్రపతి ఎం, వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో ప్రధాన సమస్యలను గురించి చర్చించడానికి బదులు పరస్పర ఆరోపణలతో సభ్యులు సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆయన అన్నారు.. సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నప్పటికీ రైతుల సమస్యలపై ప్రభుత్వం సక్రమంగా స్పందించలేదన్న ఆరోపణలు వచ్చాయి. ధాన్యం కొనుగోలు వ్యవహారాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రధానాంశంగా తీసుకుని కేంద్రంనుంచి లిఖితపూర్వకమైనహామీని రాబట్టడానికి రాష్ట్ర మంత్రులు ఢిల్లిలో తిష్ట వేయడం, వారిపై కేంద్ర మంత్రి గోయెల్‌ వ్యాఖ్యలు చేయడం వివాదానికి కారణమైంది. రైతుల పట్ల బీజేపీ చులకన భావానికి ఇది నిదర్శనమని తెరాస మంత్రులు ఢిల్లిలో పత్రికాగోష్టినిర్వహించి ఎండగట్టారు. కేంద్రం నుంచి నిర్దిష్టమైన హామీని రాబట్టడంలో తెలంగాణ మంత్రుల యత్నాలు ఫలించకపోయినా, ధాన్యం కొనుగోలు అంశాన్ని జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేట్టు చేయడం విశేషమే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement