Thursday, May 2, 2024

నేటి సంపాద‌కీయం – గ్రామాల‌కు అంద‌ని వైద్యం..

వైద్యులను నారాయణునితో పోల్చిన సంస్కృతి మనది. అటువంటి వైద్యులు ఇప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వైద్యుల్ని తయారు చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు లెక్కకు, మిక్కిలిగా పుట్టు కొస్తున్నాయి. ప్రైవేటు కళాశాల్లలో సీట్లను మేనేజిమెంటు కోట, ఎన్నారై కోటా తదితర కోటాలతో భర్తీ చేస్తుండటం వల్ల కోట్లు ఖర్చు చేస్తే కానీ, ప్రైవేటు కాలేజీల్లో సీటు దొరకదన్న అభిప్రాయం జనంలో నాటుకుని పోయింది. ప్రభుత్వ కళాశాల్లో కూడా ఒక్కొక్క వైద్య విద్యార్ధిపై పాతిక నుంచి ముప్పయి లక్షలు ఖర్చు అవుతోందని ప్రభుత్వం పేర్కొంది వైద్య విద్యలో కూడా ఇతర వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. దీంతో ఓబీసీ విద్యార్ధులకు 27 శాతం రిజర్వేషన్లు లభిస్తాయి. ఓబీసీలకు విద్యా, వైద్య రంగాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని 32 సంవత్సరాల క్రితం మండల్‌ కమిషన్‌ సిఫార్సు చేసింది. ఆర్థికంగా వెనకబడిన విద్యార్ధులకు పది శాతం రిజర్వేషన్లను కల్పించాలని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో బోధన విషయంలో కానీ, రిజర్వేషన్ల విషయంలో కానీ, వృత్తివిద్యా కోర్సులకు వెళ్లేందుకు ఏ ప్రభుత్వమూ సాహసించలేదు. ఒక వేళ ఇవ్వాలని తలపెట్టినా ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత కారణంగా ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయి.

ఈ నిర్ణయం వల్ల ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఒబీసీలకు ఎంబీబీఎస్‌ కోర్సుల్లో 1500 సీట్లు లభిస్తాయి. అలాగే, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు పది శాతం కోటా కింద 550 సీట్లు లభిస్తాయి. పీజీ కోర్సులలో ఒబీసీ లకు 2.500 సీట్లు, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు వెయ్యి సీట్లు లభిస్తాయి. వృత్తి విద్యా కోర్సుల్లో కోటా పద్దతిని 2007 వరకూ అమలు జేయలేదు. అప్పట్లో సుప్రీంకోర్టు ఇచ్చినతీర్పు ప్రకారం ఎస్సీలకు15 శాతం, ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్లను కల్పించారు. తమకు కూడా అదే మాదిరిగా 27 శాతం కోటా అమలుజేయాలని ఒబీసీలు ఆందోళనచేస్తున్నారు. గతంలో మెడికల్‌ కాలేజీలు ఎక్కువగా ఉండేవి కావు. దాంతో రిజర్వేషన్ల అమలు చాలా కష్టంగా ఉండేది.

జిల్లాకో మెడికల్‌ కాలేజీని మంజూరు చేసేందుకు మోడీ ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా, ఇకపైన మెడిసిన్‌లో సీట్లు దొరకడం కష్టం కాకపోవచ్చు. అయితే, అందరికీ ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు దొరకవు కనుక, ప్రైవేటు కాలేజీలకు వెళ్ళాల్సి వస్తుంది. ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు భరించలేక ఎక్కడ ఫీజులు చౌకగా ఉంటాయో అక్కడికి వైద్యవిద్యార్ధులు వెళ్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన సందర్భంలో అక్కడ వైద్యవిద్య తక్కువ వ్యయంతో లభిస్తోందన్న విషయంలోకానికి తెలిసింది. కోచింగ్‌ కేంద్రాలవారు విద్యార్ధులను గ్యారంటీగా ఉక్రెయిన్‌ వంటి విదేశాలకు పంపిస్తామన్న హామీతో విద్యార్ధులను తయారు చేయడం అంతకుముందు నుంచి జరుగుతోంది. ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ విద్యార్ధుల్లో తెలుగువారు వేలాది మంది ఉన్నారు. అక్కడ సంక్షోభంతో వారంతా హైదరాబాద్‌కి వచ్చారు. వారందరి చదువులు వృధా కాకుండా హైదరాబాద్‌లోని వైద్య కళాశాలల్లో సీట్లు లభించేట్టు చూస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హామీ ఇచ్చి అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. కరోనా సమయంలో వైద్యుల కొరత మనకు తెలిసొచ్చింది. ప్రైవేటు ఆస్పత్రులతో సమానంగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సౌకర్యాలను మెరుగుపర్చేందుకు తెలుగు రాష్ట్రాలు కృషి చేస్తున్నాయి.

కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్‌ చర్యలు తీసుకున్నారు. తెలంగాణలో వైద్య శాఖ మంత్రి హరీష్‌రావు ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను మార్చేందుకు శ్రమిస్తున్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రుల్లో ఆధునిక సౌకర్యాలను కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఏటా వైద్య విద్యను పూర్తి చేసిన వారి సంఖ్య పెరుగుతున్నా, పట్టాలు పొందిన వారు ప్రైవేటు ఆస్పత్రుల వైపు చూడటం, విదేశాల్లో మంచి అవకాశాలు వస్తే వెళ్ళిపోవడం చేస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వాలు మారినా, ఈ సమస్య ఎన్నటికీ పరిష్కారం కాకపోవడానికి వైద్యవృత్తిలో సేవా భావం లోపించడమే. గ్రామాల్లో వైద్యల కొరత ఎంతో కాలంగా కొనసాగుతున్నా కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కొత్తగా వైద్య పట్టా పొందినవారు తప్పనిసరిగా కొంతకాలంపాటు గ్రామాల్లో పనిచేయాలన్న నిబంధనను ఎవరూ పాటిం చట్లేదు. అలాగే రోగులకు ప్రాణాపాయ పరిస్థితులలో ఆదుకునే ఏర్పాట్లు కూడా లేవు.

Advertisement

తాజా వార్తలు

Advertisement