Saturday, October 12, 2024

నేటి సంపాదకీయం – కాల్పుల క‌ల‌క‌లం.!

హైదరాబాద్‌ ఎంపీ, మజ్లీస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ గురువారం ఉత్తరప్రదేశ్‌ లోని మీరట్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆయన కారు టైరు పంచరైంది.అద్దాలు పగిలాయి.ఆయన సురక్షితంగా బయటపడినప్పటికీ, ఈ సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని సృష్టించింది.అసదుద్దీన్‌ ఒవైసీ తమ పార్టీ తరఫున మహారాష్ట్ర, బీహార్‌ ఎన్నికల్లో అభ్యర్ధులను నిలబెట్టారు.ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లి ఎన్నికల్లో కూడా తమ అభ్యర్ధుల తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ యేతర ఓట్లను చీల్చేందుకే తమ పార్టీ అభ్యర్ధులను నిలబెట్టారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అయితే, మైనారిటీలను జాతీయ పార్టీలేవీ పట్టించుకోవడం లేదనీ, మైనారిటీల హక్కుల పరిక్షణ కోసమే తమ పార్టీ పనిచేస్తోందనీ, అధికారం, రాజకీయాలు తమ లక్ష్యంకాదని ఆయన ప్రతి సందర్భంలోనూ స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు కూడా తనకు జెడ్‌ కేటగిరి భద్రత కల్పిస్తామన్న కేంద్రం ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. ప్రజలకు రక్షణ కల్పిస్తే తనకు కల్పించినట్టేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసమే నిరంతరం పనిచేస్తున్నందున ప్రజలే తనను కాపాడుతారని ఆయన స్పష్టం చేశారు. అసదుద్దీన్‌ ప్రసంగాలల్లో తీవ్రత ఉంటుంది కానీ, వ్యక్తుల పైనో, సంస్థలపైనో ఉండదు. ఆయన ఎప్పుడు, ఎక్కడ మాట్లాడినా మైనారిటీ వర్గాలపై దాడుల గురించే. గతంలో లౌకిక వాద పార్టీలతో ఆయన ఒవైసీ జతకట్టేవారు. కాంగ్రెస్‌ సహా లౌకిక వాద పార్టీలని చెప్పుకునే పార్టీలన్నీ మైనారిటీలను ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నాయని ఆయన చాలా సార్లు ఆరోపించారు. జాతీయ స్థాయిలో మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసేందుకే అన్ని రాష్ట్రాల్లో అభ్యర్ధులను నిలబెడుతున్నట్టు పేర్కొంటున్నారు. అసదుద్దీన్‌ ప్రసంగాలు ఇంతవరకూ వివాదాలు సృష్టించలేదు. ఆయన సోదరుడు, శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రసంగాల్లో దూకుడు ఎక్కువ వల్ల గతంలో వివాదాస్పదమయ్యాయి. అసదుద్దీన్‌ పై కాల్పులు జరిపిన వ్యక్తుల్లో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. ప్రత్యేకించి ఒక మతంపై వ్యాఖ్యలు చేసినందుకే ఆయనపై కాల్పులు జరిపామని సచిన్‌ అనే వ్యక్తం తెలిపాడు. అతడి వెనుక ఎవరున్నారన్నది సమగ్ర దర్యాప్తులోనే తెలుతుంది. అతడు నోయిడాకి చెందిన వాడు. హైదరాబాద్‌లో గతంలో ఘర్షణలు జరిగేవి. వాటిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికల సభల్లో తన అభిప్రాయాలను తెలుపుకునే హక్కును మాత్రమే వినియోగించుకుంటున్నారు. ఎన్నికల ప్రసంగాల్లో నాయకులు ఎంత అదుపు చేసుకున్నా కొన్ని సందర్భాల్లో పరిధి దాటుతుంటాయి. అలాంటి సందర్భాలు అందరి విషయాల్లోనూ వస్తుంటాయి. అసదుద్దీన్‌ మాత్రం దీనివెనుక కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. బీజేపీకి మేలు చేకూర్చడం కోసమే తమ పార్టీని ఎన్నికల బరిలోకి దింపారన్న ఆరోపణలను ఆయన పలు సందర్భాల్లో తోసిపుచ్చారు. ఆ మాట నిజమే. లౌకిక వాద పార్టీల కూటముల్లో తాము డిమాండ్‌ చేసిన సీట్లు ఇవ్వ కపోవడం వల్లనే తమ పార్టీ అభ్యర్ధులను నిలబెడుతున్నామన్న ఆయన వాదన సరైనదే. అంతేకాక, తమ పార్టీ అఖిల భారత మజ్లిస్‌ పార్టీ కనుక, దేశంలో ఎక్కడైనా అభ్యర్ధులను నిలబెట్టే హక్కు తమకు ఉందన్న ఆయన వాదన కూడా సబబైనదే. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారం సాఫీగానే సాగుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇరుకున పడింది. అందుకే, ఒవైసీకి మరింత భద్రత కల్పిస్తామనీ పకటించింది. ఒవైసీ కారుపై కాల్పులు జరిపిన సచిన్‌, తదితరులు బీజేపీ సభ్యులు కాదు. అయితే, ఈ ఘటనలో ఒవైసీ సురక్షితంగా బయట పడటం సంతోషించాల్సిన విషయం. ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో పోలింగ్‌ జరగనుంది. మొదటి దశ పోలింగ్‌ కొద్ది రోజుల్లో జరగనుండగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో శాంతిభద్రతల పరరక్షణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఈ సంఘటన పర్యవసానంగా హైదరాబాద్‌లో అల్లర్లు జరగకుండా పాతబస్తీ లో బందోబస్తును రాష్ట్రప్రభుత్వం మరింత పటిష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement