Friday, December 6, 2024

నేటి సంపాద‌కీయం – విధ్వంశ‌క‌ర మ‌లుపు!

క్రెయిన్‌పై తొమ్మిది రోజులుగా దాడులు జరుపుతున్న రష్యాలో బరితెగింపు ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఉక్రెయిన్‌పై దాడికి రష్యా చెప్పే కారణాల్లో సహేతుకత ఉందని భావిస్తున్న వారిలో రష్యన్లే కాదు, మన దేశానికి చెందినవారు కూడా ఉన్నారు. అయితే, రష్యా ఇప్పుడు చేస్తున్నది యావత్‌ మానవాళి హాని తలపెట్టే యుద్ధమని ఉక్రెయిన్‌లోని జాపోరిజ్జియా అణు విద్యుత్‌ కేంద్రంపై జరిపిన దాడితో స్పష్టం అయింది. దీంతో రష్యా జరుపుతున్న దాడులు విధ్వంసకర మలుపు తీసుకున్నాయి.. అణు కేంద్రాలను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలన్న సంగతి రష్యన్‌ పాలకులకు తెలియంది కాదు. ప్రపంచంలో అత్యంత విషాదకర అణు ప్రమాదంగా ఇప్పటికీ పేర్కొనే చెర్నోబిల్‌ అణు కేంద్రంలో జరిగిన దుర్ఘటన అప్పట్లో రష్యా పరిధిలోనిదే. ఆ ప్రాంతంలో ఇప్పటికీ రేడియో ధార్మిక కిరణాలు వెలువడుతూనే ఉన్నాయి. అక్కడి నీరు, పండే ఫలాలు ఇప్పటికీ నిషిద్ధంగానే ఉన్నాయి. చెర్నోబిల్‌ ఘటన జరిగి మూడున్నర దశాబ్దాలు దాటినా ఇంకా మన స్మృతి పథంలో ఉన్నదే. అణు విద్యుత్‌ వల్ల లాభాలు అనేకం. అణు విద్యుత్‌ కేంద్రాలు స్థాపించేందుకు ప్రభుత్వాలు జరిపే ప్రయత్నాలను పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తూ ఉంటారు. మన దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ వేత్తలు అణు విద్యుత్‌ పై ఇప్పటికీ పోరాటాలు సాగిస్తున్నారు.

అయితే, అణు విద్యుత్‌ కేంద్రాల నిర్వహణ ఎంతో రిస్క్‌ తో కూడిన విషయం. అందుకే వాటికి వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతున్నాయి. అణ్వస్త్రాలు కాదు, అన్న వస్త్రాలు కావాలంటూ ప్రతి దేశంలో, నగరంలో ఇప్పటికీ ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో తమిళనా డులోనికుదంకుళం, మహారాష్ట్రలోని తారాపూర్‌, జైతాపూర్‌ అణు విద్యుత్‌ కేంద్రాలపై పర్యావరణ వేత్తల ఆందోళనలు ఇప్పటికీ సాగుతున్నాయి. అణు కేంద్రాలలో అసంకల్పితంగా చోటు చేసుకునే ఘటనలు కొన్ని అయితే, ఉద్దేశ్యపూర్వకంగా అణు కేంద్రాలపై దాడులు జరిపే వారిని మానవ జాతికి శత్రువులుగా పరిగణించక తప్పదు. ఉక్రెయిన్‌లోని జాపోరిజ్జియా అణు కేంద్రంపై రష్యన్‌ సేనలు శుక్రవారం ఉదయం జరిపిన దాడిలో ఆరు రియాక్టర్లూ సురక్షితంగా ఉన్నాయని ఉక్రెయిన్‌ ప్రభుత్వం తెలిపింది. అయితే, ఈ కేంద్రం మొత్తాన్ని రష్యన్‌ సేనలు తమ అధీనంలోకి తీసుకున్నాయనే వార్త యావత్‌ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రపంచంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో దేశాలను ఆదుకున్న రష్యా ఇప్పుడు తన ప్రతిష్ట కోసం యుద్ధం చేస్తోంది. దీంతోఉచితానుచితాలనూ, న్యాయా న్యాయాలను గురించి ఆలోచించడం లేదు. రష్యా లక్ష్యం ఉక్రెయిన్‌ని దారికి తేవడమే కావచ్చు. కానీ, ఆ దేశంలో నివసిస్తున్న ఇతర దేశాల వారు అన్యాయంగా బలి అవుతున్నారు. అణుయుద్ధం అనివార్యమంటూ ఈ దాడులు ప్రారంబమైన తర్వాత వెలువడిన వార్తలు అసత్యం కాదేమోననిపిస్తోంది.. ఉద్రిక్తతలు, ఘర్షణలు, అశాంతి మొదలైనవి అన్నీ మానవ జాతికి తీవ్రనష్టాన్ని కలిగించేవే. అణుయుద్ధమైతే అసలు మానవ జాతే నామరూపాలు లేకుండా పోతుంది.

అందుకే, అణ్వస్త్రా లకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల అధినేతలు తరచూ సమావేశాలు నిర్వహిస్తూ వాటిని నిర్మూలించాలని ప్రకటనలు చేస్తూ ఉంటారు. అయితే, వారి ప్రకటనలూ, ఆ సమావేశాల్లో వారు చేసే తీర్మానాలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. అణ్వస్త్రాలను అడ్డుపెట్టుకుని లొంగ దీసుకోవడానికి సంపన్న, అగ్రరాజ్యాలు చిన్న దేశాలను లొంగదీసుకోవడానికి గతంలో ప్రయత్నించేవి. కానీ, ఇప్పుడు చిన్న దేశాలు కూడా అణ్వస్త్రాలను కలిగి ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు మన పక్క దేశమైన పాకిస్తాన్‌ పేదరికానికి చిరునామాగా మారినా, అణు శక్తి సామర్ధ్యాన్ని సంపాదించింది. అణ్వస్త్రాల పట్ల అణువణువునా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా, పలు దేశాలు వాటిపై మోజును పెంచుకుంటున్నాయి. రష్యా చేసిన దాడి వల్ల అణు కేంద్రంలో రియాక్టర్లకు నష్టం జరగకపోయినా, దాడి ప్రభావం ఉంటుందేమోనన్న భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. దీనిపై అమెరికా, ఇతర దేశాలు తీవ్రంగా స్పందించాయి. చైనా కూడా అణు ధార్మిక కిరణాలు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని పిలుపు ఇచ్చింది. అణు కేంద్రంపై జరిపిన దాడి వ్యూహాత్మిక తప్పిదమని రష్యా కూడా త్వరలోనే గుర్తిస్తుంది. ఇది నిప్పుతో చెలగాటమని తెలుసుకుంటుంది. అణ్వస్త్రాలను ఉపయోగించిన వారినీ, అణు కేంద్రాలపై దాడికి పాల్పడిన వారిని మానవ జాతి క్షమించదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement