Tuesday, April 30, 2024

ద్వేష సంస్కృతికి ముకుతాడు

మన రాజ్యాంగం లౌకిక వాదానికి పెద్ద పీట వేసింది. రాజ్యాంగం ప్రియాంబిల్‌లో (పీఠికలో) మనది లౌకిక వాద దేశమని రాసుకున్నాం. కానీ, దేశంలో వివిధ వర్గాల ప్రజల మధ్య సామరస్యం మాత్రం ఇంకా అందని పండులా ఉంది. ఈ విషయాన్ని జాతీయ స్థాయి సదస్సుల్లో అనేకసార్లు పలువురు ప్రముఖులు ప్రస్తావించినా ప్రజల వైఖరిలో మార్పు ఉండటం లేదు. ప్రజలు కులం, మతం, వర్గం పేరిట దూషించుకోవడం, కులం, మతం పేరు పెట్టి పిలుచుకోవడం ఇంకా సాగుతూనే ఉంది. సామరస్యం కొనసాగుతున్నప్పుడు జనం ఇవేమీ పట్టించుకోరు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కలసిమెలిసి సహజీవనం సాగిస్తున్న ప్రజల్లో కొన్నివర్గాల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే ఎందుకు భగ్గుమంటోంది? ప్రతి అంశంలో రాజకీయం చోటు చేసుకోవడంవల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోందన్న విశ్లేషకుల భావన నూరు శాతం నిజం. మన దేశంలో ఎన్నో సంవత్సరాలుగా వివిధ జాతులు, మతాలు, వర్గాల వారు కలసిఉండటం వల్లనే భిన్నత్వంలో ఏకత్వంగల దేశమనే పేరు వచ్చింది. స్వాతంత్య్రానంతరం మన పాలకులు అదే పంథాలో దేశాన్ని నడిపించారు. జాతిపిత మహాత్మాగాంధీ, తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, మాజీ ప్రధానులంతా అదే స్ఫూర్తితో పాలన సాగించారు. జాతీయ పండుగల సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ, జాతీయ గీతాలాపన వంటివి క్రమం తప్పకుండా మనం నిర్వహించుకుంటున్నాం.

గతంలో జాతీయ పండుగల కు మాత్రమే జాతీయ సెలవు దినాలు ఉండేవి. ఇప్పుడు వివిధ వర్గాల నుంచి ఒత్తిడుల కారణంగా అన్ని మతాల పండుగలకు సెలవులిస్తున్నారు. అంటే అందరికీ సమాదరణ లభిస్తోందన్నమాట. అయినప్పటికీ, కుల, మతాల పేరిట తిట్టుకోవడం, కొట్టుకోవడం దేనికన్న ప్రశ్నకు ఆధిపత్యం కోసమేనని ఠక్కున సమాధానం చెప్పవచ్చు. తిట్లు, శాపనార్థాలు గాలికి పోతాయనీ, వాటిని పట్టించు కోనవసరం లేదని పూర్వకాలపు వారు సర్దుకుని పోయే వారు. కానీ, వాటికీ ఓ హద్దు ఉంటుంది కదా? ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో ద్వేష సంస్కృతిని వ్యాపింప జేసే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ముఖ్యంగా, రాజకీయ వ్యవస్థలో వచ్చిన మార్పులు కారణంగా ఈ ధోరణి మరింత పెరిగింది. దీనిపై సర్వోన్నత న్యాయ స్థానం చేసిన వ్యాఖ్యలు ఎంతో ప్రాధాన్యతను సంతరిం చుకున్నాయి. గతంలో పార్లమెంటూ, అసెంబ్లిలకు ఒకేసారి ఎన్నికలు జరిగేవి. ఇప్పుడు విడివిడిగా ఎన్నిక లు జరుగుతుండటం, మధ్యలోఉప ఎన్నికలు ఉప ద్రవంలా మీద పడుతుండటం వల్ల సమాజంలో చీలిక ధోరణులు శాశ్వత మయ్యాయి. గతంలో ఎన్నికల సమ యంలో మాత్రమే ఇవి కనిపించేవి. ఎన్నికలైన తర్వాత అంతా కలసిమెలిసి తిరిగేవారు. పెళ్ళిళ్ళు, ఇతర శుభ కార్యాలయాలకు పరస్పరం ఆహ్వానించుకునే వారు. రంజాన్‌ పండుగ సందర్భంగా ఇఫ్తార్‌ విందుకు హిందు వులు హాజరు కావడం ఇప్పటికీ చూస్తున్నాం.

అలాగే, వినాయకచవితి, దేవీ నవరాత్రి ఉత్సవాలకూ, దీపావళి వేడుకలకు ముస్లిం సోదరులు హాజరు కావడాన్ని చూస్తున్నాం. ఇంతటి సామరస్యం, సౌమనస్యం వెల్లివెరిస్తున్న వాతావరణాన్ని రాజకీయాలు కలుషితం చేస్తున్నాయి. దేశంలో క్రమంగా ద్వేష సంస్కృతి వ్యాపిస్తోంది. ఇది ఒక్క రోజులో జరిగింది కాదు. చాపకింద నీరులా దశాబ్దా లుగా సాగుతోంది. ద్వేష సంస్కృతి, ద్వేష భావాలను వ్యాప్తి చేసే వారిపై గతంలో ఫిర్యాదులు వస్తేనే పోలీసులు కేసులు నమోదు చేసేవారు. ద్వేషపూరిత ప్రసంగాలు చేసే వారిపై పోలీసులు, భద్రతా సంస్థలు సూమోటో కేసులు నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది చాలా తీవ్రమైన విషయం. గతంలో మందలించి వదిలి వేసేది. ఇప్పుడు రోజుకు ఇలాంటి కేసులు ఎన్నో కేసులు వస్తుండ టం వల్లనే ఇంతటి ఘాటైన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసింది. గతంలో గోసంరక్షకుల మని చెప్పుకుంటూ కొందరు సమాజంలో అట్టడుగు వర్గాలైన దళితులపై దాడులు చేసినప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇంత తీవ్రంగానూ స్పందించింది. ద్వేషా న్ని వెళ్ళగక్కే వ్యక్తులు, సంస్థలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పటికప్పుడు చర్యలు తీసుకోకపోవడం వల్లనే పరిస్థితి విషమిస్తోందని సుప్రీంకోర్టు బెంచ్‌ ఆవేదన వ్యక్తం చేసింది. విద్వేష బీజాలు మొలకలెత్తినప్పుడే వాటిని తుంచివేసినప్పుడే ద్వేషపూరిత వాతావరణం పెరిగి ఉండేది కాదన్న సుప్రీంకోర్టు ఆవేదనలో ఎంతో వాస్తవం ఉంది. ఢిల్లిలో పర్వేష్‌ వర్మ అనే బీజేపీ ఎంపీ చేసిన ప్రసంగాలపై ఎటువంటి చర్య తీసుకున్నారంటూ ఢిల్లి పోలీసులను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే, ఢిల్లిలో పోలీసు యంత్రాంగం అంతా కేంద్ర హోంశాఖకు లోబడి పని చేస్తుంది. అధికార పదవుల్లో ఉన్న వారు మరింత బాధ్యతగా మాట్లాడటం, నడుచుకోవడం అత్యవసరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement