Wednesday, May 1, 2024

Editorial – మ‌ళ్లీ ఉమ్మ‌డి పౌర‌స్మృతి మాట …

ఒకే దేశం..ఒకే చట్టం.. అనేది భారతీయ జనసంఘ్‌ నినాదం. ఆ పార్టీ రూపాంతరమైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన ఎన్నిక ప్రణాళికలో దీనిని చేర్చింది. భారతీయులంతా ఒకటేనన్న సమైక్య భావనను ఇది ప్రోది చేస్తుందనేది ఆ పార్టీ విశ్వాసం. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఉమ్మడి పౌరస్మృతి గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ఒక దేశంలో కొందరికి రెండు చట్టాలు ఎందుకు వర్తించాలన్నది ఆయన వాదన. ఈ ఏడాది ఐదు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు, వచ్చే ఏడు సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతాయి. ఉమ్మడి పౌరస్మృతి నినాదం ఆ పార్టీ దృష్టిలో మంచిదే కావచ్చు. కానీ, బహుళత్వాన్ని కలిగి ఉన్న మనదేశలో తరతరాలుగా రెండు చట్టాలను అనుభవిస్తున్న వర్గాలు, లౌకికవాదాన్ని వినిపించే వర్గాలు ఇలాంటి చట్టాలను వ్యతిరేకిస్తాయని పాలకులకు తెలుసు. గతంలో ఉమ్మడి పౌరస్మృతి గురించి దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పెద్దఎత్తున ఉద్య మం చేశారు. ఆ రోజుల్లో ఆయన ఏకాత్మతా వాదాన్ని ప్రతిపాదించారు.

ఈ దేశంలో పుట్టిన పౌరులందరికీ సమాన హక్కులు, చట్టాలు ఉండాలన్నది ఆయన వాదన. ఆయనే కాదు, భారతీయ జనసంఘ్‌ నాయకు లంతా ఆ భావజాలాన్ని వ్యాపింపజేయడానికి ఎంతో కృషి చేశారు. బీజేపీ సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ మురళీ మనోహర్‌ జోషి ఏకాత్మతా వాదానికి ప్రజల్లో ప్రాచుర్యం తేవడానికి కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారివరకు యాత్ర చేశారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం బీజేపీ వ్యవస్థాపక నాయకుడు ఎల్‌కె అద్వానీ జరిపిన రథయాత్రలో కూడా అంతర్లీనంగా ఉమ్మడి పౌరస్మృతి గురించి ఆ పార్టీ నాయకులు ప్రచారం చేశారు. ఉమ్మడి పౌరస్మృతికి హిందువుల్లో వ్యతిరేకత లేదు. కానీ, ముస్లింలు దీనిని అంగీకరించరు. వారికి పర్సనల్‌ లాబోర్డు ఆదేశాలే శిరోధార్యం. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని రాజ్యాంగంలోని 44వ అధికరణం కూడా నిర్దేశిస్తోంది. అయినా, దేశంలో మైనారిటీ వర్గాలు దీనిని ఎప్పటికప్పుడు వ్యతిరేకించ డంతో ఘర్షణలకు తావివ్వరాదని ప్రభుత్వం వాయిదా వేస్తోంది. ఉమ్మడి పౌరస్మృతి మాదిరిగానే ముస్లింలలో తలాక్‌ అనే ఆచారం ఉంది. దీనిని కూడా రద్దు చేయాలని ఎంతో కాలంగా కమలనాధులు డిమాండ్‌ చేస్తూ వచ్చారు. ఇది కూడా బీజేపీ అజెండాలో ఉంది.

ఎన్నికల ముందు కమలనాథులు తమ అజెండాను ప్రజల ముందు ఉంచుతున్నారు కానీ, అమలు చేయలేకపోతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటులో తమ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చిన తర్వాత పార్టీ అజెండాలోని అంశాల ను ఒక్కొక్కటీ అమలు చేసేందుకు ప్రయ త్నిస్తున్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆ మందిరం నిర్మాణం చకచకా సాగిపోతోంది. దీనిని మత పరమైన, అంశంగా కాకుండా స్థల వివాదంగా కోర్టు పరిష్కరిం చింది. రామమందిరం స్థలానికి బదులుగా ముస్లింలు మసీదు కట్టుకునేందుకు ప్రత్యామ్నాయ స్థలాన్ని హిందువులు ఇచ్చేట్టు పరిష్కారం కుదిరింది. అలాగే, తలాక్‌ సమస్యను స్త్రీ, పురుషుల మధ్య సమానత్వ భావన ప్రాతిపదికగా అప్పటికప్పుడు ముమ్మారు తలాక్‌ చెప్పే విధానాన్ని రద్దు చేశారు. ఈజిప్ట్‌ వంటి ముస్లిం దేశం ఎప్పుడో దశాబ్దాల కిందటే తలాక్‌ విధానాన్ని రద్దు చేసిందని బీజేపీ చెబుతూనే ఉంది. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి సమస్యను పరిష్కరించేం దుకు బీజేపీ పావులు కదుపుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ నోటివెంట ఉమ్మడి పౌరస్మృతి మాట రావడం యాదృచ్ఛికం అనుకోవడానికి లేదు.

- Advertisement -

ఊహించినట్టే విపక్షాలు మోడీ వ్యాఖ్యలపై గళం విప్పడం ప్రారంభిం చాయి. మొత్తం మీద రాజకీయ తేనెతుట్టెను కదిపారన్న మాట. వచ్చే ఎన్నికల్లో ఈ అజెండాతో ప్రజల వద్దకు వెళ్ళేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. త్వర లో జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో దీనికి సంబంధిం చిన బిల్లు పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి పౌరస్మృతిని తాము వ్యతిరేకిస్తున్నామని, హిందువుల్లో ముందు ఆ విధానం అమలు చేయాలని, ఆలయాల్లో దళితులతో పూజలు చేయడానికి అవకాశం కల్పించాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ అన్నారు. మిగతా రాజకీయ పార్టీలూ రేపోమాపో స్పందించడం ఖాయం. అయితే, ఉమ్మడి పౌరస్మృతిలా కాకుండా సమాజంలో స్త్రీ, పురుష భేదాన్ని నివారించేం దుకు చర్యలు తీసుకుని రావాలని కోర్టులు చెబుతున్నా యి. వివిధ మతాల ప్రజ లు వారి మతాచారాల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చెయడం సాధ్యం కాదని పలువురు పేర్కొంటు న్నారు. మత స్వేచ్ఛ విషయంలో ఎలాంటి మార్పులు లేకుండా లింగ వివక్ష ఉండరాదన్న నియమం కింద ఈ పౌరస్మృతి అమలుకు కోర్టుల ఆదేశాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement