Monday, April 29, 2024

ఎడిటోరియ‌ల్ – క‌మ‌లానికి ప్ర‌తిష్టాత్మ‌కం ..

కర్నాటక అసెంబ్లి ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ నాయకుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది.ఇక్కడ తిరిగి అధికారం సాధించడం ద్వారా కేంద్రంలో కూడా హ్యాట్రిక్‌ సాధించాలని కమలనాథులు ఆశిస్తున్నారు. కర్నాటక ఎన్నికలను కేంద్ర ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలు సామాన్య నాయకుల వరకూ ఢిల్లి నుంచి కర్నాటకకు క్యూ కడుతున్నారు. ప్రధానమంత్రి అయితే ఇప్పటికి ఐదారుసార్లు పర్యటించారు. గురువారం మళ్ళీ కర్నాటకలో ప్రచారాన్ని నిర్వహించారు. కర్నాటక లో గత ఎన్నికల్లో ఏ పార్టీకీ అధికారం రాకపోవడంతో జనతాదళ్‌(ఎస్‌), కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.ఆకర్షణ్‌ కమలం పేరిట పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాల పట్ల ఆకర్షణ అనడం కన్నా, మాజీ ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్‌ నాయకుడు యెడియూరప్ప వ్యక్తిగత ప్రతిష్ఠతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఏడాది క్రితం వరకూ ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన స్థానే, ఆయన శిష్యుడు బసవరాజ్‌ బొమ్మై అధికారాన్ని చేపట్టారు. యెడియూరప్ప గతంలో కూడా అవినీతి పాలకునిగా ముద్ర పడ్డారు. బసవరాజ్‌ హయాంలో అంతకంటే ఎక్కువగా అవినీతి చోటు చేసుకుంది. బీజేపీ నాయకులు తమ ప్రసంగాల్లో పూర్వపు కాంగ్రెస్‌ ప్రభుత్వాల అవినీతిని పాడిందే పాటగా ఎండగడుతున్నారు.

యెడి యూరప్ప, బసవరాజ్‌ హయాంలో చోటు చేసుకున్న అవినీతిని ఉద్దేశ్య పూర్వకంగానే విస్మరిస్తున్నారన్న విషయాన్ని ప్రజలు గ్రహించారు. అందుకే, ఈసారి కాంగ్రెస్‌కి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు కనిపి స్తోంది. పైగా, బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి కేంద్ర మంత్రులంతా కర్నాటకకు తరలి రావడాన్ని ప్రజలు నిరసిస్తున్నారు. అయితే, అప్పర్‌ భద్ర సాగునీటి ప్రాజెక్టు కు కేంద్ర బడ్జెట్‌లో 5వేల కోట్లు పైగా కేటాయించి కర్నాటకకు మేలు చేశామని చెప్పుకోవడానికి ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణలకు అన్యాయం చేసి అప్పర్‌భద్రకు ఐదువేల కోట్ల నిధులను కేటాయించడం కేంద్రంలో బీజేపీ నాయకుల బరితెగింపు ధోరణికి నిదర్శనం. కేంద్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ప్పుడు ఇందిరాగాంధీ వంటి మహాశక్తి వంతురాలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరగని మేలు మోడీ తమ రాష్ట్రానికి చేస్తున్నారని ప్రజలు పొంగిపోతున్న మాట నిజమే. కానీ, ఐదువేల కోట్లు ఒక్కసారిగా కర్నాటకకు అందవు. అంతేకాకుండా, కేంద్రంలో బీజేపీ తరఫున సమర్ధులైన నాయకులెవరూ లేరు. యెడియూరప్పకు కేంద్ర మంత్రి పదవి ఇస్తామని ఆశజూపి రాష్ట్ర రాజకీయా ల నుంచి తప్పించారు.కానీ,ఆయన వయోభారం వల్ల పూర్వం మాదిరిగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు.

కేంద్రంలో ప్రస్తుతం కర్నాటక తరఫున ప్రహ్లాద్‌ జోషి మంత్రిగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆయనకు పార్టీలో అసమ్మతి సెగ ఉంది. ఆయన ఉత్తర కర్నాటకకు చెందిన వారు. ఆయన ధార్వాడ్‌ నుంచి లోక్‌సభకు మూడు సార్లు బీజేపీ ఎంపీగా ఎన్నికయ్యారు. ఈసారి ధార్వాడ్‌ స్ట్రాంగ్‌మ్యాన్‌గా పేరొందిన జగదీష్‌ షెట్టార్‌కి అసెంబ్లిd ఎన్నికల్లో టికెట్‌ రాకపోవడంతో జోషి గెలుపు అంత సునాయాసం కాదని అంటున్నారు. పైగా, ఈసారి కర్నాటక ముఖ్యమంత్రి పదవిని బ్రాహ్మణునికి ఇవ్వాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు వచ్చిన వార్తలు జోషి, షెట్టార్‌ల మధ్య దూరాన్ని పెంచాయి. లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన షెట్టారు ఏడుసార్లు ధార్వాడ్‌ నుంచి అసెంబ్లిdకి ఎన్నికయ్యారు. గతంలో యెడియూర ప్ప ఖాళీ చేసినప్పుడు ముఖ్యమంత్రిగా కొంత కాలం వ్యవహరించారు.

యెడ్యూరప్ప స్వచ్చందంగా రిటైర్మెం ట్‌ ప్రకటించడం వల్ల ఈసారి తనకు అవకాశం వస్తుంద ని ఆశించి భంగ పడ్డారు. అలాగే, బెల్గావీ ఇంతవరకూ బీజేపీకి కంచుకోటలా ఉండేది. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆ ప్రాంతంలో మహారాష్ట్ర ఏకీకరణ సమితి మళ్ళీ పంజా ఎగురవేస్తోంది. ఈ నేపథ్యంలో బెల్గావిలో బీజేపీ కి గతంలో వచ్చినన్ని సీట్లు రాకపోవచ్చు. కర్నాటకపై బీజేపీ కేంద్ర నాయకులు దృష్టిని కేంద్రీకరించడానికి ప్రధాన కారణం ఇదే. అలాగే, హైదరాబాద్‌- కర్నాటకలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మల్లికార్జున్‌ ఖర్గే ఎఐసిసి అధ్యక్షునిగా ఎన్నిక కావడంతో రాష్ట్రమంతటా కాకపో యినా, తమ ప్రాంతంలో కాంగ్రెస్‌ని గెలిపించుకోవ డానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అందువల్ల బీజేపీ పరిస్థితి అక్కడ కూడా గడ్డుగానే ఉంది. ఈ కారణాల న్నింటి దృష్ట్యా ప్రధానమంత్రి మొదలు సామాన్య నాయకుల వరకూ కమలనాథులంతా కర్నాటక ఎన్నికల పై దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. కర్నాటకలో ఇప్పటికే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. అయితే తటస్థంగా ఉన్నవారిని తమ వైపునకు తిప్పుకునేందుకు బీజేపీ సర్వశక్తులను ఒడ్డుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement