Tuesday, April 30, 2024

ఎడిటోరియ‌ల్ – అదానీ … ఓ గుణ‌పాఠం

ఆర్థికాభివృద్దిలో కార్పొరేట్‌ దిగ్గజాల మధ్య పెరుగు తున్న పోటీ అనారోగ్యకర ధోరణులకు దారి తీయకూడ దని ప్రముఖ ఆర్థిక వేత్త స్వామినాథన్‌ అయ్యర్‌ సూచిం చారు. గౌతమ్‌ అదానీ వ్యవహారంపై అమెరికాకి చెందిన పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ సమర్పించిన నివేదిక వాస్తవానికి అదానీకి మేలు చేస్తుందని అన్నారు. నిదానమే ప్రధానమని మన పెద్దలు చెప్పిన సూక్తి ఇలాంటి సంద ర్భాల్లో వర్తిస్తుంది. అదానీ అతి స్వల్ప కాలంలో ప్రపంచ మహాకోటీశ్వరుల జాబితాలో మొదటి స్థానాన్ని సంపా దించేందుకు తొక్కిన అడ్డదారుల వల్లనే ఈరోజు పతన మయ్యారు.ఆయన ఎంత వేగంగా ఆ స్థానానికి దూసు కుని వెళ్ళారో అంత వేగంగానూ చతికిల పడ్డారు. ఇందు కు ఆయన ప్రదర్శించిన అత్యుత్సాహానికి తోడు ప్రభుత్వ వర్గాల నుంచి సరైన నియంత్రణ లేకపోవడం ప్రధాన కారణం. మేక్‌ ఇన్‌ ఇండియా నినాదాన్ని సాకారం చేయ డం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇస్తున్న ప్రాధా న్యతను ఉపయోగిచుకుని అదానీ తన పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, పెట్టుబడులను అనూహ్యంగా పెంచు కోవడానికి తొందరపడ్డారు. ఆ తొందరలో నిబంధనల ను తుంగలోకి తొక్కారు.

మన దేశంలో ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డవారంతా రాజకీయ పలుకుబడి నుపయోగించి బయటపడుతున్నట్టే తానూ బయట పడొచ్చనుకున్నారు. కానీ, అమెరికన్‌ సంస్థల్లో తన పప్పులుడకలేదని తెలుసుకోవడానికి ఆయనకు ఎంతో కాలం పట్టలేదు. ఆయనను నియంత్రించేందుకు దేశం లో ప్రభుత్వ సంస్థలు సకాలంలో సరైన చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నదే స్వామినాథన్‌ అయ్యర్‌ వ్యాఖ్యల సారాంశం. ఇప్పటికైనా అదానీ తన పరిస్థితిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉందని ఆయన అంటున్నారు. విమానాశ్రయాలు, రేవులు, విద్యుత్‌ ప్రాజెక్టులు, జాతీయప్రధాన రహదారులు… ఒకటేమి టి? అన్నిప్రధాన ప్రాజెక్టుల కాంట్రాక్టులను అదానీ సంపాదించారు. ఎక్కడికో ఎందుకు మన ఆంధ్ర ప్రదేశ్‌లో గంగవరం రేవు ప్రాజెక్టుతో సహా ముఖ్యమైన ప్రాజెక్టుల కాంట్రాక్టులన్నింటినీ అదానీ కైవసం చేసుకు న్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీతో తనకున్న పలుకుబడి, పరిచయాలను వినియోగించుకుని అదానీ ఆకాశమంత ఎత్తు ఎదిగారని పార్లమెంటులో సాక్షాత్తూ మోడీ ఎదురుగానే కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. అంతేకాదు, మోడీతో సహా అదానీ విమానంలో ప్రయాణించారని ఆరోపించడమే కాదు, ఆ ఫోటోల కాపీలను చూపించారు. అయితే, అదానీ తన ను ఇంతగా ముంచేస్తాడని మోదీ ఊహించలేదు.ఇద్దరూ ఒకే రాష్ట్రానికి చెందిన వారు కావడం వల్ల కార్పొరేట్‌ దిగ్గజంగా అదానీ ఎదిగేందుకు మోడీ సంపూర్ణ సహకా రం అందించారనేది ఆయన మాటల్లో అంతర్లీనంగా వ్యక్తం అయిన అభిప్రాయాలను బట్టి స్పష్టం అవుతోంది. పార్లమెంటులోనే మోడీ పారిశ్రామికవేత్తలూ, కార్పొరేట్‌ అధిపతులను చిన్న బుచ్చవద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. మన దేశంలో కార్పొరేట్‌ సంస్థలు, స్టాక్‌ మార్కె ట్‌ల అక్రమాలను నియంత్రించేందుకు సెబీ వంటి రెగ్యు లేటర్‌ సంస్థలు ఉన్నప్పటికీ అవన్నీ అధికారంలో ఉన్న పెద్దల చెప్పుచేతల్లోనే ఉన్నాయి.

హర్షద్‌ మెహతా షేర్ల కుంభకోణంలో ఈ విషయం బహిర్గతం అయింది. హర్షద్‌ మెహతా షేర్ల కుంభకోణం బయటపడినప్పుడు పార్లమెంటులోనూ, వెలుపలా రోజుల తరబడి గందర గోళం జరిగింది. స్టాక్‌ మార్కెట్‌పై విశ్వాసాన్ని పెంచడా నికి రెగ్యులేటరీ సంస్థలను మరింత పటిష్టం చేస్తామని ఆనాటి ప్రభుత్వం పార్లమెంటులో సభా ముఖంగా ప్రకటన చేసింది. అది జరిగి రెండు దశాబ్దాలు దాటినా పరిస్థితిలో మార్పులేదు. స్టాక్‌ మార్కెట్‌ని గాడిలో పెడ తామని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కూడా పార్ల మెంటులో ప్రకటన చేశారు.అయితే,ఈ రంగంలో ఉన్న వారి పలుకుబడి కారణంగా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నాయి.

సులభంగా డబ్బు సంపాదిం చేందుకు ఇది ఒక మార్గంగా ఎంచుకుంటున్న వారంతా ప్రభుత్వానికి సన్నిహితులే. ఇంకా చెప్పాలంటే వారే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నా ఆశ్చర్యం లేదు. రెగ్యులే టరీ సంస్థల పట్ల విశ్వాసాన్ని పెంచడానికి ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.తప్పు ఎక్కడ జరిగిందో కనుగొని భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటే సంస్థలపై విశ్వాసం కలుగుతుంది.అలాగే, అదానీ వంటి కార్పొరేట్‌ అధిపతులకు ప్రోత్సాహం పేరిట ప్రభుత్వం పూర్తిగా దాసోహం కారాదన్న గుణ పాఠాన్ని ఈ వ్యవహారంతో ప్రభుత్వం నేర్చుకోవాలి. తప్పుదిద్దుకునేందుకు అదానీకి ఇదొక అవకాశం అం టూ స్వామినాథన్‌ అయ్యర్‌ ఇచ్చిన సలహా, అక్రమ మార్గాలు తొక్కేవారందరికీ వర్తిస్తుంది. అలాగే, అక్రమా లను అరికట్టడంలో ఉదాసీనంగా వ్యవహరించరాదని ప్రభుత్వానికి ఓ హెచ్చరిక. ఆర్థిక అక్రమాలకు పాల్పడే వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే అదానీ లాంటి వారు ఎందరో పుట్టుకొస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement