Friday, April 26, 2024

నేటి సంపాదకీయం-జాగ్రత్తలు అవసరం!

తెల్లవారి లేస్తే ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనన్న ఆందోళనతో ఉన్న ప్రజానీకాన్ని కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తోందన్న వార్తలు వణికిస్తున్నాయి. రెండు దశల్లో కరోనా విస్తరణలో లక్షలాది మంది అస్వస్థులు కాగా,వేలాది మందిప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి విసిరిన పంజా నుంచి బయట పడి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న ప్రజానీకానికి కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తోందన్న వార్తలు సహజంగానే భయాన్ని పుట్టిస్తున్నాయి. వార్తా ప్రసార సాధనాల విస్తృతి పెరగడం వల్ల ఎలాంటి వార్త అయినా, కనురెప్ప పాటు వ్యవధిలో ప్రపంచమంతా వ్యాపిస్తోంది. కరోనా చైనాలోని వూహన్‌ లేబొరేటరీ నుంచి వ్యాపించగా, ఒమిక్రాన్‌ దక్షిణాఫ్రికా నుంచి వ్యాపిస్తోందని ప్రకటించారు. అయితే,తమ దేశానికేమీ సంబంధం లేదని దక్షిణాఫ్రికా ప్రభుత్వం స్పష్టంచేసింది. ఒమిక్రాన్‌ ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించలేదని వైద్యశాఖాధికారులు స్పష్టం చేస్తున్నప్పటికీ, జాగ్రత్తలను సూచిస్తున్నారు.కరోనా నియంత్రణకు రెండు వ్యాక్సిన్‌లు ఇంకా తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా కరోనా నియంత్రణకు ఇంతకుముందు అమలులో ఉన్న మార్గదర్శకాలను కొనసాగించాలనీ,ఇప్పటికీ అవి అమలులో లేని ప్రాంతాల్లో వెంటనే అమలు జరిగేట్టు చూడాలని కేంద్ర వైద్య,ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇందుకు అనుసరించిన టెస్టింగ్‌-ట్రేసింగ్‌- ట్రీట్‌ మెంట్‌ విధానాన్ని కొన సాగించాలని ఆస్పత్రులకూ, వైద్యులకూ సూచించింది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణీ కులకు విమానాశ్రయాల్లోనే పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వేళ వారికి పాజిటివ్‌ వచ్చినట్టయితే, చికిత్సకు పంపుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు నేరుగా ఇళ్ళకు వెళ్ళకుండా క్వారంటీన్‌లకు పంపుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణీకుల్లో ఎవరికైనా పాజిటివ్‌ నిర్దారణ అయితే, వారి నుంచి శాంపిల్స్‌ సేకరించి జినోమ్‌ సీక్వెన్సీ లాబ్‌లకు పంపాలి. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఒమిక్రాన్‌ లక్షణాలు గురించి పూర్తిగా తెలియకపోయినా, పొడి దగ్గు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి వంటి స్వల్ప లక్షణాలే కనిపించినట్టు దక్షిణాఫ్రికాకి చెందిన అంటువ్యాధుల నివారణ విభాగం వైద్యురాలు ఏంజెలిక్‌ కోయెట్టీ ఒక ఇంటర్వ్వ్యూులో తెలిపారు. ఈ లక్షణాలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించి వ్యాక్సిన్‌లు, మందులు తీసుకోవాలనీ, జాగ్రత్తలు పాటిస్తే వెంటనే నయం అవుతుందని ఆమె స్పష్టం చేశారు. గతంలో కరోనా బారిన పడిన వారికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకే అవకాశాలు ఉన్నాయనీ,అయితే,ఈ వేరియంట్‌ ఏ వేగంతో వ్యాపిస్తోందో, ఎంత మందిని ప్రభావితం చేస్తోందో తెలుసుకునేందుకు పరిశోధన లు నిర్వహిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు తెలిపారు. భయం కన్నా, జాగ్రత్త లు తీసుకోవడం అవసరమనీ, కరోనా కాలంలో మాదిరిగా సామాజిక దూరాన్ని పాటించ డం, మాస్క్‌ ధరించడం, పదిమంది ఉన్న చోట గుమిగూడకపోవడం వంటి జాగ్రత్తలు ఇప్పుడు కూడా తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. కరోనా వెళ్ళిపోయిం దన్న ఆనందంతో ఉత్సవాలు, కుటుంబపరమైన కార్యక్రమాల పేరిట ఎక్కువ మంది జనం గుమిగూడటం వల్ల కూడా వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, అమెరికాలో కూడా కొత్త వేరియంట్‌ వ్యాపిస్తున్నదన్న సమాచారం అందడంతో ఆ దేశ అధ్యక్షుడు జోబిడెన్‌ దేశ ప్రజలకు విడుదల చేసిన సందేశంలో కొత్తవైరస్‌ వల్ల ఆందోళన ఉన్నా, భయపడాల్సిన అవసరం లేదనీ, జపాన్‌ ఆస్ట్రేలియా వంటి దేశాలు ఆంక్షలకు సిద్ధమయ్యాయనీ,తమ దేశంలోకూడా ఆంక్షలు అమలు అవుతున్నాయని చెప్పారు. కరోనా నియంత్రణకు వాడుతున్న వ్యాక్సిన్లు, బూస్టర్‌ డోస్‌లతో కొత్త వేరియంట్‌ను ఎదుర్కోవచ్చని అమెరికా అంటు వ్యాధుల చికిత్సా నిపుణుడు ఆంటోనీ పౌచీ ధైర్యం చెప్పారు. కొత్త వేరియంట్‌ సోకకుండా జాగ్రత్తలు పాటించడంలో ఏమాత్రం ప్రమత్తత లేకుండా జాగ్రత్తలు పాటించడం అత్యవసరం. అందరి నోటా అదే మాట. అంటురోగాల నివారణ నిపుణులు అందరూ కొత్త వేరియంట్‌ విషయంలో జాగ్రత్తలు పాటిస్త చాలుననీ, ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement