Thursday, May 2, 2024

తిరుపతిలా యాదగిరిగుట్ట

విశాఖపట్నం, ప్రభ న్యూస్ : అత్యద్భుత ఆధ్యాత్మిక కేంద్రం యాదగిరి గుట్ట అని విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, స్వాత్మానందేంద్ర స్వామిలుపేర్కొన్నారు. ఇక్కడి నారసింహునికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించిన వీరు ఇంత గొప్ప నిర్మాణం మునుపెన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. యాదగిరి గుట్ట పునర్నిర్మాణం అనంతరం తొలి సారిగా దర్శించిన పీఠాధిపతు లుగాస్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వా మి, స్వాత్మానందేంద్ర స్వామిలు యాదగిరి గుట్ట నరసింహ స్వామి దర్శనానంతరం ఆధ్యాత్మిక పులకింతతో కూడిన భావ ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి మాట్లాడుతూ అతి గొప్ప రాతి నిర్మాణం యాదగిరిగుట్టగా కొనియాడారు. హిందువుల్లో కేసీఆర్‌ చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట మరో తిరుపతి పుణ్య క్షేత్రమేనని భావిం చారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి స్థాయి ప్రఖ్యాతితో పాటూ పురోగతిని కూడా యాదగిరిగుట్ట అందుకోవాలని ఆశించారు. ఏ ఆలయాన్నీ శైవ, వైష్ణవంకు పరిమితం చేసి చూడకూడదన్న స్వరూపానందేంద్ర సరస్వతీ మహా స్వామి ఆలయాలు సనాతన ధర్మ సంపదగా పేర్కొన్నారు. ధర్మాన్ని, సంప్రదాయాన్నీ కాపాడుతూంటే, అవి తిరిగి మానవాళికి మేలు చేస్తాయని విశదీకరించారు. ఎవరి సొత్తూ కాని హిందూదేవాలయాలు పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. ఆది శంకరుల సంప్రదాయ పీఠాలకు హైందవ ధర్మమే ముఖ్యమని ఆయన చెబుతూ ఆది శంకరులే జగత్‌ గురువులన్నారు. ఆది శంకరుల విరచిత మంత్రమే యాదగిరి గుట్టలోనూ అనుసరిస్తున్నారని గుర్తు చేశారు. సనాతన ధర్మం పరిరక్షణ ఆలయాల పరిరక్షణతో ముడిపడి ఉందని చెబుతూ, సమాజానికి జరిగే మేలంతా పాటించే సనాతన ధర్మ పరిరక్షణతోనే సాధ్యం అవుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement