Thursday, May 2, 2024

మార్చి 28న యాదాద్రి స్వయంభు పునర్దర్శనం

21న సంప్రోక్షణ స్నపన, మృత్సంగ్రహణం, అంకురారోపణంతో ప్రారంభమై, 28న మహాకుంభ సంప్రోక్షణతో ప్రధానాలయం పునఃప్రారంభం కానున్నది. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి స్వయంభువుల అపురూప దర్శనం సమస్త భక్త కోటికి ఈ నెల 28వ తేదీ నుంచి కలుగనున్నది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు సంకల్పంతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పరిపూర్ణం చేసుకోగా, ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు మహాకుంభ సంప్రోక్షణ జరుగనున్నదని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్‌థీఘళ్‌ లక్ష్మీనరసింహా చార్యులు తెలిపారు. పంచకుండాత్మక మహాయాగంతో సంప్రోక్షణ చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ నెల 21న సంప్రోక్షణ స్నపన, మృ త్సంగ్రహణం, అంకురారోపణంతో ప్రారంభించి, 28న మహాకుంభ సంప్రోక్షణతో ప్రధానాలయం పునఃప్రారంభం కానున్నదని వివరించారు. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా ఈ నెల 21న ఉదయం స్వామివారికి ఉత్సవాంగ, ప్రతిష్ఠాంగ సంప్రోక్షణంగా స్నపన కార్యక్రమం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి స్వస్తివాచనం అత్యంత వైభవోపేతంగా చేపడతారు. సాయంత్రం మృత్సంగ్రహణ, అంకురారోపణ జరుగుతాయి. 22న ఉదయం అగ్నిమథనం, యాగశాల ప్రవేశం, సమస్త వాస్తు దోషాలు, క్షేత్ర దోషాలు, మాన, ఉన్మాన, ఉపమాన, లంభమానాది దోషాలు తొలగిపోవడానికి మహావాస్తు శాంతిపూజ నిర్వహిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణాలతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా ప్రతిరోజూ యాగశాలలో మూలమంత్ర, మూర్తి మంత్ర జపాలు జరుగుతాయి. అలాగే యాదాద్రీశుడికి 11 కోట్ల లక్ష్మీనృసింహ మూల మంత్ర, మూర్తి మంత్ర జపాలను నిర్వహించ‌నున్నారు. ఈ ఉత్సవాల్లో స్వామివారికి చేసే ప్రధానమైన కైంకర్యాలు ద్విగుణీకృతంగా, శతకృత అభివృద్ధిగా వంద రెట్లు మంత్ర శక్తి సమన్వితంగా చేయ‌నున్నారు. ఏ లోపాలు లేకుం డా, ఆర్భాటాలు, అట్టహాసాలకు పోకుండా, పరమ ఏకాంతిక విధివిధానంతో కార్యక్రమాలు జరుగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement