Wednesday, May 1, 2024

TTD : ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుప‌తి : అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మే 31 నుండి జూన్ 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 8 నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఉదయం 11.30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీవాణి, ఆలయ ప్రధాన అర్చకులు సూర్య కుమార్ ఆచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్ పాల్గొన్నారు.

మే 30వ తేదీ అంకురార్పణ
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో మే 30వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు.

వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
31-05-2023- ధ్వజారోహణం -పెద్దశేష వాహనం
01-06-2023 – చిన్నశేష వాహనం హంస వాహనం
02-06-2023 – సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
03-06-2023 – కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం
04-06-2023 – మోహినీ అవతారం గరుడ వాహనం
05-06-2023 హనుమంత వాహనం గజ వాహనం
06-06-2023 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
07-06-2023 రథోత్సవం అశ్వవాహనం
08-06-2023 చక్రస్నానం ధ్వజావరోహణం
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 3వ తేదీ సాయంత్రం 4.30 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement