Thursday, May 2, 2024

తిరుప్పావై : పాశురము-8

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

కీళ్‌ వానమ్‌ వెళ్ళెన్ఱు ఎరుమై శిఱు వీడు
మేయ్‌వాన్‌ పరన్దనకాణ్‌! మిక్కుళ్ళ పిళ్ళైగుళుమ్‌
పోవాన్‌ పోగిన్ఱారై ప్పోగామల్‌ కాత్తున్నై
కూవువాన్‌ వన్దు నిన్ఱోమ్‌; కోదుకల ముడైయ
పావాయ్‌! ఎళున్దిరాయ్‌, పాడిప్పఱౖ కొణ్డు
మావాయ్‌ పిళన్దానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చ్చెన్ఱు నామ్‌ శేవిత్తాల్‌
ఆవా వెన్ఱారాయ్‌న్ద్‌ అరుళేలోరెమ్బావాయ్‌

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళశాసనములతో…

తాత్పర్యము :
” తూర్పు దిక్కు తెల్లవారుచున్నది. చిన్నబీడు మేయుటకు విడువబడిన గేదెలు విచ్చలవిడిగా పోవుచున్నవి. మిగిలిన గోపికలందరు వ్రతస్థలమునకు బయలుదేరగా వారిని ఆపి నిన్ను పిలుచుటకు నీ వాకిట వచ్చి నిలిచినాము. కుతూహలము కలదానా? లేచి రమ్ము! కృష్ణ భగవానుని గుణములను కీర్తించి వ్రతమును మొదలిగి వ్రతసాధనమును పొంది, కేశిని చంపిన వానిని, చాణూరముష్టికులను వధించిన వానిని, దేవాది దేవుని, సేవించినచో అయ్యో! అయ్యో! మీరే వచ్చితిరే అని బాధపడి మన మంచి చెడ్డలను విచారించి కటాక్షించును”
తూర్పు దిక్కున తెల్లవారుట యనగా మన మనసున సత్త్వగుణముదయించి రాజస తామస భావముల తగ్గుటయే. కాని పూర్తిగా తొలగుట కాదు. ఇట్లు తగ్గుటయే చిన్నబీడు లోనికి గేదెలు పోవుట. ఇది కేవలము చిత్త ప్రసాదమే.
పరమాత్మను ప్రేమించువారిని ముందు నిడుకొని వెళ్లవలయునుని నీ వాకిలి వద్ద నిలిచితిమి. ఇదియే మాకు పరమ ప్రయోజనము. ఆచార్య గృహద్వారమున నిలువ గలుగుటయే శిష్యునకు ముఖ్య గృహద్వారమున నిలువ గలుగుటయే శిష్యునకు ముఖ్య ప్రయోజనము, అశ్వము అహంకారము. చాణూర ముష్టికలు కామక్రోధములు. అహంకారమును, కామక్రోధములను ఆచార్య కాటాక్షముచే పరమాత్మ తొలగించును.
ఈ పాశురమున నమ్మాళ్వారులను మేల్కొలుపుచున్నారు. ‘ కోదుకులముడయపావాయ్‌?’ అనికదా సంబోధన. వ్యామోహము కల పిల్ల అని యర్ధము.
‘ ఋషిం జుషా మహే కృష్ణతృష్ణాతత్త్వమివోదితం’ అని కదా స్తుతి. ఇచట ‘కృష్ణ తృష్ణాతత్త్వం’ అనగా కృష్ణునికి గల తృష్ట, కృష్ణుని యందు కల తృష్ణ అని రెండు విధములుగా చెప్పుకొనవచ్చును గాన నమ్మాళ్వార్లు ‘కోదుకుల ముడయపావాయె ‘ గదా.
నమ్మాళ్వార్లు తిరువాయ్‌ మొళిలో తమను పావాయ్‌గా చెప్పుకొనిరి కాన ఇచట పావాయ్‌ సంబోధన వీరికే అని తెలియనగును.
ఇక వాక్య పరంపరలో ‘అస్మత్సర్వ గురుభ్యోనమ:’ అనుదానిని అనుసంధానము చేయవలయును. కుతూహలము కలవారు అనగా వీరికి భగవంతునియందు భాగవతోత్తముల యందు కుతూహలము కలవారే సర్వగురువులు కదా.

- Advertisement -

డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు

Advertisement

తాజా వార్తలు

Advertisement