Tuesday, November 30, 2021

దేవ రహస్యం

లక్ష్మణుడు శ్రీరాముని దురదృష్టాన్ని తలచుకుని చింతిస్తూ, సారథి సుమంత్రునికి తన పరి తాపాన్ని వెల్లడించాడు. ”భార్యా వియోగ దు:ఖం శ్రీరాముని మానసికంగా కృంగదీస్తుంది. మా అన్న భార్యను త్యజించడం అనూహ్య పరిణామం!
దైవ నిర్ణయం ఎట్లున్నదో! అజ్ఞానులయిన పల్లీయులు తెలిసీ తెలియక అమాయకంగా పలికిన మాటలను లోకాపవాదంగా భావించి, కట్టుకున్న భార్యను త్యజించ డం క్రూర కార్యమేమో! ఈ క్రూర కార్యమే నిజంగా మా వంశాన్ని అప్రతిష్ట పాలు చేస్తుందేమో! అని తెలిపి లక్ష్మణుడు శోకించాడు. లక్ష్మణా! సువిశాల కోసల రాజ్యానికి అధిపతి అయినా రామునికి కష్టాలు, కన్నీళ్ళు తప్పవని పూర్వమే దైవజ్ఞులు తెలిపారు. మరొక దేవ రహస్యం తెలిస్తే నీ శోకం కొంత వరకు ఉపశమిస్తుందేమో! రాముడు తన భార్య సీతనే కాదు తన సోదరులను కూడా పరిత్యజిస్తాడు. ఈ రహస్యం మీకు తెలుపకూడదని రాజాజ్ఞ. అయినా నీ శోకాగ్నిని చల్లార్చే దారి తెలియక చెబుతున్నాను వినుము. ”మీ తండ్రి దశరథుడు, కుల గురువు వసిష్టుడు. నేను వింటుండగా దుర్వాస మహర్షి ఒక రహస్యం తెలిపాడు. పూర్వం మీ తండ్రి దశరథుడు, నేను ఒకనాడు వసిష్టుని ఆశ్రమానికి వెళ్ళాం. వసిష్ట దుర్వాస మునీంద్రులు ఒకచోట ఆసీనులై ఉన్నారు. మేము వారిని సమీపించాం. మహర్షులు ఇరువురు పౌరాణిక గాథల్ని ముచ్చటించు కొంటున్నారు. ఆ సమయంలో మీ తండ్రి దశరథుడు, తన వంశం భవిష్యత్తు, తన కుమారుల జీవితాలు ఎలా ఉండబోతున్నాయి అని అడిగాడు. అప్పుడు దుర్వాస మహర్షి తెలిపిన వృత్తాంతం తెలుపతాను వినుము. పూర్వం దేవ రాక్షస సంగ్రామంలో దేవతల పరాక్రమ ధాటికి తాళలేక, దైత్యులు భృగవు భార్యను ఆశ్రయించారు. ఆమె వారికి రక్షణ కల్పించి దేవతలను మభ్య పెట్టింది. విష్ణువు ఆమె కుతంత్రాన్ని గ్రహించి, ఆమె తలను నరికాడు. భృగు మహర్షి కోపించి, ”స్త్రీని వధించావు. నాకు భార్య వియోగాన్ని కల్పించావు. మానవ జన్మ పొంది, భార్య వియోగంతో కుమిలిపోతావు” అని విష్ణువును శపించాడు. సత్త్వ గుణ ప్రధానుడైన విష్ణువు ప్రతి శాపాన్ని ఈయక, సహించి మౌనముద్ర వహించాడు. భృగుని శాపం ప్రభావంతో రాముడు కష్టాల పాలవుతాడు. భార్యా వియోగం సంభవిస్తుంది.
రాముడు అశ్వమేధ యాగాలు చేయగలడు. రాముని ఇద్దరు కొడుకులు పుడతారు. కాని వారు అయోధ్యలో జన్మింపరు. శ్రీరాముని పరోక్షంలో వారు కోసల రాజ్యానికి పట్టాభిషక్తులు కాగలరు అని దుర్వాసుడు తెలిపాడు.
సుమంత్రుని మాటలు విని లక్ష్మణుడు ఊరట పొం దాడు. లక్ష్మణుడు అయోధ్యకు చేరి, శ్రీ రాముని సన్నిధికి వచ్చాడు. ”రాజాజ్ఞను శిరసావహించి నిర్వహిం చాను” అని తెలిపాడు. సీత సందేశాన్ని వినిపించాడు. ”సీత వాల్మీకి ఆశ్రమం చేరింది” అని తెలిపాడు. చింతా క్రాంతుడై విలపిస్తున్న శ్రీరాముని సందర్బోచితములైన మాటలతో లక్ష్మణుడు ఓదార్చినాడు.
ఊసరవెల్లి
లక్ష్మణుడు యుక్తియుక్తంగా సమయోచితంగా పలికిన మాటలవల్ల శ్రీ రాముడు ఊరడిల్లాడు. ”ప్రజలను, రాజ్యాన్ని రాజు నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యంచేసిన రాజు నరకం పాలవుతాడు” అని రాముడు లక్ష్మణునికి తెలిపి, దానికి దృష్టాంతంగా నృగ మహరాజు వృత్తాంతాన్ని ఇలా తెలిపాడు. నృగ మహరాజు సంతత దానశీలుడు. అతడు దూడ లతో ఒక కోటి పాడి యావులను బ్రాహ్మణులకు దానం ఇచ్చాడు. ఒక బ డుగు బాపని ఆవు, దూడతో కూడా దారితప్పి వచ్చి, నృగ మహరాజు ఆలమందలో కలిసిపోయింది. ఆవు యజమాని ఆవును వెతుకుతూ కనఖలం అనే ఊరు చేరాడు. అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట తన ఆవుదూడల్ని చూశాడు.
”శబలా! ఇటు రమ్మని పేరు పెట్టి ఆవును పిలిచాడు. అది యజమాని గొంతు గుర్తించి , అతని వద్దకు చేరింది.
ఆ విప్రుడు దూడతో కూడా ఆవును కొనిపోతుండగా దానిని మృగ మహరాజుచే దానంగా పొందిన విప్రుడు త్వర త్వరగా వచ్చాడు. ” నా గోవును కొనిపోతున్నా వేమి?” అని గద్దించాడు. ఇరువురు గోవు నాది అంటే నాది అని తగువులాడారు. చిలికి చిలికి గాలి వాన అయినట్లు తగవులాట పెద్దదయ్యింది. తీర్పు కొరకు బ్రాహ్మణులు ఇద్దరూ నృగ మహరాజు రాజు భవనాన్ని సమీపించాడు. నృగుడు వారి గోడును పట్టించుకోలేదు. కనీసం వారికి దర్శనం ఇవ్వలేదు. విప్రులు కోపించి, ” రాజులకు ఇంత నిర్లక్ష్యం పనికి రాదు. ఊసర వెల్లివై ఇతరులకు కనిపించ కుండా పడి ఉందువుగాక”అని శపించారు. పిమ్మట శాం తించి యదువంశంలో జన్మించే శ్రీ కృష్ణుని వల్ల శాప విముక్తి కలుగుతుంది అని గ్రహించారు. బ్రాహ్మణుని శాపాన్ని విని మృగరాజు మంత్రులను, పురోహితులను, పుర ప్రముఖులను పిలిపించాడు. తనకు ప్రాప్తించిన శాపాన్ని తెలిపాడు. తన కొడుకు వస్తువును పట్టాభిశక్తున్ని చేశాడు. ఒక గొయ్యిని తవ్వించి ఊసరవెల్లి రూపు దాల్చి, దానిలో ఉండిపోయాడు అని రాముడు తెలిపాడు.

కె. ఓబులేశు
9052847742

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News