Sunday, April 28, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 50

  1. జలకంబుల్రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యము
    ల్కలశబ్దధ్వనులంచితాంబరమలంకారంబుదీప్తుల్మెఱుం
    గులు నైవేద్యము మాధురీ మహిమగా( గొల్తున్నినున్ భక్తి రం
    జిలదివ్యార్చన కూర్చి, నేర్చిన క్రియన్శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా! రసముల్ = కావ్యము నందలిశృంగారాదినవరసాలే, జలకంబుల్ = స్నానములుగాను, వాచాబంధముల్ = పదబంధాలు, ప్రసూనములు = పువ్వులుగాను, కల = అవ్యక్త మనోహరమైన, శబ్ద = పదముల యొక్క, ధ్వనుల్ = మ్రోతలు, (వ్యంగ్య వైభవాలు), వాద్యముల్ = సంగీత వాయిద్యాలు గాను, అలంకారంబు = కవితాలంకారాలే, అంచిత = మేలైన, అంబరము = వస్త్రముగాను, మెఱుంగులు = కవిత్వం లోని తళుకులే, దీప్తుల్ = ప్రకాశించే జ్యోతులు గాను, మాధురీమహిమ = కవిత్వమందలి మాధురీ గుణం యొక్క గొప్పతనమే, నైవేద్యము = నివేదనగాను, ( చేసి) భక్తి రంజిలన్ = నీపైనాకున్న భక్తి ప్రకాశించేట్టుగా, నేర్చిన క్రియన్= నాకు చేతనైనట్టు, దివ్య+ అర్చనన్ = అలౌకికమైన పూజావిధిని, కూర్చి = సమకూర్చి, కల్పన చేసి, నినున్ = నిన్ను, కొల్తున్ = సేవించుకుంటాను.

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! భక్తి అతిశయించగా నాకు చేత నైనట్టు దివ్యమైన, (వెలుగులతో కూడిన) అలౌకికమైన విధంగా నిన్ను అర్చిస్తాను. నీకు నేను చేసే షోడశోపచారాలలో స్నానము కావ్యము నందలినవరసాలే. పూలు పదబంధాలే. అవ్యక్తమనోహరమైన శబ్దాల ధ్వనులే (మ్రోతలు, వ్యంగ్యవైభవాలు) భేరీమృదంగాది వాద్యఘోషలు, అలంకారాలే మంచి వస్త్రాలు, దీపాలు కవితాసౌందర్యాలే, నైవేద్యం మాధురీ గుణమే. తాను చేసేదికవితార్చన. అందరు చేయలేనిది.

విశేషం:
అందరు మామూలుగా షోడశోపచార పూజ చేస్తారు. కాని, తాను దానినే కవితాత్మకంగా చేస్తాను అన్నాడుకవి అయిన ధూర్జటి. దివ్యము అంటే వెలుగుల మయముఅనగావాక్ + మయము (వాఙ్మయము). తన అర్చన కవితారూపమైనది, తనకు చేత నైనది, శాశ్వతమైనది ఆ అర్చన. మామూలు పుష్పాలు మర్నాటికి వాడి పోవచ్చు. కాని, పదబంధాలు ఆ విధంగా వాడిపోవు.

రసాలు:
పఠితకు, లేక సామాజికుడికి (నాటకాదులను చూసేవాడు) ఆస్వాదయోగ్యతని కలిగించే అంశం ఏదైతే ఉందో, దాన్ని రసం అంటారు. అది నవవిధాలు– 1. వీరం, 2. శృంగారం, 3. హాస్యం, 4. కరుణం, 5. భయానకం, 6. బీభత్సం, 7. రౌద్రం, 8. అద్భుతం, 9. శాంతం.
ధ్వని: అభిధ, లక్షణ, వ్యంజన అనే శబ్దశక్తులలో వ్యంజన శక్తి యొక్క ఫలితం ధ్వని. శబ్దానికున్నఅభిధ అంటే వాచ్యార్థం వర్తించ నప్పుడు ద్యోతకం అయ్యే విశేషార్థం ధ్వని. ఇది కావ్యానికి చాల ముఖ్యం. అది కూడా రసపరంగా ఉంటే మరింత శ్రేష్ఠం. కావ్యాత్మ రసధ్వనిఅనిఆలంకారికులు ఎక్కువ మంది అంగీకరించిన మాట.
అలంకారాలు: మానవుల సౌందర్యానికి మెఱుగులు పెట్టే నగల లాగా కవితాసౌందర్యాన్ని ఇనుమడింపచేసేవి అలంకారాలు. ఇవి శబ్ద, అర్థ భేదాలతో రెండు రకాలు. అర్థాలంకారాలలో వంద భేదాలని చంద్రాలోకంలోచూడ వచ్చు. ఉపమ, రూపకం, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి, అర్థాంతరన్యాసం మొదలైనవి అందరకు తెలిసినవే.
వాచాబంధాలు: పదబంధాలు. వేరు వేరు అర్థం ఉన్న రెండు కాని, అంత కంటె ఎక్కువ కాని పదాల కలయికతో వాటి కన్న భిన్న అర్థం కలిగితే అవి పదబంధాలు. ఉదాహరణకు – కడుపు మంట, కళ్ళు నెత్తికి రావటం మొదలైనవి.
మాధురీమహిమ: కవిత్వగుణాలలోనొకటి మాధుర్యం. ఇది ధూర్జటి కవితకు ప్రాణం. ధూర్జటి గూర్చి లోకంలో వ్యాప్తి చెందిన ప్రసిద్ధమైన పద్యాలలో ముఖ్యమైన దాని యందున్నది ఈ అంశమే. “ స్తుతమతియైనయాంధ్రకవి ధూర్జటి పల్కులకేలకల్గెనోయతులిత ‘మాధురీమహిమ’

శ్రీ కాళహస్తీశ్వర శతకం – జ్ఞాన ప్రసూనం – 3
డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement