Thursday, May 26, 2022

ఆత్మ ప్రబోధం ఆచరణీయం

మనకంటూ ఇహలోకంలో శాశ్వతంగా మిగుల్చు కునిపోయే భౌతిక సంపద అంటూ ఏదీ లేదు. సకల సద్గుణాలే శాశ్వత ఆభరణాలు. భౌతికమైన, అశాశ్వ తమైన తుచ్ఛ సంపదల వెంట పరుగెడుతూ, మన శ్శాంతిని కోల్పోవడమే కాకుండా పరులకు అపకారం తల పెడుతూ, అనునిత్యం కలహ భోజన ప్రియత్వంతో పైశాచిక ఆనందాన్ని పొందుతూ అదే జీవితమని భ్రమించి, ఛీత్కారాలతో కాకుల్లా బ్రతికేస్తే, జీవితానికి అర్ధమేమిటి? పరమార్ధమేమిటి? విధి తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తుందని నమ్మేవారు కూడా తమ ఆత్మతృప్తి కోసం ఇతరులను మానసికంగా గాయపరచడం, అహంతో చెలరేగి పోవడం మానసిక దౌర్భర్యం. ఒకవైపు తీవ్ర మైన దైవ చింతన, మరోవైపు పరహంస, ద్రోహచింతన వంటి భావాలను దైవం మెచ్చునా? మనం చేసే ప్రతీ కార్యం చిత్తశుద్ధితో, ఆత్మ ప్రబోధానుసారం జరగాలి. మెదడులో జనించే ఆలోచనలు హృదయం వరకు వచ్చేసరికి, మంచిచెడుల అంతర్మధనం జరు గుతుంది. చెడు వలదని ఆత్మ ప్రబోధిస్తున్నా, చెడు వైపే దృష్టి సారించడం దైవ ద్రోహమే. అంత రాత్మ అంగీకారమే దైవం మెచ్చిన సత్కారం. ఈ నిజాన్ని దాచి, అంత రాత్మకు విరుద్ధంగా ప్రవర్తించడం మానవ బలహనత. మానవుడు తన బలహనతలను జయించిన నాడు మహనీయుడు కాగలడు. అయితే చంచల స్వభావం గల మనిషిలో సకల సద్గుణ సంపద ను అన్వేషించడం, సంపూర్ణ మహనీయతను ఆశించ డం అత్యాశే కాగలదు. కాబట్టి కనీస మానవీయ తను సంతరించుకోవ డానికి కనీస ప్రయత్నం జరగాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను త్యజించా లని ఆశించడం కంటే దుర్జన గుణాలను కనీస స్థాయికి తగ్గిం చుకుని, మనిషిగా బ్రతకడమే ఉత్తమోత్తమం. విధి ఆడే వింతనాటకంలో పావులుగా మారడం సహజమేమో. కాని విధిని సైతం ధిక్క రించి, ఇతరుల మనోవేదనకు కారణమైన వారంతా ఈ భువిపై శాశ్వతంగా మిగిలిపోరు. వారంతా ఏదో ఒక రోజు కాలగర్భంలో కలసిపోక తప్పదు. చర్యకు ప్రతిచర్య ఉంటుందనేది శాస్త్ర సమ్మతం. మనం చేసే ప్రతీ పనికి మంచి చెడుల ఆధారంగా ప్రతి చర్యలుంటాయి. దుష్కృత్యాలకు ఫలితం తప్పదు. ఇది ఒక తరానికే పరిమితంకాదు. కొన్ని తరాలకు శాపంగా మారుతుం దనే సత్యం చరిత్ర చెబుతున్నది. మనిషి ఎంతకాలం జీవించా మన్నది కాదు, ఎంత గౌరవంగా జీవించామన్నదే ప్రధానం. నేటి సమాజంలో ఒకరిని మరొకరు పీక్కుతినే పరిస్థితులు ఏర్పడు తున్నాయి. అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా ఒకరి ఆవేదనకు మరెంద రో కారణం కావడం ఎంతవరకు సబబు? ఇతరుల జీవితాలను శాసిస్తూ, హింసిస్తూ, వారి ఆవేదనకు కారణం కావడం అత్యంత పైశాచికం. ఒక్కసారి ఆలోచించాలి. మనం ఎందుకు జన్మించా ము? జన్మించి చేస్తున్నదేమిటి? మనుషులు మారాలి. మారిన మనుషులు ఎవరినీ ఉద్ధరించనవసరం లేదు. ఎవరి బ్రతుకును వారు బ్రతికి, ఇతరులను కూడా బ్రతకనిచ్చే మానసిక ఉచ్ఛస్థితి మనలో కలగాలి. పశ్చాత్తాపంతో మారడం ఒక ఎత్తయితే, వైరా గ్యంతో మారడం మరొక అంశం. మొదటి మార్గమే శ్రేయస్కరం. మానవ తప్పిదాల వలన సకల జీవరాశులు మహా ప్రళయం అంచున నిలబడి ఉన్నాయి. ఇకనైనా మన తప్పిదాలకు, ఘోర కృత్యాలకు విముక్తి లేదా?
సకలాచరాచర జగత్తును విధ్వంసం చేసి, మానవుడు సాధించే దేమిటి? అనంత కోటి జీవరాశుల మనుగడ ప్రస్తుతం మానవ విచక్షణపై ఆధారపడి ఉంది. మన గమ్యం మంచి వైపే సాగాలి. సకల జగతి హర్షించాలి.
సన్మార్గంలో పయనిస్తూ, వ్యక్తిత్వంతో కూడిన గౌరవప్రద మైన జీవనం సర్వధా శ్రేయస్కరం. వంచన పరిత్యజించాలి. పరుష వాక్కులు, ఢాంబికం, అహం, స్వార్ధం, అవినీతి, హింస వంటి లక్షణాలను విడనాడాలి. పుట్టి జనం మెచ్చేవిధంగా జీవించాలి.
ఇతరులను దూషిస్తూ నిందా వాక్యాలను ప్రయోగిస్తూ, జీవించ డం దారుణం. ఈ దమన ప్రక్రియ దహించబడాలి. స్వార్ధం కోసం హింసించి, ఇతర వ్యక్తుల సచ్ఛీలత ను శంకించి, చెడుగా చిత్రీకరించి, అపఖ్యాతి పాలు చేయడం అత్యంత క్రూర, పాప నేర ప్రవృత్తి. దైవం మెచ్చని పాపకార్యాలకు ఉత్ప్రేర కంగా మారడం నీచాతి నీచ మైన ఉన్మాద క్రీడలో ఒక భాగం. మంచితనం తో జీవించి, ధర్మాన్ని రక్షించి, సత్యమనే సురక్షిత స్థానంపై నిలబడాలి. అప్పుడే మానవాళి మను గడ సాగించగలదు. మారడమా? మరణించడమా అనేది మన విచక్ష ణపై ఆధార పడి ఉంది. శిఖరంపై కూర్చు న్నంత మాత్రాన కాకి గరుడపక్షి కాలేదు. లేని గుణాలను ఆపాదించుకు న్నంత మాత్రాన గౌరవం లభించదు. ఎవరి కోసమో మనం జీవించనక్కరలేదు. సాధ్యమైనంత సన్మార్గంలో జీవించడానికి ప్రయత్నం చేయాలి. మురికి కూపంలో కూర్చుని మోక్షమార్గం పొందాలనుకోవడం మూర్ఖ త్వం. పరులను ద్వేషిస్తూ, అసూయాగ్నిలో రగిలిపోయే తత్త్వం నశించాలి. చక్కని పలుకులు గ్రీష్మ తాపాన్ని చల్లార్చే వర్షపు చినుకులు. హృదికి హాయినిచ్చే శీతల సమీరాలు. వాగ్భూ షణం వ్యక్తిత్వానికి వెలుగు నిస్తుంది. అసూయాగ్నిని చల్లా ర్చుకుని, పరుష వాక్కులను సంహరించుకుని మనిషిగా జీవించడమే మఘోన్నతమైన ధర్మం.

  • సుంకవల్లి సత్తిరాజు
    9704903463
Advertisement

తాజా వార్తలు

Advertisement