Tuesday, April 30, 2024

సోమనాథ జ్యోతిర్లింగము…

శ్లో సౌరాష్ట్రదేశే విశదేతి రమే
జ్యోతిర్మయం చంద్ర కళావసంతం
భక్తి ప్రదానాయ కృపావతీర్ణం
తం సోమనాథం శరణం ప్రపద్యే

భావము: స్వచ్ఛమైన, అతి రమ్యమైన (అందమై) సౌరాష్ట్ర (ప్రస్తుత గుజరాత్) దేశంలో రాష్ట్రంలోని జీవులందు భక్తిని కలిగించుట-కై- దయతో అవతరించిన జ్ఞాన జ్యోతితో ప్రకాశించుచు చంద్రకళల వంటి అందమైన రూపముగల సోమనాథుని శరణు పొందుతున్నాను.

సోమనాథుడు – చంద్రుడు, ఈశ్వరుడు అని అర్థాలు; స-ఉమ సోమ – ఉమతో కూడిన; నాథుడు -ప్రభువు -ఈశ్వరుడు; సోమము -ఒక చెట్టు-రసము – అమృత సమానమైన ఓషధీ త్వత్తము గలది. అట్టి సోమలతలో అమృత్వత్త్వమును కల్గించువాడు కావున చంద్రునకు సోముడని పేరు – ఆ సోముని (చంద్రునిచే ప్రతిష్ఠింపబడినవాడగుట చేత, చంద్రుని కోరికలను తీర్చినవాడగుటచేత అక్కడి ఈశ్వరుడు సోమనాథుడని పిలువబడుచున్నాడు.

పురాణగాథ:
అసూయపడ్డారు ఆ 26 మంది తండ్రియైన దక్షుని వద్దకు వచ్చి చంద్రుడు తమను సరిగా చూడలేదని చెప్పారు. బ్రహ్మమానస పుత్రులలో దక్షుడు అనువానికి ప్రజాపతి పదవి ఈయబడింది.. అతనికి గల నూరుమంది కుమార్తెలలో మొదటి కుమార్తె సతీదేవి ఈశ్వరుని భార్య అయింది. అశ్వని మొదలు రేవతి వరకు గల ఇరవైయేడు మంది కుమార్తెలు చంద్రుని పెండ్లాడారు. వారిలో రోహిణి మంచి అందగత్తె అగుటచేత మిగిలిన భార్యల కంటె రోహిణిపైయెక్కువ యిష్టమును చూపేవాడు చంద్రుడు. తమ కంటె యెక్కువగా భర్త అనురాగమును పొందిన రోహిణిని చూచివారు
దక్షుడు చంద్రునికి భార్యలందరను ఒకేవిధంగా చూడాలనీ, ఒకరి పైయెక్క అనురాగము, ఇతరులపై అలసత భావము చూపించకూడదనీ, తన కుమార్తెల నందరను సమానముగా చూచుకొనమని హితము చెప్పాడు. అయినా చంద్రునిలో మార్పు రాలేదు. రోహిణి కాక మిగిలిన 26 మంది మళ్ళి తండ్రి వద్దకు పోయి దుఃఖిస్తూ చంద్రునిలో మార్పు రాలేదని ఫిర్యాదు చేశారు. అందుచేత దక్షుడు చంద్రునిపై కోపించి ఏ సౌందర్యము నిన్ను దురహంకారిని చేసిందో, ఏ కళల్ని చూసి నీవు కళ్ళు గానక ప్రవర్తిస్తున్నావో అవి నీలో క్షీణించి క్షయరోగముతో చీకటి మచ్చలాగా మిగిలిపోవుదువుగాక అని శపించాడు.

- Advertisement -

ప్రజాపతి శాపము ఊరకే పోతుందా! చంద్రుడు క్షయగ్రస్తుడయ్యాడు. అందుచే చంద్రుని సర్వకార్యాలూ స్తంభించిపోయాయి. ఓషధులు, లతలు, చెట్లు నిస్తేజము లయ్యాయి. దేవతలకు సోమము (అమృతం) అందటంలేదు యజ్ఞయాగాది క్రతు వులు నిలిచిపోయాయి – అంతటా దుర్భిక్షం యేర్పడింది.

చంద్రుడు వ్యాధితో దుఃఖితుడైనాడు. చంద్రుడు ఇంద్రాది దేవతలతోను.. వశిష్ఠాది మహర్షులతోను బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవునితో తన దుఃఖాన్ని చెప్పుకొని తరుణోపాయమును చెప్పమని ప్రార్థించాడు. వారందరి ప్రార్థనలను వినిన బ్రహ్మదేవుడు “ప్రభాస తీర్థమను పుణ్యక్షేత్రమున (గుజరాత్ లోని కథైవార్ దగ్గర) శ్రీ మహా మృత్యుంజయ మంత్రముతో దీక్షగా శివుని అర్చిస్తే శివుని దయవలన శాప

బ్రహ్మదేవుని మాటలననుసరించి చంద్రుడు ప్రభాసక్షేత్రమును చేరుకొని అక్కడ పార్థివ శివలింగమును ప్రతిష్టించి, దీక్షగా నలుబది రోజులు మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించాడు. ఆ మంత్రం –

“ఓం త్ర్యంబకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్
ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్ ‘

చంద్రుని దీక్షకు సంతోషించిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ‘చంద్రా! ప్రజాపతి వాక్యములు అసతస్యములు కారాదు. అయినను నీ దీక్షకు మెచ్చి లోకకళ్యాణార్ధము ఆ శాపమునకు కొంత నివారణమును వరముగా అనుగ్రహిస్తున్నాను. నీకు క్షయ రోగముండదు-నీకు అమరత్వము కలుగుతుంది. అయితే కృష్ణపక్షములో ప్రతిరోజూ ఒక్కొక్క కళ చొప్పున పెరుగుతూ వుంటుంది. ఈ వృద్ధి క్షయములు సృష్టియున్నంత కాలము కొనసాగుతాయి.” అని వరము యిచ్చాడు.

చంద్రుడు, దేవతలు, మునుల ప్రార్థనలననుసరించి శివుడు ప్రభాస క్షేత్రమున చంద్రుని పేరుతో సోమనాథ లింగముగా వెలిశాడు. దేవతలు, మహర్షులచే పుణ్యా దకములతో నింపబడిన కుండము (చెరువు) చంద్ర కుండమని పేరొందింది – ఈ ప్రభాస క్షేత్రమే నేడు సోమనాథ్ గా పిలువబడుతోంది. (ఇది గుజరాత్ వాయువ్య తీరంలో అరేబియా సముద్రపు ఒడ్డున ఉన్నది.) ఈ సోమనాథ జ్యోతిర్లింగ దర్శనము వలన, పూజల వలన సర్వపాతకములు, దుష్కర్మలు నశించి, సర్వమనోభీష్ట సిద్ధి కలిగి అంత్యమున కైవల్యమును పొందుతారు. చంద్ర కుండమున నిత్యము స్నానము చేయు వారికి అసాధ్యములైన రోగములును నశించి ఆరోగ్యము కలుగుతుందని హిందువుల నమ్మకము.

చారిత్రకాంశములు:
మొదటి దేవాలయం క్రీస్తు పూర్వము 797-497 సం॥ల మధ్య నిర్మింపబడి యుంటుందని చరిత్రకారుల ఊహ. శ్రీ హర్ష చక్రవర్తి మనుమడైన ధారసేనుని పరిపాలనా కాలంలో క్రీ॥శ॥ 640-649 మధ్య కాలంలో రెండవసారి జీర్ణోద్ధరణ జరిగి నట్లు శిలాశాసనాల వల్ల తెలుస్తోంది. భోజపరమార్ అనే రాజు 30 అంతస్థులతో, గోపురాల మీద 14 సువర్ణకలశాలతో, నవరత్నఖచితమైన సింహద్వారంతో ఆల అద్భుతంగా దర్శనమిచ్చేదని విదేశీ యాత్రికులు అభివర్ణించారు. క్రీ॥ శ॥ 755లో అరబ్బుల దండయాత్రలో ఆ ప్రాంత పాలకులైన వాలభి రాజులు ఓడిపోవడంతో ఆలయానికి పోషకత్వం కరవైపోయింది. క్రీ॥శ॥ 800 ప్రాంతంలో ‘నాగభట్ట’ అను నతడు విదేశీయుల్ని పారద్రోలి మూడవసారి ఎర్ర ఇసుకరాళ్ళతో దేవాలయాన్ని బాగు చేయించి తిరిగి వైభవాన్ని కలిగించాడు.

క్రీ॥ శ॥ 1026 జనవరిలో గజనీ మహమ్మద్ సైన్యము సోమనాథ్ను ముట్టడిం చింది. మందిర పరిరక్షణలో 50 వేల మంది సౌరాష్ట్ర వీరులు మరణించారు. గజనీ మహమ్మద్ కోటను స్వాధీనం చేసుకొని, మందిరంలోని అపార ధనరాశులను దోచు కొని, శివలింగాన్ని ముక్కలుగా చేసి, దేవాలయాన్ని నేలమట్టం చేసి వెళ్ళిపోయాడు. ‘ఆల్బిరూని’ అను అరబ్ యాత్రకుని వర్ణనలను చదివి తీరవలసిందే.

క్రీ॥శ॥ 1045 నాటికి ఆలయం తిరిగి పునరుద్ధరింపబడింది. ఇది నాల్గవసారి. ఈకాలంలో గుజరాత్ ప్రాంతానికి ‘గూర్జర’దేశమనే పేరు వచ్చింది. క్రీ॥శ॥ 1144లో రాజైన కుమారపాలుడు 1164లో ఆలయాన్ని విస్తృతపరచి ఆలయరక్షణకు కోట గోడను, దేవాలయానికి బంగారు కలశాలను, విశాలమైన దర్బారు హాలు, ముఖ మంటపము, మంచినీటి కోనేరు, అర్చకులకు ఇండ్లు, సముద్రం వరకు మెట్లు నిర్మింపజేశాడు.

రెండవ భీమదేవుడను రాజు మేఘనాథ మంటపాన్ని నిర్మించాడు. విశాలదేవుని కాలంలో ‘సరస్వతీ సదస్సు’ పేరుతో కళాశాల ప్రారంభమైనది. 1287లో త్రిపురాంత కుడనే యోగి ఈ ఆలయప్రాంగణంలో ఉమాపతి, ఉమేశ్వర, మల్హణేశ్వర, త్రిపురాంత కేశ్వర, రామేశ్వర ఆలయాలను నిర్మించాడు. 1144-1297 మధ్యకాలంలో సోమ నాథ దేవాలయం అత్యంత వైభవ స్థితిని పొందింది.

క్రీ॥శ॥ 1297లో ఢిల్లీ సుల్తానుల మద్దతుదారు జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క సైనికాధికారి అలాఢాన్ దేవాలయాన్ని నేలమట్టం చేశాడు. 1308-1325 మధ్యలో మహీపాలదేవుడనే రాజు తిరిగి పునర్నిర్మాణం ప్రారంభించగా అతని కుమారుడు ‘రా-ఖరగర్’ 1325-1351 మధ్య ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేసి సోమనాథలింగ శ్రీ ప్రతిష్ట చేశాడు. 1394లో గుజరాత్కు ఢిల్లీ సుల్తానులు ప్రతినిధియైన ముజఫరాఖాన్ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. తర్వాత చిన్నదిగా తిరిగి నిర్మింపబడింది. దానిని ముజఫరాఖాన్ మనుమడు అహమ్మద్ షా 1413లో ధ్వంసం చేశాడు. ఇతడే కర్ణావతి నగరాన్ని అహమ్మదాబాద్ అని పేరు మార్చాడు. తర్వాత నిర్మింపబడిన దేవాలయాన్ని మహమ్మద్ బేగడా అనే రెండవ ముజఫర్ ఖాన్ 1459లో ధ్వంసం చేశాడు.

అక్బర్ కాలంలో స్థానికుల కృషితో 1560లో ఆలయం పునరుద్ధరింపబడింది. క్రీ॥శ॥ 1669లో ఔరంగజేబు భారతదేశంలోని ముఖ్య దేవాలయాలన్నింటితోపాటు సోమనాథ దేవాలయాన్ని కూడ ధ్వంసం చేయించి మసీదుగా మార్చాడు. 1708లో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ నూతనంగా దేవాలయాన్ని నిర్మింపజేసింది. 1812లో దేవాలయ నిర్వహణ బాధ్యత బరోడా రాజు గైక్వాడ్ చేతుల్లోకి వచ్చింది. బ్రిటీష్ పాలనలో లార్డ్ కర్జన్ మసీదుగా ఉన్న దేవాలయం చుట్టూ ప్రహరీ గోడను నిర్మించాడు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, కె.ఎం. మున్షీల ప్రయత్నాలతో 11-5-1951న జ్యోతిర్లింగ ప్రతిష్ఠ నాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా జరిగింది. 13-5-1965న సోమనాథ దేవాలయ శిఖరానికి కలశ ప్రతిష్ఠ, ధ్వజారోహణము జరిగాయి.

భారతదేశంలో ముస్లిముల చేత యెన్నో దేవాలయాలు దోచుకోబడి ధ్వంసం చేయబడ్డాయి. చాలా దేవాలయాలు మసీదులుగా మార్చబడ్డాయి. అన్నిటికంటే యెక్కువసార్లు ధ్వంసం చేయబడినది సోమనాథ దేవాలయమే – సోముని (చంద్రుని) కళలు యెన్నిసార్లు తగ్గుతాయో, అన్నిసార్లు తిరిగి అభివృద్ధి చెందుతాయి అన్నట్లుగా హిందూదేవాలయాలు యెన్నిసార్లు ధ్వంసం చేయబడినా అన్నిసార్లు తిరిగి అభివృద్ధి. చేసుకొంటారు భారతీయులు అనేదానికి సోమనాథ దేవాలయ చరిత్రయే ప్రబల నిదర్శనము – అది భారతీయుల ఆధ్యాత్మిక విశ్వాసబలము.

Advertisement

తాజా వార్తలు

Advertisement