Friday, April 26, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

90. వన్నేయేనుగుతోలుదుప్పటము, బువ్వా కాలకూటంబు చే
గిన్నే బ్రాహ్మకపాలముగ్రమగు భోగే కంఠహారంబు మే
ల్నిన్నీలాగుననుంటయుందెలిసియున్నీపాదపద్మంబు చే
ర్చెన్నారాయణుడెట్లుమానసమునన్శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!,వన్నే- అలంకారమా? ( అలంకారం ఏమిటి అని ఆలోచిస్తే), ఏనుగు తోలు- గజచర్మం అనే, దుప్పటము- శాలువా / వల్లెవాటు, బువ్వా- ఆహారమా? కాలకూటంబు- హాలాహలం, చేగిన్నే- చేతిలో ఉన్న గిన్నె ఏమి? అంటే, బ్రహ్మకపాలము-బ్రహ్మగారి పుఱ్ఱె, కంఠహారము- మెడలోని హారమా? ఉగ్రం- అగు్స భయంకరమైన, భోగి- ఏ- పాము, మేల్- మంచిది, నిన్ను- నీవు, ఈలాగునన్- ఈ విధంగా, ఉంటయున్- ఉండటం, తెలిసియున్- తెలిసి కూడ, నారాయణుడు- శ్రీ మహావిష్ణువు, మానసమున- తన మనస్సులో, నీ పాదపద్మంబు- నీ పదకమలాన్ని , ఎట్లు- ఏ విధంగా చేర్చెన్- నిలిపాడు?
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! నీకు అలంకారం ఏనుగ తోలుశాలువా, నీ ఆహారం కాలకూటవిషం. చేతిలో ఉన్న గిన్నె బ్రాహ్మగారి కపాలం. నీ కంఠహారం భయంకరమైన పాము. నీవు ఈ విధంగా ఉంటావని తెలిసి కూడ శ్రీమహావిష్ణువు నీ పాదపద్మాలని తన మనసులో నిలిపి ధ్యానం చేయటం చిత్రం కదా!
విశేషం: రూపం ఇట్లా ఉంటుంది అంటే, దాని వెనుక ఉన్న ఆర్థిక స్థితికి అది అద్దం. లక్ష్మీపతి అయిన విష్ణువు ఆదిభిక్షు వైన శివుణ్ణి ధ్యానించటం సామాన్యుల దృష్టికి చిత్రంగానే కనిపిస్తుంది మఱి! ప్రతి అలంకారం వెనుక శివుడి ప్రతాపాన్ని తెలిపే ఒకగాథ ఉంది.
ఏనుగతోలు : గజాసురసంహారాన్ని గుర్తుకు తెస్తుంది. ఏనుగు అహంకారానికి ప్రతీక. గజాసురసంహారం అంటే అహంకార నిర్మూలనం.
కాలకూటం: శివుడి పరహితార్థకాంక్షని సూచిస్తుంది. అందరూ సముద్రమథన సమయంలో లభించిన భోగవస్తువులను గ్రహిస్తే, ప్రాణాంతకమైన కాలకూటాన్ని గ్రహించాడు శివుడు.
బ్రాహ్మకపాలం: బ్రాహ్మ శిరస్సును ఖండించిన వైనం గుర్తుకు వస్తుంది.
పాము కంఠహారం : అందరూ భయపడే విషయజంతువుని అలంకారంగా మలచుకోవటం విషకంఠుడికిఅలవోక కార్యం.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement