Saturday, May 4, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

74.మాయాజాండకరండ కోటి( బొడిగామర్దించిరో, విక్రమా
జేయుంగాయజు( జంపిరో, కపట లక్ష్మీమోహముంబాసిరో
యాయుర్దాయ భుజంగ మృత్యువు ననాయాసంబునన్గెల్చిరో
శ్రేయోదాయకులెట్టులౌదురితరుల్శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, ఇతరుల్- నీవు కాక ఇతరులు, మాయా- అజ- అండ- మాయాకల్పితమైన బ్రహ్మాండ, కరండకోటిన్- భాండ సముదాయాన్ని, పొడి- కాన్- మెత్తని చూర్ణం అయ్యేట్టు, మర్దించిరి- ఓ- నూరారా?, విక్రమ- అజేయున్- పరాక్రమంతో గెలవటానికి వీలు కాని, కాయజున్- మన్మథుణ్ణి, చంపిరి- ఓ- సంహరించారా?, కపట- నిజం కాని, లక్ష్మీ- ఐశ్వర్యము నందలి, మోహమున్- వ్యామోహాన్ని, పాసిరి- ఓ- విడిచారా?, ఆయుర్దాయ- ఆయుష్షు అనే, భుజంగ- సర్పరూపమైన, మృత్యువున్- మరణాన్ని, అనాయాసంబునన్- శ్రమ లేకుండా, గెల్చిరి- ఓ- జయించారా?, ఎట్టుల- ఏ విధంగా, శ్రేయోదాయకుల్- మోక్షప్రదాతలు, ఔదురు- అవుతారు? (అవరు అని భావం)
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! ఇతర దైవాలు మాయాకల్పితమైనబ్రహ్మాండకోటులను పొడి అయ్యేట్టు నూరారా?(లేదు). పరాక్రమంలో గెలవ శక్యం కాని మన్మథుణ్ణి గెలిచారా? (లేదు). సత్యం కాని సంపదలపై వ్యామోహాన్ని వదిలారా? (లేదే). ఆయువుని సర్పరూపంలో హరించే మృత్యువుని తేలికగా జయించారా? (లేదు కదా). అటువంటివారుమోక్షప్రదాతలుఎట్లా అవుతారు? (కారు). ఆ కార్యాలు చేసిన నీవే మోక్షం ఇవ్వగలిగిన వాడివిఅని భావం.
విశేషం: ప్రళయకాలంలో శివుడు తన నుండి సృష్టించబడిన బ్రహ్మాండాల నన్నింటిని చూర్ణం చేసి, దానిని విభూతిగా తన శరీరం పైన అలదుకుంటాడట! మన్మథుణ్ణి గెలిచాడు. సంపదలపై మోహం లేనివాడు. ఆదిభిక్షువు. మృత్యువుని గెలిచాడు. ఇవి మఱెవ్వరికి సాధ్యపడే విషయాలు కావు కదా!

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement