Thursday, May 16, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

47. మునునే( బుట్టిన పుట్టు లెన్నిగలవో! మొహంబుచే నందు( జే
సినకర్మంబులప్రోవులెన్నిగలవో, చింతించినం గాన, నీ
జననం బే యనియున్నవాడ, నిదియేచాలింపవే, నిన్ను గొ
ల్చినపుణ్యంబునకుంగృపారతుడవైశ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీ కాళహస్తీశ్వరా!నేన్ – నేను, మును – పూర్వం, పుట్టిన – ఎత్తిన, పుట్టులు – జన్మలు, ఎన్ని కలవు్శ ఓ – ఎన్ని ఉన్నాయో? అందు – ఆ జన్మలలో, మొహంబుచేన్ – వ్యామోహం వల్ల, (మాయకు లోనై), చేసిన – ఆచరించిన , కర్మంబులప్రోవులు – పనుల రాశులు, ఎన్ని కలవు – ఓ – ఎన్ని ఉన్నాయో!, చింతించినన్ – ఆలోచించినా, కానను – ఎరుగ లేకున్నాను. ఈ జననంబు – ఏ – ఈ జన్మ మొక్కటే, అని – ఉన్నవాడన్ – అనుకుంటున్నాను. కృపారతుడవు – ఐ – దయ కలిగిన వాడవై, నిన్నున్ – నిన్ను, కొలిచిన – సేవించిన, పుణ్యంబునకున్ – సత్కార్యాల ఫలితంగా, ఇదియే – ఈ జన్మంతోనే, చాలింపవు – ఏ- సరిపుచ్చవా?(అనగా జన్మ లేకుండ చేయమని అర్థం)
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! ఇంతకు ముందు ఎన్ని జన్మలెత్తిఉన్నానో? మాయావృతుడనై ఆయా జన్మలలో ఆచరించిన కర్మల సముదాయాలెన్ని ఉన్నాయో? ఎంత ఆలోచించినా ఎరుగ లేకుండా ఉన్నాను. ఈ జన్మ మొక్కటే అనుకుంటున్నాను. (ఇది తప్ప ఇంకేమీ తెలియటం లేదు కదా!) నిన్ను నేను సేవించిన పుణ్యానికి సంతోషించి, నా పై కరుణ చూపి, దీనితో, అంటే ఈ జన్మతో సరిపుచ్చు. ( అనగా, మఱియొక జన్మ లేకుండా అనుగ్రహించ మని కోరిక)
విశేషం: ఎవరికైనా ఈ జన్మ ఒక్కటే తెలుస్తుంది. ఈ జన్మ ఒక్కటే పరమార్థ మని, దీన్ని సఫలం చేసుకుంటే చాలని అనుకుంటారు. లౌకికదృష్టితో అంతే కదా! కాని, ప్రతిజన్మ ఇంతకు ముందు జన్మల కర్మల ఫలం. రాబోయే జన్మలకు కారణం అవుతుంది. దీనినే సంసారచక్రం అంటారు. దీనికి తుద, మొదలు లేదు. వర్తులాకారంలో నడుస్తూ ఉంటుంది. ధూర్జటి తనకు ఇంతకు ముందు జన్మలు తెలియవు, అప్పటి కర్మల కారణంగా ఈ జన్మ లభించింది, ఇన్ని జన్మలలోనూ అనుభవించక మిగిలిన కర్మలు ఏవైనా ఉంటే, మఱియొకజన్మకు ఉంచక, పరమేశ్వరుణ్ణి సేవించిన పుణ్యం కారణంగా వాటిని పరిహరించి, మఱియొక జన్మ ఎత్త వలసిన అవసరం లేకుండా దయ తలచ మని ప్రార్థించాడు. అట్టి జన్మరాహిత్యానికి తన కున్న అర్హత తాను సేవించే శివుడు కృపారతుడై ఉండటమే కాని, తాను గొప్ప భక్తుడు అవటం కాదు అని నిశ్చయంగా చెప్పాడు.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement