Monday, April 29, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

37. తనువే నిత్యముగా నొనర్పు, మది లేదా, చచ్చిజన్మింపకుం
డ నుపాయంబుఘటింపు మా గతులు రెంటన్నేర్పు లేకున్న లే
దని నా కిప్పుడ చెప్పు, చేయగల కార్యంబున్నసంసేవ( జే
సి నినుంగాంచెద( గాక కాలముననోశ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం : శ్రీకాళహస్తీశ్వరా!, తనువు – ఏ – శరీరమే, నిత్యము – కాన్ -శాశ్వతం అయ్యేట్టు, ఒనర్పుము – చేయ వలసినది. అది – ఆ విధంగా, లేదా – కుదరనట్లయితే, చచ్చి – చనిపోయిన తర్వాత, జన్మింపక – ఉండన్ – పుట్ట కుండగ, ఉపాయంబు – ఘటింపుము – ఏర్పాటు చెయ్యవలసినది. ఆ గతులు – ఆ పద్ధతులు, రెంటన్ -రెండింటిలో, నేర్పు -నైపుణ్యం, లేక -ఉన్న్స లేనట్లయితే, లేదు – అని – నేర్పు లేదని, నాకు -నాకు, ఇప్పుడు – అ -ఇప్పుడే, చెప్పు్స చెప్ప వలసినది. చేయన్ – కల- చేయ గలిగిన, కార్యంబు -పని, ఉన్న -ఉన్నట్లయితే, కాలమునన్ -(తగిన) సమయంలో, చేసి – నిర్వర్తించి, సంసేవన్ – నిన్ను చక్కగా సేవించుకోవటం ద్వారా, నిన్నున్ -నిన్ను, కాంచెదన్ – కాక -దర్శిస్తాను. ( నిన్ను చేరుకుంటాను).
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! శరీరమే శాశ్వతమయ్యేట్టుగా చేయి. లేదా, చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టకుండా చేయి. ఈ రెండు నీ వల్ల కాకుంటే ఆ సంగతి నాకిప్పుడే చెప్పు. నేను చేయగల పని సకాలంలో నిర్వర్తించి, నిన్ను చక్కగా సేవించుకున్న దాని ఫలితంగా నిన్ను దర్శిస్తాను.
విశేషం: జీవితం అశాశ్వతంఅని, చనిపోయిన జీవి మళ్ళీ జన్మించక తప్పదని అందరికీ తెలుసు. అది సృష్టిధర్మం. దాన్ని తప్పించటం ఒక్క పరమేశ్వరుడికే సాధ్యం. కనుకనే అ శివుణ్ణి ప్రార్థించటం. ఒకవేళ శివుడికి కూడా సాధ్యపడక పోతే, అది శివభక్తుడికి సాధ్య మవుతుంది–శివానుగ్రహం కారణంగా. అది లభ్యం కాక పోయినా భక్తుడు బాధ పడడు. అన్నిటినీ మించింది శివదర్శనం. అది లభిస్తే ఇంకేమీ కోరడు శివభక్తుడు.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement