Sunday, May 19, 2024

రఘు మహారాజు కౌత్సుడుల ధర్మవర్తన!

పూర్వం శ్రీరామచంద్రుని తాతగారైన రఘు మహారాజు ధర్మవర్తనుడై ప్రజలను పాలించేవాడు. ఆ మహానుభావుని రాజ్యంలో అనేక గురుకులాలుండేవి. ఒక్కొ క్క గురుకులంలో వెయ్యిమందికి తక్కువకాకుండా శిష్యులుండేవారు. ఆ కాలం లో గురుశిష్యుల అనుబంధం చాలా విశేషంగా ఉండేది. అలాంటి గురుకులాల్లో ఒక గురుకులంలో సమస్త విద్యలు నేర్చుకున్నాడు కౌత్సుడు అనే విద్యార్థి.
ఆనాటితో గురుకులంలో కౌత్సుడు శిక్షణ పూర్తి అయింది. గురువుగారి దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు. అప్పుడు గురువుగారు ”నాయనా! నాకు తెలిసిన విద్యలన్నీ నీ కు నేర్పాను. నీవూ శ్రమించి శ్రద్ధగా విద్యను అభ్యసించావు. ఇక గృహస్థాశ్రమును స్వీక రించి సమాజ కళ్యాణానికి ఉపకరించు. అంతేకాదు శాస్త్ర పఠనం మొదలైనవి ఎప్పటికీ మఱువకు” అని అన్నారు.
కౌత్సుడు వినయపూర్వకంగా నమస్కరిస్తూ ”అయ్యా! నాకు విద్యాబుద్ధులు నేర్పిం చి సంస్కారవంతుడిని చేశారు. ఎంతో ఆదరించారు. తల్లిదండ్రులను మరిపించే ప్రేమా భిమానాలు చూపారు. కృతజ్ఞతా చిహ్నంగా గురుదక్షిణను ఇచ్చే అవకాశాన్ని ప్రసాదిం చండి.” అన్నాడు.
”నిరుపేదవు నీవేమి ఇచ్చుకుంటావు నాయనా” అంటూ ఏమీ వద్దని ఎంతో నచ్చ చెప్పాడు గురువు. ఎంత చెప్పినా వినని కౌత్సునితో విసిగి ఈతనిని పరీక్షిద్దామని గురువు ”నీకు 14 విద్యలు నేర్పాను. అందుకుగాను ఒక మనిషి ఏనుగుపై నిలబడి రివ్వున ఓ రాయి విసిరితే ఎంత ఎత్తు వెళుతుందో అంత ధనరాశులు 14 ఇమ్ము.” అన్నారు.
గురుభక్తితో గురువుగారికి దక్షిణ ఇవ్వాలన్న సత్సంకల్పమే కాని అది ఎలా నెరవే ర్చాలో తెలియలేదు కౌత్సునికి. పరిపరి విధాలుగా ఆలోచించాడు. చివరకు ఓ ఆలోచన తట్టింది. దాన్ని వెంటనే అమలుచేశాడు. రాజు తండ్రి వంటివాడు తన అవసరాన్ని ఆయ నకే విన్నవించుకుందామని రఘుమహారాజు వద్దకు వచ్చాడు కౌత్సుడు.
అంతకుముందే రఘు మహారాజు విశ్వజిత్‌ అనే మహాయజ్ఞం చేశాడు. ఆ సంద ర్భంగా చేసే యజ్ఞదానాల్లో తనకున్న సర్వస్వం (సుమారు 14 కోట్ల దీనారాలు) దానం చేశాడు! కౌత్సుడు వచ్చేసరికి రఘు మహారాజు మట్టికుండలో నీళ్ళు పెట్టుకుని సంధ్యా వందనం చేసుకుంటున్నాడు. అతి సాధారణ స్థితిలో వున్న రఘు మహారాజును, ఆయన దానగుణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కౌత్సుడు. కౌత్సుని చూచి వచ్చిన కారణమేమని అడిగాడు రఘు మహారాజు.
”రాజా! ఈ స్థితిలో నేను మీకు ఏమీ చెప్పలేను. నా విన్నపాన్ని నెరవేర్చడము మీకు చాలా కష్టము. నేను వెళతాను” అంటూ వెను తిరిగాడు కౌత్సుడు.
వెంటనే రఘు మహారాజు కౌత్సుని పిలిచి ”నా దగ్గరకు వచ్చి వట్టి చేతులతో వెను తిరిగి పోవటమా! సంశయించక అడుగు నాయనా” అని అన్నాడు.
ఇక చేసేదేమియు లేక కౌత్సుడు తాను వచ్చిన పని ఏమిటో రఘు మహారాజుకు చెప్పి తలదించుకుని నిలుచున్నాడు.
”రేపు ఉదయమే రా నాయనా! నీవు కోరిన ధనం ఇస్తాను” అని చెప్పి పంపాడు రఘు మహారాజు.
ఎవరికి ఏ సమస్య వచ్చిన అందరికంటే ముందుగా స్పందించి సమస్యను పరిష్క రించేవాడు, హితం చేసేవాడు పురోహతుడని ఎఱిగిన రఘు మహారాజు తన గురువైన వసిష్ఠ మహర్షి వద్దకు వెళ్ళి నమస్కరించి, తన సమస్యను వివరించాడు.
మహాజ్ఞాని అయిన వసిష్ఠుడు ”రాజా! నీవు సంపాదించి ఇవ్వడానికి నీకు వ్యవధి లేదు. వెంటనే ఇంద్రునిపై దండెత్తు” అని హతం చెప్పాడు. వెనువెంటనే విజయ భేరీలు మ్రోగాయి. ఆ భీకర భేరీ నినాదాలు ఇంద్రుడు చెవులకు వినిపించాయి. ఆ భీకర నినాదాలు రఘు మహారాజు రాజ్యం నుంచి వస్తున్నాయని తెలుసుకొని దేవేంద్రుడు ”ఎంతో ధర్మా త్ముడు రఘు మహారాజు. వెంటనే ఆయన కోశాగారాలన్నీ ధనంతో నింపండి” అంటూ తన సేవులను ఆజ్ఞాపించాడు.
ధన రాశులతో కోశాగారాలు నిండిపోవడం చూసిన రాజభటులు వెంటనే రఘుమ హారాజు దగ్గరకు వెళ్ళి కోశాగారాలు నిండి ఉన్నాయని విన్నవించారు. దాంతో రఘు మహారాజు దండయాత్రకు స్వస్తి చెప్పాడు. తెల్లవారి ఉదయం కౌత్సుడు రాగానే ”మీ ధనం కోశాగారాల్లో ఉంది. తీసుకు వెళ్ళండి” అని చెప్పాడు.
కోశాగారాల్లో తను అడిగిన దానికన్నా ఎక్కువుందని తెలిసిన కౌత్సుడు ”రాజా! నేను మిమ్మల్ని అడిగినవి… నాకు కావలసినవి 14 రాశులే. మిగతా ధనం నాది కాద”ని చె ప్పి, తనకు కావలసిన ధనాన్ని తరలించుకుని వెళ్ళిపోయి గురుదక్షిణ చెల్లించుకున్నాడు.
అక్కడ మిగిలిన ధనాన్ని చూసి రఘు మహారాజు ”మరి ఈ ధనమెవరిది?” అనుకు ని వెంటనే మిగిలిన ఆ ధనాన్ని అంతా దేవేంద్రునికి పంపివేశాడు! అంతటి ధర్మాత్ముడు రఘు మహారాజు. కాబట్టే సాక్షాత్తూ ఆ పరమాత్మయే అతని పౌత్రుని (మనుమడు)గా జన్మించాడు.
శ్రీమద్రామాయణంలోని ఈ కథ ద్వారా ప్రజలకు తెలిసిందేమిటంటే- గురుశిష్యుల అన్యోన్యమైన సంబంధం. శిష్యుల దగ్గర నుంచి ప్రతిఫలం ఆశించకుండా సర్వవిద్యలూ నేర్పే గురువులు, గురువుని దైవంగా పూజించి శ్రద్ధాభక్తులతో సకల విద్యుల అభ్యసించి, కృతజ్ఞత తెలియచేయాలనుకునే శిష్యుల ఔన్నత్యం. అటువంటి ఆదర్శమూర్తులు నడ యాడిన మన భారతదేశం నిజంగా భూలోక స్వర్గం.
అంతేకాదు… రఘు మహారాజు దానగుణం ఈ కథలో వ్యక్తమవుతున్నది. ఎప్పటిక ప్పుడు ఆయన సంపాదించినదంతా దానం చేసేవాడు. అంతటితో ఆగేవాడు కాదు. దా నం చేయటానికి మళ్ళీ సంపాదించేవాడు. అదే ఆయన జీవన పరమాధిగా జీవించిన గొ ప్ప మహారాజు ఆయన. అలాగే కౌత్సుడు కూడా ధర్మవర్తనుడే! తన గురువుగారు కోరి నంత, తాను ఇవ్వవలసినంత ధనాన్నే తీసుకున్నాడు. కళ్ళముందు ధనరాసులు వున్నా ఏమాత్రం అతని మనస్సు చలించలేదు.
ఇక రఘు మహారాజు అయితే తన కోశాగారం ఖాళీ అయిపోయినా… తనదికాని సొమ్మును ఉంచుకోలేదు. కౌత్సుడు తీసుకున్నాక మిగిలిన ధనాన్ని పరాయి సొమ్ముగానే భావించాడు. వెంటనే ఆ ధనాన్ని అంతా ఇంద్రునికి తిరిగి 0పంపివేశాడు.
కౌత్సుడు, రఘు మహారాజుల నిజా యితీ శ్లాఘనీయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement