Wednesday, May 1, 2024

విదుర నీతిలో త్రికరణ శుద్ధి!

ధృతరాష్ట్రుడు విదురుడును పిలిచి ” నిర్మలోత్తమా! విదు రా! సంజయుడు నన్ను యుద్ధానికి కారణం నేనేనని నా ముఖం మీదే దుర్భాషలాడి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి అధికమైన దు:ఖంతో, నా మనస్సు కలత చెంది, శరీరం నిప్పుల కొలిమిలో ఉన్నట్లు కుతకుతలాడి, కొంచమైనా నిద్ర పట్ట డంలేదు. నీవు ధర్మాధర్మాలు తెలిసిన వాడవు. నాకు నిద్రాఖేదాన్ని కలిగిస్తున్న ఈ దు:ఖం పోయేటట్లు, నీ అమృత వచనాలను వినాలని ఉంది” అని కోరగానే, విదురుడు నీతివాక్యాలు చెప్పడం ప్రారం భించాడు. విదురుడు చేసే నీతి బోధలో మూడు అంశాలు చోటుచేసు కొన్నాయి. అవి- 1. లోక నీతి 2. ధర్మనీతి 3. దైవ భీతి. ఈ మూడు త్రికరణ శుద్ధిగా పాటిస్తే, సర్వకాలాలో లోకులకు హితం కూర్చ డమేకాక, చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
ధృతరాష్ట్రా! కోపము, పొంగిపోవటము, గర్వము, తృప్తి లేక పోవడం, దురభిమానం, ఏ పనిచేయకపోవడము, ఇవన్నీ దుర్జ నుడి లక్షణాలు. భగవంతుడుని, భార్యను, బంధువులను తగిన విధంగా పూజించే, గౌరవించే సత్సస్వభావంతో ఉండనివారే సత్ఫలి తాలను ఆశించడం అవివేకి లక్షణం.
రాజా! ధనమూ, విద్య, హోదా, ఉత్తమ వంశం ఇటువంటివి దుర్బుద్ధులకు మదం కలిగిస్తాయి. అవే సద్బుద్ధులకు కీర్తిని, అణకు వను, గౌరవాన్ని తెచ్చిపెడతాయి. బుద్ధి, వాక్కు, క్రియ అనే వాటిని నిశ్చలత్వంతో, ధర్మార్థకామాలనే మూడింటిని వశపడేటట్లు చేసే వాడే వివేక ధనుడు సుమా! సత్ప్రవర్తన అనే సముద్రాన్ని దాటించ డానికి సత్యం అనే ఓడ కారణభూతమైతే, సత్యాన్ని మించిన గుణం ఇంకోటి ఉంటుందా?
ధృతరాష్ట్రా! క్షమించే గుణం చూసి ప్రజలు అసమర్థతను ఆపా దిస్తారు. కాని ఆలోచిస్తే, గొప్పదైన క్షమాగుణం వ్యక్తికి ఆభరణం లాంటిది. ఎక్కడా పరుషంగా మాట్లాడక పోవడం, శాంతంగా ఉండడం, పాపపు కార్యాలు చేయక పోవడంలాంటి లక్షణాలు కలి గిన మనిషి పురుషోత్తముడు అనిపించుకొంటాడు. బీదవాడైనా, తనకున్నంతలో దానం చేసేవాడు పుణ్యాత్ముడు అని పెద్దలు అం టారు. స్త్రీ వ్యామో#హం, త్రాగుడు, జూదం, వేట, ఇతరులను దండిం చడం, కఠినంగా మాట్లాడటం, డబ్బు వృథా చేయడం, ఈ ఏడు వ్యసనాలయందు ఆశక్తి చూపరాదు.
కురు వంశోత్తమా!
”తనువున విరిగిన యలుగుల
ననువున బుచ్చంగ వచ్చు నతి నిష్ఠురతన్‌,
మనమున నాటిన మాటలు,
విను మెన్ని యుపాయములను వెడలునె యధిపా!
అంటే శరీరంలో నాటుకొన్న బాణాలను ఉపాయంతో తొలగిం చుకోవచ్చు. కాని మిక్కిలి గట్టిగా మనస్సులో నాటుకొన్న మాటలు ఎన్ని ఉపాయాలచేత నైనా,
బయటకు తీయగలమా? మనస్సు గాయం స్థిరమైంది సుమా! ఇతరుల సంపదకు, విద్యాపరిపక్వతకు, తేజస్సుకు, గౌరవ ప్రతిష్ఠలకు, మనస్సు కాలిపోయేటట్లు ఈర్ష్యపడే మనుష్యుడు రోగం లేకుండానే, అనారోగ్యంతో వేదన అనుభవిస్తాడు. స్నేహ- విరోధాలు, జ్ఞాన- అజ్ఞానాలు, ధర్మ- అధర్మాలు, తుంటరి స్వభా వం, మాటల తీరును బట్టే వస్తాయి. కాబట్టి ఓర్పు, సహనంతో ప్రవ ర్తించాలి. కత్తితోగాని, గొడ్డలితో కాని, గట్టిగా నరకగా తెగిపోయిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది. కాని మాటలచే చెడి భగ్నమై పోయిన కార్యం తర్వాత ఏవిధంగానూ చక్కబడదు. చెడు కాలం దాపురిస్తే, చెడు మాటలు, బోధనలు ధర్మాలుగా కనపడతాయి. ఎల్ల పుణ్య కార్యాల సమూహం ఒక దిక్కున, ధర్మాచరణ మరో దిక్కున ఉంచి తే వేదాలు ధార్మిక సంపత్తినే అధికంగా పొగిడాయి. ధర్మం కనుక కలిగి ఉంటే పురుషుడికి భూలోక ఫలాలన్నీ చేరడమే కాదు, అతడికి కీర్తి కూడా కలుగుతుంది. భూమిలో అతని కీర్తి ఎంతకాలం ఉం టుందో, అంతకాలమూ ఆ వ్యక్తికి పుణ్యలోక వాసం సిద్ధిస్తుందని పురాణాలు చెపుతున్నాయి.
రాజా! ధృతరాష్ట్రా! బాగా మగ్గకుండానే ముందే కోస్తే పండు రుచిగా లేకపోవడమేకాక విత్తనానికి కూడా పనిచేయదు. పక్వమైన పండు కోస్తేనే పండు బాగుంటుంది. కార్యం సఫలమయ్యే విధం కూడా ఇంతే.
దండలు కట్టేవాడు చెట్టు నుండి పువ్వులు కోసేవిధంగా, తుమ్మెద పూలలోని మకరందం పీల్చేవిధంగా, ఎదుటివాడు బాధ పడకుండా ఒక పని ఫలితాన్ని పొందాలి. అంతేకాని బొగ్గుల కొరకు మొదలంటూ వృక్షాన్ని నరికేయకూడదు. మహారాజా! నీతి మార్గం లో నడవడం ఉత్తమం. శక్తియుక్తులతో సంపదలను పొందటం మధ్యమం. ఆలోచిస్తే బరువుగా లాగే అరకొర బ్రతుకులైనా అధ మం. నీతి మాలిన వాళ్ళను ఉత్తములు, ప్రజలు మెచ్చు కొంటారా?” అన్నాడు. ఇలా ఎన్నో నీతివాక్యాలు చెప్పిన తర్వాత, అన్నీ విన్న ధృత రాష్ట్రుడు ”ఇప్పటి వరకు నీ మాటలవలన నా మనస్తాపం కొంచెం ఉపశమించింది. నీవే నిత్యమూ నాకు నీతులు ఒప్పుగా చెబుతూ ఉండు” అన్నాడు.
తరువాత అయినా ధృతరాష్ట్రుడులో మార్పు వచ్చిందా అంటే ఏమీ రాలేదు. కాబట్టే కురుక్షేత్ర సంగ్రామం అనివార్యమయ్యింది.
పాఠకులారా! విదురుడు చెప్పిన నీతిలోని కొన్ని విషయాల నైనా మనం ఈ నూతన సంవత్సరంలో తప్పనిసరిగా ఆచరిస్తే ఈ సంవత్సరం అంతా ఎంతో ఆనందంగా జరు గుతుంది. శుభం భూయాత్‌.

– అనంతాత్మకుల రంగారావు
7989462679

Advertisement

తాజా వార్తలు

Advertisement