Thursday, May 2, 2024

ఫాల్గుణ అమావాస్య

హైందవ ధర్మంలో అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఫాల్గుణ అమావాస్యకు మరింత ప్రత్యేకత ఉందని పండితులు చెబుతారు. జీవితంలో సంతోషం. ఐశ్వర్యం, అదృష్టం కోసం ఈ అమావాస్యను పాటిస్తారు. అంతేకాకుండా ఈరోజున పూర్వీకుల ఆత్మశాంతి కోసం తర్పణం, శ్రాద్ధం కూడా చేస్తారు. ఈ రోజున ఉపవాసం, ధార్మిక కార్యక్రమాలు చేయడంవల్ల శుభఫలితాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.

ఫాల్గుణ అమావాస్య రోజున దేవతలు పవిత్ర నదులలో దర్శనమిస్తారు. అందుకే ఆ రోజున నదీస్నానానికి విశేష ప్రాధాన్యతనిస్తారు. ఈ రోజున స్నానం చేసి దానధర్మాలు చేయాలి. ఈ రోజు ఉపవాసం ఉండి పూజలు చేయడంవల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుందని శాస్త్ర వచనం. ఈ రోజు పూర్వీకుల శాంతి కోసం దానాలు, తర్పణం, శ్రాద్ధం మొదలైనవి చేయడం వల్ల వారి అనుగ్రహం లభిస్తుంది.

ఫాల్గుణ అమావాస్య రోజున సాయంత్రం ఇంటికి ఈశాన్య దిశలో నెయ్యి దీపం వెలిగించాలి. అందులో ఆవునెయ్యి, కుంకుమపువ్వు ఉపయోగించాలి. ఎరుపు దారంతో వత్తి తయారు చేసి దీపం వెలిగించాలి. ఇలా చేయడంవల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. మీ ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది. మీ సంపద పెరుగుతుంది. ఈ రోజున తలస్నానం చేసిన తర్వాత పిండితో చిన్న ఉండలు చేసి వాటిని ఒక నది లేదా చెరువులో చేపలకు ఆహారంగా వేయాలి. ఇలా చేయడం వలన కష్టాలు దూరమవుతాయి. అనేక సమస్యలనుంచి ఉపశమనం లభిస్తుంది.

- Advertisement -

ఫాల్గుణ అమావాస్య రోజున రాత్రి నది దగ్గర 5 నెయ్యి దీపాలు వెలిగించి, ఐదు ఎర్రటి పువ్వులను నదిలో వదలిపెట్టాలి. ఇలా చేయడంవల్ల సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, డబ్బు, లాభం కూడా పొందవచ్చు. ఈ రోజున ఆకలితో అలమటించేవారికి అన్నదానం చేయడం, నిత్యావసర వస్తువులను దానం చేయడంవల్ల పుణ్యం వస్తుంది. గ్రహ దోషాలు కూడా తొలగి పోతాయి. ఈ రోజున కాలసర్ప దోషాన్ని నివారించడానికికూడా పరిహారాలు చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement