Tuesday, April 30, 2024

పురుష ప్రయత్నమే ధీరుని లక్షణం!

శ్రీ వసిష్ట మహాముని యోగ వాసిష్టమునందు పురుష ప్రయత్నమే ధీరుని లక్షణమని శ్రీ రామ చంద్రునకు బోధించిన సంగ్రహము సదా అనుసరణీ యమైనది. ఈ మిధ్యా రూప జగత్తును అజ్ఞానముచే మను జుడు జీవించి యున్నప్పుడు, మరణించిన తరువాత తన ఆత్మయందు తానే అనుభవించుచున్నాడు. ప్రపంచమున ఏ పదార్థము కావలెనన్న మా పురుష ప్రయత్నము వలన నే లభించుచున్నది. అనగా శ్రమ వలనే ఉత్పత్తి సాధ్యము. ‘శ్రమయేవ జయతే’! శ్రమ వలననే ధర్మము తద్వారా జయము లభించును.
శాస్త్రము, సాధు పుంగవులు, సద్గురువులు చూపిన మార్గమున మనోవాక్కాయ, ఇంద్రియములచే చేపట్టిన కర్మవలనే పురుష ప్రయత్నమందురు. అట్టి ధర్మ సహిత ప్రయత్నమే సఫలమగును. దానికి విరుద్ధంగా యత్నించిన అది అధర్మ సహితమై ఉన్మత్తతకు దారితీయును.
పురుష ప్రయత్నము రెండు విధములు. పూర్వజన్మ కృతము, ఇహజన్మ కృతము. పూర్వ జన్మ కృతమునే ప్రారబ్ద మందురు. ఇహజన్మ కృతము శుభ కృతముగా నున్నచో ప్రారబ్దమును జయింపవచ్చును.
యత్న వద్భిర్దృఢాభ్యాసై: ప్రజ్ఞోత్సాహ సమన్వితై:
మేరవోపి నిగీర్యన్తే కైవ ప్రాక్బౌరుషే కథా
డృఢభ్యాసములో మనసున ఉత్సాహము నింపుకొని చేయు ప్రయత్నవంతులు దేనినైనా సాధింతురు. వారికి అదృ ష్టముతో పనిలేదు. అసలు అదృష్టమనునది పురుష ప్రయ త్నమే కాని వేరొకటి కాదు.
శాస్త్రాను శాసితములు, శుభ ఫల ప్రదములు అయిన కర్మలనే పురుష ప్రయత్నమందురు. పరులు కష్ట నష్టము లకు గురిగాకుండా సాధ్యమైనంత వరకు పరోపకారము కలిగే విధముగా చేపట్టు కర్మల వలననే శుభము చేకూరును. అరిషడ్వర్గములకు పొంగి స్వంత అక్కచెల్లెండ్రను, అన్న దమ్ములను తుదకు తల్లిదండ్రులను కూడా వంచించువారు ఇహపరముల యందు నరకమును అనుభవింతురు. వారు సదా అశుభ ప్రాప్తమైన ఫలములను పొందుచుందురు.
ఉచ్ఛాస్త్రం శాస్త్రితం చేతి ద్వివిధం పౌరుషం స్మృతమ్‌
తత్రోచ్ఛాస్త్ర మనర్ధాయ పరమార్థాయ శాస్త్రితమ్‌.
పురుష ప్రయత్నం శాస్త్రానుకూలముగా నుండవలెను. శాస్త్ర విరుద్ధముగా నున్న అది మోక్షమునకు దారితీయక అనర్థమును, నరకమును కలిగించును. ఇక్కడ శాస్త్ర మనగా సత్య, త్రేతా, ద్వాపర యుగముల నుండి మనకు లభించి శ్రీ రామాయణ, శ్రీ భారత, శ్రీ భాగవతములు పదునెనిమిది పురాణములు, వీటికి మూలమైన వేదము, వేదాంతములు మొదలైనవి. ఇక శాస్త్రానుకూలము అనగా యుగధర్మము నకు అనుగుణముగా సద్గురువులు. సిద్ధులు విశ్లేషించిన విధమున పురుష ప్రయత్నము చేయవలెను. పూర్వ జన్మ, ఈ జన్మ సమాన, అసమాన పుర ష ప్రయత్నములు పరస్పర ము పొట్టేళ్ళలా పోరాడుచుండును. ఈ జన్మ యందు చేయు శుభకర్మల తీవ్ర ప్రయత్నము వలన పూర్వజన్మ వాసన క్షయించును. అది జన్మరాహిత్యమునకు దారితీయును. కావున సత్సంగము, సృష్టి శక్తియే భగవంతుడను నమ్మిక, శాస్త్ర సమ్మతమే పురుష ప్రయత్నయమను భావన మొదల గు వాటి సహాయంతో ముందుకు సాగవలెను.
పూర్వపు అశుభ యత్నము స్వయముగా శమించిపోవు నంత వరకు ఉత్తమ పురుష ప్రయత్నము చేయు చుండనుం డవలెను. పూర్వ జన్మ, ఈ జన్మ యందు చేసిన అశుభ పురుష ప్రయత్నములు తొలగి పోవలెనన్న ఈ జన్మ యందు శుభ పురుష ప్రయత్నము దృఢముగా చేపట్టెవలెను. నిన్నటి అజీ ర్ణ దోషము నేడు తీసుకున్న ఔషధముతో పోయినట్లు ప్రయ త్నము చేయవలెను. పురుష ప్రయత్నము వలననే విశ్వా మిత్రుడు బ్రహ్మర్షి అయినాడు. ఇంకా అనేక మంది రాజులు, చక్రవర్తులు కూడా పురుష ప్రయత్నము వలన లోకోపకారులై ముక్తిని పొందారు. ఉత్తమ పురుషులు కొందరు దారిద్య్రములోనున్ననూ తమతమ పురుష ప్రయత్నములచే దేవేంద్రునితో సమానమైనారు. బాల్యములో బాగుగా అభ్యసిం పబడిన శాస్త్ర, సత్సాంగత్య, ధర్మయుక్త గుణముల తో ప్రయత్నము చేసి ఆత్మప్రాప్తిని పొం దారు. ఇహలోకమున ప్రయోజనకారులై కీర్తిగాం చారు.
ఆలస్యం యది న భవేజ్జగత్యనర్థ:
కోన స్యాద్బహు ధనికో బహుశ్రుతోవా
ఆలస్యాదియమవని: ససాగరాన్తా
సంపూర్ణా నరపుశుభిశ్చ నిర్ధనైశ్చ.
ఈ ప్రపంచమున సదా అనర్థహేతువైన ”సోమరితన ము” లేనిచో అందరూ ధనికులు, మహా విద్వాంసులు అయి వారు సుఖముగా నుండి సమాజమును సుఖముగ నుంచెడి వారు. సోమరితనము వలననే ఈ భూ మండలము ఆత్మ జ్ఞాన రహితమై, పశుప్రాయులైన సంస్కార హీనులతో నిండి పోయినది. ధనహీనులైన సోమరులు ఇతరుల దయపై ఆధా రపడి తమ శక్తియుక్తులను కూడా మరచి సమాజమునకు భారమయి పెడదోవను పట్టుచున్నారు.
కావున ప్రతి ఒక్కరూ సోమరితనము వీడి పుణ్యప్రద మైన పురుష ప్రయత్నమున శుభకర్మలు చేపట్టి తమను తాము ఉద్ధరించుకుని సమాజమును ఉద్ధరింప ప్రయత్న ము చేయవలెను. అదృష్టమనునది లేనేలేదు. నిత్యము ఒకరి సహాయం కొరకు ఎదురు చూచువారు ఎప్పటికీ హీనులు గానే మిగిలి సదా అవమానమునకు గురియగుచుందురు. నడచుచున్నవాడే తన గమ్యమును చేరగలడు. ఒక్కచోటునే సోమరిగా నిలుచున్నవాడు గమ్యమును ఏనాటికి చేరనివాడై అగమ్య గోచరుడై తిరిగి ఈ సంసార చక్రమున చరిత్ర హీనుడై తిరుగాడవలెను.
– వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement