Friday, May 3, 2024

జీవులు వృద్ధి పొందే మార్గం…

ఒకసారి ధర్మరాజు భీష్మునితో ”జీవుడు దేనివలన వృద్ధి పొందుతాడు? దేనివలన నాశనమవుతాడో?” వివరించమని కోరాడు. అపుడు భీష్ముడు బదులిస్తూ ”పూర్వం ఒకసారి నారద మునీంద్రుడు లోక సంచారం చేస్తూ, ఆకాశగంగ వద్దకు వెళ్ళి, స్నానం చేసి చూడగా కొంత దూరంలో వ్రత నిష్ఠతో ఉన్న ఇంద్రుడుని చూసాడు. దగ్గ రగా వెళ్ళి, అన్యోన్యంగా మాట్లాడుతూ ఉండగా ఆకాశం నుండి అప్పుడే ఉదయించిన సూర్య కాంతిని పోలిన తేజస్సుతో విమానం నుండి ఒక వనిత దిగింది. ఇంద్రుడును, నారద మహర్షిని చూసి నమస్కరించగా, ఇంద్రుడు ”కమల ముఖీ! నీవెవరు? ఎక్కడికి పోతున్నా వు? ఎక్కడ నుంచి వచ్చావు?” అని ప్రశ్నించాడు. అప్పుడామె బదులిస్తూ ”పాప రహతుడైన ఇంద్రా! నేను బాలసూర్యుడి కిరణ స్పర్శతో వికసించిన తామరపువ్వు నుంచి పుట్టిన దాన్ని. నా పేరు ”శ్రీ”, ”లక్ష్మీ”, ”భూతి” అనే పేర్లతో ప్రకాశిస్తుంటాను. పూర్వం నేను ”స్వాహా, స్వధా, మతి, శ్రద్ధ, ధృతి, స్మృతి, మేధ అనే గుణాలు ఉండటం వల్ల, రాక్షసులను మెచ్చు కొని, వారివద్దే ఉండేదాన్ని ఇప్పుడు వారి ప్రవర్తన నచ్చక నీ వద్దకు వచ్చాను.” అని చెప్పగా, ఇంద్రుడు ”పూర్వం ఎందువలన రాక్షసులను మెచ్ఛుకొన్నావు. ఇప్పుడు ఏ కారణంతో మెచ్చకుండా ఉన్నావు? నీ మెప్పు పొందాలంటే జీవులు ఎలా ఉండాలో చెప్పు” అని అడి గాడు. (స్వాహా స్వధా, అనే శబ్దాలు దేవతలకు, హవిస్సు అర్పించే సందర్భంలో వాడతారు. ఇవి లక్ష్మీ దేవికి ప్రతిరూపాలైన దేవతలు. మరోసారి వీరి గురించి వివరంగా తెలుసు కుందాం.) ఆమె బదులిస్తూ ”పూర్వం రాక్షసులు దానం, అధ్యయనం, అతిథి పూజ మొదలైన సద్గుణాలు కలిగి ఉండేవారు. అందుకు, అపుడు వారిని అంగీకరించి, వారితో ఉండిపోయాను. ఇప్పుడు వారు ఆ గుణాలు వదిలిపెట్టి, గర్వంతో, అధర్మంగా ప్రవర్తిస్తు న్నారు. అందుకే వారిని వదిలిపెట్టాను. నీవు సత్యంలోను, ధర్మంలోను, ఆసక్తి కలిగి ఉన్నావు. అందువలన నీ వృద్ధి, నివశించాలనే కోరిక నాకు కలిగింది. అందుకే వచ్చానని లక్ష్మీదేవి చెప్పింది. అంతేకాక, ఆమె ఇంకా వివరిస్తూ ”గురువులు పట్ల భక్తి చూపేవారు, దేవతలను, పితృదేవతలను పూజించేవారు, సత్యం పలికేవారు, దానం చేసేవారు, ఇతరు లకు చెందిన ధనం, స్త్రీల పట్ల కోరిక లేకుండా విముఖంగా ఉండేవారు, పండితులు, విపత్తు లను ప్రీతితో సత్కరించేవారు, పగటిపూట నిద్రించనివారు, వృద్ధులయందు, బలహనుల యందు, దీనుల యందు, స్త్రీల యందు దయ చూపేవారు, బాహ్యంగాను, ఆంతరంగి కంగానూ, శౌచం (పరిశుభ్రత) పాటించేవారు, అతిథి సత్కారాలు చేసేవారు వంటి జీవులను మెచ్ఛుకొంటాను. అట్లాకాకుండా, ధర్మహనులై, కామక్రోధాలు ఎక్కువగా కలిగి, గర్వంతో కూడిన వారై, భగవతారాధన పట్ల విముఖత చూపేవారు, భిక్షం పెట్టని వారు, కఠినమైన మాటలు మాట్లాడేవారు, మిక్కిలి క్రూరమైన ప్రవర్తన కలిగినవారిని నేను మెచ్చను. వారి వద్దకు వెళ్ళను. ఆమరేంద్రా! వేదాలలోను, స్మృతులలోను, చెప్పబడిన ఏడు గురు దేవతలు నాకు వృద్ధి కలిగించేవారు. వారే బుద్ధి, ధృతి, నీతి, శ్రద్ధ, సన్నతి, క్షమ, శాంతి అనే పేర్లు. ఈ గుణాలు వున్నవారినే నేను మెచ్ఛుకొంటాను. వారివద్ధ నివశించడానికి నాకు ఇష్టం. నేను ఎనిమిదవ దేవతను. రాక్షసులలో దుష్ట స్వభావాన్ని చూసి వారిని వదిలిపెట్టాను. దేవతల లో నేను మెచ్ఛిన అంశాలు ఉన్నాయి. అందుకే నేను దేవతలు చెంత ఉండి ప్రకాశిస్తాను.” అని లక్ష్మి చెప్పగా, ఇంద్రుడు, నారదుడు ఆమెను ప్రశంసించారు. పిదప పూలవాన కురి సింది. దేవతల నగారా మ్రోతలు వ్యాపించాయి. లక్ష్మీ తనను వరించగానే, నూతన ప్రకాశం తో అమరావతికి బయలుదేరి వెళ్ళాడు.
సాటిలేనిది, విశిష్టమైనది, ఇంద్రునితో లక్ష్మీ సమాగమం వల్ల, స్వర్గలోకంలో సర్వ సౌఖ్యాలు కల్పించబడ్డాయి. కాబట్టి, లక్ష్మీదేవి చెప్పిన ఏడు లక్షణాలు మనం అలవాటు చేసుకొంటే, ఆమె మనతోనే స్థిరంగా ఉంటుంది. దానివల్ల కీర్తి, సంపద, ధర్మాచరణ వంటివి పొందగలం.
సర్వేజనా సుఖినోభవంతు.
– అనంతాత్మకుల రంగారావు
7989462679

Advertisement

తాజా వార్తలు

Advertisement