Thursday, May 16, 2024

నిజమైన జ్ఞాని ఏ స్థితిలో ఉంటాడు

”జ్ఞానహనా: పశుభిన్న మానా:” జ్ఞానహనులైన వారు పశువులతో సమానము, జ్ఞాన విజ్ఞానములతో సమానమైనది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. మొట్టమొదట జ్ఞానం ఆవశ్యకతను, స్వరూప స్వభావాలను చూస్తే…
జ్ఞానం ఆవశ్యకతను గురించి భగవద్గీతలో ”సహజ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్య తే” అనగా ఈ ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది లేనే లేదుగదా!” అని అర్ధం. ఈ ప్రపంచంలో పవిత్రమైన వస్తువులెన్నో వున్నాయి. అతి ప్రియమైనవి కూడా వున్నా యి. అయినప్పటికీ వాటన్నిటికన్నా పవిత్రమయినది, ప్రియమయినది, మానవునికి వెలు గు ప్రసాదించేది ఒక్క ”జ్ఞానము” మాత్రమే. అలాంటి జ్ఞానాన్ని జీవిత కాలంలో ఈ గడ్డమీద పుట్టిన ప్రతి వ్యక్తి సంపాదించి తీరాలి, జ్ఞానమే జీవులకు చరమ లక్ష్యం.
కలకత్తా ఉత్తర ప్రాంతంలో నివసించే ప్రాణకృష్ణ ముఖర్జీ ఒక సంపన్న గృహస్థుడు, ఆంగ్లేయ వ్యాపార సంస్థలో పెద్ద ఉద్యోగం చేస్తుండేవాడు. శ్రీరామకృష్ణులను తరచూ దర్శి స్తూ, గృహస్థుగా ఉన్నా వేదాంత గ్రంథాలు పఠిస్తూ, వీలు కలిగినప్పుడు వచ్చి గురుదేవుల దర్శనం చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అతడు ఉదయమే వచ్చి గురుదేవులతో మా టల మధ్యలో ”మానవుడు చనిపోయిన తరువాత ఏమవుతాడు?” అని అడిగాడు. అప్పు డు గురుదేవులు అతడితో, ”అజ్ఞానమున్నంత వరకూ మానవుడు జన్మలెత్తుతూనే ఉంటా డు. జ్ఞానం కలిగిన తరువాత ఈ లోకంలో కానీ మరొక లోకంలో కానీ జన్మించడు. జన్మించ డమనే ప్రసక్తే అతడికి ఉండదు. గింజ వేయించిన తరువాత మొలుస్తుందా? పచ్చిగా ఉన్న ప్పుడే గదా అది మొలకెత్తేది! అదేవిధంగా జ్ఞానమయిన అహంకారం నశించిన) జీవుడు మరల జన్మ ఎత్తడు. వేదాంత పరంగా జాగ్రదావస్థ కూడా అనిత్యమే కదా!” అని ఈ కథ ద్వారా తెలియచేస్తారు.
”ఒక వూరిలో కట్టెలు కొట్టుకొని జీవించేవాడొకడున్నాడు. వాడొకరోజు హాయిగా నిద్రి స్తూ, కలగంటున్నాడు. ఇంతలో ఎవరో వచ్చి అతన్ని నిద్ర లేపారు. చాలా చిరాకుతో, విసుగు తో వాడు నిద్రలేస్తూ, ”ఎందుకయ్యా! నా నిద్ర పాడు చేసావు? నేను రాజసింహాసనంపై కూ ర్చొని రాజ్య మేలుతున్నాను. నాకు ఏడుగురు కొడుకులు. అందరూ విద్యావంతులు. ధను ర్విద్యలో ప్రవీణులు కూడా. ఉపద్రవాలేమీ లేకుండా నేను ప్రజలను పాలిస్తున్నాను. నా ఆనంద సామ్రాజ్యాన్ని ఎందుకు ధ్వంసం చేశావు?” అని విసుక్కున్నాడు. ఆ వచ్చినవాడు. ఆ కట్టెలు కొట్టేవాడితో, ”ఇందుకేనా ఇంత చిరాకుపడుతున్నావు. అది కేవలం కలే కదా?” అన్నాడు. అప్పుడా కట్టెలు కొట్టుకొనేవాడు మరింత విసుగుతో, ”నీవు ఎంత అవివేకివ య్యా! నీకేమీ అర్ధమైనట్లు లేదే! నేను కలలో రాజు కావడం ఎంత నిజమో, కట్టెలు కొట్టుకొని జీవించే ఈ జీవితం కూడా అంతే నిజం!” అన్నాడు.
ప్రాణకృష్ణ ముఖర్జీ వేదాంత విషయాలపై ఆసక్తి కలవాడు కాబట్టి గురుదేవులు అతడికి నిజమైన జ్ఞాని స్థితి ఎటువంటిదో తెలియచేశారు.
వేదాంతం ప్రకారం ఈ జగత్తు మిధ్య. ఒక కలలాగా అది కూడా అనిత్యం, పరమాత్మ కేవలం ప్రక్కన నిలబడి చూసేవాడిగా (సాక్షిగా) వున్నాడు. జాగ్రత్తు (మెలకువ), స్వప్నం (కల), సుషుప్తి (నిద్ర) అనే మూడు స్థితులకు అతడు సాక్షి. కల ఎంత నిజమో, మెలకువ కూ డా అంతే నిజం.
ఒక రైతు ఉన్నాడు. అతడొక నిజమైన జ్ఞాని. వ్యవసాయమే అతడికి జీవనోపాధి, వయ స్సు మళ్ళిన తరువాత అతడికి లేకలేక ఒక కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడికి ‘హరు’ అని ముద్దుగా పేరు పెట్టుకున్నాడు. తల్లిదండ్రులకు హరు అంటే పంచప్రాణాలు. ఎందుకంటే అతడు లేకలేక పుట్టిన వంశాంకురం కదా! అంతేకాక ఈ రైతు తన పారమార్ధిక చింతన వలన గ్రామస్థులందరకూ ప్రీతిపాత్రుడయ్యాడు.
ఒకరోజు ఈ రైతు పొలంలో పనిచేస్తున్నాడు. అతడి పొరుగింటివాడు వచ్చి ‘హరు’కు కలరా వ్యాధి సోకిందని చెప్పి వెళ్ళిపోయాడు. రైతు వెంటనే ఇంటికి వెళ్లి శక్తి వంచన లేకుం డా చికిత్స చేయించాడు. కాని ఫలితం లేకపోయింది. హరు చనిపోయాడు. ఆ రైతు భార్య మిగిలిన కుటుంబ సభ్యులు దు:ఖ సాగరంలో మునిగిపోయారు. ఏడుపులు, పెడబొబ్బల తో ఇల్లు నిండి పోయింది. కాని రైతు ప్రవర్తన దీనికి విరుద్ధంగా వుంది. ఇంట్లో ఏమీ జరగనట్లే ప్రవర్తించాడు. భార్యను ఓదారుస్తూ, ఏడ్చి ప్రయోజనం లేదని చెప్పి, ఖనన సంస్కారం అంతా చేసి పొలంలో మిగిలిన పని చెయ్యడానికి వెళ్ళాడు. సాయంత్రం అతడు యథా ప్రకారం ఇంటికి రావడం చూచి భార్య, ”నీది ఎంత రాతిగుండె! పిల్లవాడు చనిపోయిన బాధలో మేమంతా ఇలా గుండెపగిలి ఏడుస్తూ ఉంటే, నీ కంటివెంట ఒక నీటి బొట్టైనా రాలలే దే?” అని ఆక్షేపించింది. దానికి ఆ రైతు తన భార్యను చూచి, ”నాకు రాజునైనట్లు, నాకు ఏడు గురు కుమారులున్నట్లు కలగన్నాను. ఆ రాజకుమారులు అందాల మూటలు, సుగుణాల రాసులు, సర్వవిద్యాపారంగతులు, దృఢకాయులు, ఇంతలో ఆకస్మాత్తుగా మెలకువ వచ్చింది. కల చెదిరిపోయింది. నేనిప్పుడు ఒక చిక్కులో పడ్డాను. కలలో కనిపించి పోయిన ఆ ఏడుగురు పిల్లల కోసం ఏడవనా? లేక ‘హరు’ ఒక్కడి కోసం ఏడవనా?” అని అడిగాడు.
”ఈ రైతు ఒక నిజమైన జ్ఞాని. స్వప్నము (కల), జాగ్రత్తు (మెలకువ), రెండూ కూడా ఒ క రకంగా అనిత్యాలేనని అతడికి తెలుసు. ఉన్న సత్యం ఒక్కటే! అదే ఆత్మ!”ఈ కథను గురు దేవులు మహమాచరణుడికి చెప్పారు. మహమాచరణుడు ఎన్నో వేదాంత గ్రంథాలు, అనేక ఇంగ్లీషు గ్రంథాలు చదివి కొంత పాండిత్యం సంపాదించాడు. పిత్రార్జితమైన ఆస్తి ఉండడం వాళ్ళ ఉద్యోగమేమీ చేయకుండా శాస్త్రపఠనంలో కాలం గడిపాడు. తన భావాలకు అనుగు ణంగా ఒక పాఠశాలను కూడా నడిపించాడు. అతడికి పాండిత్య ప్రకర్షణం మీద కొంత అభిలాష వుంది. అతడిది రాజసిక ప్రవృత్తి. ఇది గుర్తించిన గురుదేవులు ‘నిజమైన జ్ఞానం’ ఎలా ఉంటుందో, నిజమైన జ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడో అతడికి తెలియచేశారు.
ఈ విధంగా గురుదేవులు రామకృష్ణులు వేదాంత విషయాలపై ఆసక్తి కలిగిన వానికి, రాజసిక ప్రవృత్తి కలవానికి నిజమైన జ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడో తెలియచేశారు.

”జ్ఞానమెన్న గురువు జ్ఞాన హన్యము బుద్ధి
రెంటి నందు రెమ్మ రేచునపుడు
రిమ్మ తెలిపెనేని రెండొక రూపురా
విశ్వదాభిరామ వినురవేమా…!”

జ్ఞానం గురువులాంటిది. చంచలమైన మనస్సు జ్ఞానం- అజ్ఞానాల మధ్య కొట్టుమిట్టా డుతుంది. ఈ భ్రమలను తొలగిస్తేనే మోక్షం లభిస్తుందని వేమన చెప్పాడు. ఆత్మానాత్మ వివేకమే నిజమైన జ్ఞానం. వివేకం అంటే తెలివితేటలు. తెలివితేటలు కలిగివుంటే జ్ఞానం రాదు. ఏది ఆత్మ? ఏది అనాత్మ? అనాత్మ దేని నుండి పుడుతుంది? ”నేను” ఎవరు? అని తెలుసుకోవటమే జ్ఞానం. మిగిలినది అంతా అజ్ఞానమే! విజ్ఞానము అనగా అనుభవ జ్ఞానం. ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అనే నాలుగు విధాలైన భక్తులు భగవంతుని ఆరాధిస్తారు. వారిలో జ్ఞాని సర్వమూ ఈశ్వరమయమని తెలుసుకొని ప్రవర్తిస్తాడు. అటు వంటివాడే భగవంతునికి ప్రియతముడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement