Wednesday, May 1, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 55
55.
భక్త్యా మామభిజానాతి
యావాన్‌యశ్చాస్మి తత్త్వత: |
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా
విశతే తదనంతరమ్‌ ||

తాత్పర్యము : కేవలము భక్తియుత సేవ చేతనే మనుజుడు నన్ను యథారూపముగా దేవదేవుడని అవగాహన చేసికొనగలడు. అటువంటి భక్తిచే నన్ను సంపూర్ణముగా ఎరిగినప్పుడు అతడు నా ధామమును చేరగలడు.

భాష్యము : దేవాది దేవుడైన శ్రీ కృష్ణున్ని, ఆయన వివిధ రూపాలను, మన స్వశక్తితో గానీ డిగ్రీలు, పాండిత్య బలముతో గానీ అర్థము చేసుకొనలేము. కేవలము ఒక శుద్ధ భక్తుని ఆధ్వర్యములో శుద్ధ భక్తిని సాధన చేసినట్లయితే భగవంతున్ని అర్థము చేసుకొనగలుగుతాము. భౌతిక భావనలను విడనాడినట్లయితే ముక్తిని పొందినట్లు లెక్క. ఆధ్యాత్మిక జీవితములో జీవుడు తన వ్యక్తిత్వాన్ని కొనసాగించుటయే కాక, భగవంతునికి, భక్తునికి మధ్య సేవా సంబంధము కూడా కొనసాగుగూ ఉంటుంది. కాబట్టి ఈ శ్లోకములో తెలియజేయబడిన ‘విశతే’ అను పదము భగవంతునిలో లీనమగుటను కాక భగవంతుని ధామములో ప్రవేశించుటను సూచిస్తుంది.

బ్రహ్మ భూత స్థితిని చేరుకున్న తరువాత శ్రవణము చేయుట ద్వారా భగవద్భక్తి మొదలవుతుంది. అటువంటి శ్రవణము వలన భౌతిక కల్మషాలైన కామము, లోభము తొలగిపోయి ఇంద్రియాల ద్వారా అనుభవించాలనే కోరిక మాయమైపోతుంది. ముక్తి స్థితి అనగా జీవుడు తిరిగి తన వాస్తవ స్థితిలో నెలకొనుట. ఆ విధముగా అతడు నిరంతరము భక్తిని కొనసాగిస్తూ ఉంటాడు. భౌతిక భావనలను విడనాడుటయే నిజమైన ముక్తి అని మనము అర్థము చేసుకొనవచ్చును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement