Wednesday, May 15, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 16, శ్లోకం 22
22.
ఏత్వైర్విముక్త: కౌంతేయ
తమోద్వారై: త్రిభిర్నర: |
ఆచరత్యాత్మన: శ్రేయ:
తతో యాతి పరాం గతిమ్‌ ||

తాత్పర్యము : ఓ కుంతీపుత్రా! ఈ మూడు నరకద్వారాముల నుండి తప్పించుకొనినవాడు ఆత్మానుభూతికి అనుకూలములైన కార్యముల నొనరించి క్రమముగా పరమగతిని పొందగలడు.

భాష్యము : ప్రతి ఒక్కరూ కామ, క్రోధ, లోభములను ఈ మూడు శత్రువులకూ దూరముగా ఉండవలెను. వాటి నుండి ఎంత విముక్తి లభిస్తే అంత పవిత్రత చేకూరినట్లు భావించవలెను. అటువంటి వ్యక్తులు శాస్త్రములలో తెలిపిన నియమ నిబంధనలను పాటించగలుగుతారు. కర్మలను ఏ విధముగా చేస్తే ఫలితముగా కామ, క్రోధ, లోభాల నుండి పవిత్రత చూకూరుతుందో వేద శాస్త్రాలు వివరించాయి. ఈ జ్ఞానమును పెంపొందించుకొనుట ద్వారా ఆత్మ సాక్షాత్కారము పొం ది భగవద్భక్తి చేసే స్థితికి చేరుకోగలుగుతారు. అటువంటి వ్యక్తికి ముక్తి తథ్యము. కాబట్టి వేదశాస్త్రాల ప్రకారము వర్ణాశ్రమ ధర్మాలను పాటించినట్లయితే క్రమేణ ఆత్మ సాక్షాత్కారము పొంది ముక్తిని తప్పక పొందెదరు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement