Monday, May 6, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 7, శ్లోకం 1

శ్రీ భగవాన్‌ ఉవాచ:
మయ్యాసక్తమనా: పార్థ
యోగం యుంజన్‌ మదాశ్రయ: |
అసంశయం సమగ్ర మాం
యథా జ్ఞాస్యసి తచ్ఛృణు ||

తాత్పర్యము : శ్రీ కృష్ణ భగవానుడు పలికెను : ఓ పార్థా! మనస్సును నా యందే సంలగ్నము చేసి నా సంపూర్ణభావనలో యోగమభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు పూర్తిగా ఎరుగగలవో ఇప్పుడు ఆలకింపుము.

భాష్యము : గడచిన ఆరు అధ్యాయాలలో జీవుడు శరీరానికి అతీతమైన ఆత్మయని, వివిధ యోగా పద్ధతుల ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చునని తెలియజేయటమైనది. చివరకు అత్యున్నత యోగా స్థితి శ్రీ కృష్ణుని పై స్థిరముగా మనస్సు నిలుపుటయేనని నిర్ధారింపబడినది. ఇక ఇప్పుడు తన నుండి శ్రవణం చేయమని శ్రీకృష్ణుడు అర్జునుడికి సూచించుచున్నాడు. శ్రీమద్భాగవతము నందు కూడా నవ విధ భక్తి మార్గాలలో శ్రవణమే మొదటిది, మరియు ముఖ్యమైనది, శ్రవణం ద్వారా హృదయములోని మలినాలు తొలగింపబడి, రజో తమో గుణ ప్రభావము పోయి, శుద్ధ సత్య గుణమున భగవద్‌ తత్త్వాన్ని పూర్తిగా అర్థము చేసుకొన గలుగుతామని చెప్పబడినది. కాబట్టి స్వయముగా శ్రీకృష్ణుని నుండి గాని ఆయన శుద్ధ భక్తుని నుండి గానీ శ్రవణం చేయుట ద్వారా కృష్ణ తత్త్వాన్ని పూర్తిగా తెలుసుకొనవచ్చును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement