Friday, April 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)


అధ్యాయం 10, శ్లోకం 8
8.
అహం సర్వస్య ప్రభవో
మత్త: సర్వం ప్రవర్తతే |
ఇతి మత్వా భజంతే మాం
బుధా భావసమన్వితా : ||

తాత్పర్యము : నేనే సర్వములైన ఆధ్యాత్మిక, భౌతిక జగములకు కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెఱిగిన బుద్ధిమంతులు నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపూర్వకముగా అర్చింతురు.

భాష్యము : నిజమైన పండితుడు అంటే శ్రీచైతన్య మహాప్రభువు వంటి ఆచార్యుల చెంత వేదాలను శ్రవణము చేసి శ్రీకృష్ణుడు సర్వ నియామకుడని, సర్వానికి మూలము అని తెలుసుకున్నవాడు. అన్ని వేదాలు, ముఖ్యముగా గోపాల తపని ఉపనిషత్తు, నారాయణ ఉపనిషత్తు, మహా ఉపనిషత్తు, శ్రీకృష్ణుడే బ్రహ్మ, శివులతో సహా సర్వానికి మూలమని అంగీకరిస్తూ ఉన్నాయి. అట్టి అవగాహన కలిగిన వ్యక్తి తన శక్తినంతటినీ, కృష్ణచైతన్యము కొరకు ధారపోస్తాడు. అతడు వేదాలలోని సూచనలను ఎట్లు పాటించాలో అర్థము చేసుకొనగలుగుతాడు. అంతేకాక వక్ర భాష్యాలను చెప్పు తర్కవాదుల నుండి తనను తాను రక్షించుకొనగలుగుతాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement