Monday, April 29, 2024

జులై 1 నుంచి క‌ల్యాణ‌మ‌స్తుకు న‌మోదు చేసుకోవాలి : టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి

తిరుమల : రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7వ తేదీన 7వ విడత కల్యాణమస్తు ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించనున్నామ‌ని, ఇందుకోసం జులై 1వ తేదీ నుంచి న‌మోదు చేసుకోవాల‌ని టీటీడీ ఈవో ఏవీ.ధ‌ర్మారెడ్డి తెలిపారు. కల్యాణ‌మ‌స్తు కార్య‌క్ర‌మ ముహూర్త ప‌త్రిక‌ను శుక్ర‌వారం తిరుమ‌ల శ్రీ‌వారి పాదాల వ‌ద్ద ఉంచి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ముందుగా శ్రీ బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యంలో పూజ‌లు చేప‌ట్టారు. అక్క‌డి నుంచి మంగ‌ళ‌వాయిద్యాల న‌డుమ‌ ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్నారు.

శ్రీ బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ క‌ల్యాణ‌మ‌స్తు కార్య‌క్ర‌మానికి ఆగ‌స్టు 7న ఉదయం 8 గంట‌ల 07 నిమిషాల నుండి 8 గంట‌ల 17 నిమిషాల మధ్య పండితులు సుముహూర్తం నిర్ణయించిన‌ట్టు తెలిపారు. అన్ని జిల్లాల్లో సూచించిన ప్రాంతాల్లో న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లా కేంద్రాల్లో ఎంపిక చేసిన ప్రాంతంలో క‌ల్యాణ‌మ‌స్తు కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామ‌ని, ఇందుకోసం పెళ్లిదుస్తులు, పుస్తెలు, మెట్టెలు అందించి పెళ్లి భోజ‌నం వ‌డ్డించ‌డం జ‌రుగుతుంద‌ని అన్నారు. పేదలకు తమ పిల్లల వివాహాలు ఆర్థికంగా భారం కాకూడదనే ఉద్దేశంతో ఉచితంగా సామూహిక వివాహాలు నిర్వహించాలని టిటిడి బోర్డు నిర్ణయించిన‌ట్టు తెలిపారు. ప్ర‌జ‌లు ఈ కార్య‌క్ర‌మానికి న‌మోదు చేసుకుని శ్రీవారి ఆశీస్సులతో వివాహాలు చేసుకోవాల‌ని కోరారు. ప‌దేళ్ల త‌రువాత క‌ల్యాణ‌మ‌స్తు కార్య‌క్ర‌మాన్ని పునఃప్రారంభించామ‌ని, మొద‌ట ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిర్వ‌హించి ఆ త‌రువాత ఇత‌ర రాష్ట్రాల్లో చేప‌డ‌తామ‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement