Wednesday, May 1, 2024

ఈ నివేదనలు…భగవంతునికి ప్రీతికరం

దేవాలయంలో గర్భగుడిలో వెలసిన దైవానికి అయి నా, ఇంట్లో పూజామందిరంలో కొలువుదీరివున్న దైవానికి అయినా ప్రతి నిత్యం నైవేద్యం సమర్పించాలి. నిత్య పూజ అయినా విశేష పుణ్యతిథుల్లో చేసే ప్రత్యేక పూజలు అయినా నైవేద్యం తప్పనిసరిగా సమర్పించవలసిందే. దేవుని ఆరాధించే ప్రక్రియలో ప్రధానమైనది నైవేద్యం సమర్పించడం. ఈ ప్రక్రియ చాలా ముఖ్యమైన, దేవుని కృప పూర్తిగా దక్కే మార్గం. అయితే ఇలాంటి అతి ముఖ్యమైన ప్రక్రియలో మనం తెలిసి లేదా తెలియక కొన్ని తప్పులు చేస్తుంటాము. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అంటారు. కనుక భగవం తునికి మహానైవేద్యం సమర్పించేప్పుడు ప్రతివారు తప్పకుండా పాటించాల్సిన కొన్ని నియమాలను మన పూర్వీకులు ఇలా పేర్కొన్నారు.
మహాగణపతికి లడ్డూలు, కుడుములు, ఉండ్రాళ్ళు అంటే మహా ప్రీతి. అందుకే విఘ్నేశ్వరుడిని పూజించే సమయంలో ఆయనకు నైవేద్యంగా వాటినే పెట్టాలి. వినాయకుడికి బెల్లం అంటే కూడా చాలా ఇష్టం.
పరమశివుడికి పాలతో చేసిన పదార్థాలను నైవేద్యం పెడితే ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు. కుంకుమపువ్వుని కలిపి చేసిన ఆహారపదార్థాలు, తియ్యటి వంటకాలన్న ఆయనక అత్యంత ప్రీతికరం.
విష్ణుమూర్తికి పసుపురంగు ధాన్యాలంటే ఎంతో ప్రీతి. ఇంకా వీటికి కొంచెం బెల్లం కలిపి చేసిన వంటకాలైతే ఇంకా ఇష్టం. అందుకే విష్ణుమూర్తికి పసుపు వర్ణంగల లడ్డులను నైవేద్యంగా పెడతారు.
శ్రీకృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం. వెన్నలో పంచదార కలిపి శ్రీకృష్ణుడు చిన్నతనంలో తినేవాడట. కొబ్బరితో చేసిన లడ్డులు అన్నా శ్రీకృష్ణుడికి ఇష్టమట. ఆయనను పూజించే సమయంలో ఈ వంటకాలనే నైవేద్యంగా పెడతారు.
హనుమంతుడికి ఎర్రటి ధాన్యాలు అంటే ఇష్టం ఆయనకు కందులను నానబెట్టి వాటిలో బెల్లం కలిపి స్వామివారికి నైవేద్యం పెడితే కోరికలను తీరుస్తాడట.
దేవునికి నైవేద్యంగా పెట్టడానికి చేసిన వంటకాలలో నుంచి కొంత విడిగా తీయరాదు. పాత్ర మొత్తాన్ని దేవుని ఎదుట పెట్టాలి.
పదార్ధాలు వేడిగా ఉన్నప్పుడు నివేదించరాదు. చల్లారాక పెట్టాలి.
మహా నివేదన చేసేసమయంలో ఒక ప్రత్యేకమైన పాత్రలో మంచినీటిని కూడా భగవంతుని దగ్గర తప్పనిసరిగా పెట్టాలి.
నివేదించే వంటకాలలో పంచదారకు బదులు బెల్లం వాడాలి.
అలాగే భగవంతుడిని పూజించిన వెంటనే అవసర నైవేద్యంగానో… లేదా నైవేద్యంగానో కాయో… ఫలమో పెట్టడం మన సంప్రదాయం. అయితే ఏ దైవాని కి ఏ ఫలం నివేదిస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో కూడా తెలియజేస్తున్నారు మన పండితులు.
#కొబ్బరి కాయ (పూర్ణ ఫలం) – భగవంతుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలుపెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.
#అరటి పండు- భగవంతుడికి అరటిపండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్య సిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందు తుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యంగా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.
శనీశ్వరునికి నేరేడుపండు నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి తొలగిపోయి ఆరొగ్యవంతులు అవుతారు.
భగవంతుడికి నివేదించిన ద్రాక్షపండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచిన్లటతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.
మామిడి పండుని నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావల సిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందు తుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యంగా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యంగా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.
భగవంతుడికి నైవేద్యం పెట్టిన అంజూరు పండును అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య బాధలు అన్ని తొలగి ఆరో గ్యవంతులు అవుతారు.
సపోట పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంబంధ విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి.
భగవంతుడికి యాపిల్‌పండుని నైవేద్యంగా పెడితే దారిద్య్రం తొలగి ధనవంతులు అవుతారు.
భగవంతుడికి కమలాపండు నివేదించినట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి.
పనసపండుని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగవిముక్తి కలిగి సుఖంగా ఉంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement