Monday, April 29, 2024

ధర్మం మర్మం – ధనత్రయోదశి విశిష్టత

ధనత్రయోదశినాడు లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ట చేసి త్రయోదశి, చతుర్ధశి, అమావాస్యలలో మహాలక్ష్మీ పూజను అఖండ శ్రీసూక్త పారాయణంతో అమావాస్యనాడు లక్ష్మీపూజనముతో మూడు రోజుల వ్రతం ముగుస్తుంది. ఈవ్రతము పద్మ, స్కాంద, బ్రహ్మాండ పురాణ ప్రోక్తం. ఈ వ్రతమును ఆశ్వయుజ కృష్ణ అష్టమి నాటి నుంచి ప్రారంభించే ఆచారం కూడా ఉంది. పురాణ సముచ్ఛయానుసారం భాద్రపద కృష్ణ అష్టమి నుండి ఆశ్వయుజ కృష్ణ అష్టమి వరకు లక్ష్మీఆరాధన చేయాలి. అలాగే కన్యాసంక్రమణానికి ముందే ఈ వ్రతాన్ని ముగించాలని పౌరాణికుల అభిప్రాయం.

త్రేతాయుగంలో మదనబిల్వుడు అను మహారాజు లక్ష్మీ అనుగ్రహం కోసం లక్ష్మీదేవిని ప్రతిష్టించి, మూడు రోజులు ఆరాధించాడని ప్రసిద్ధి. ఈ పూజను బిల్వమూలములో చేయాల నే విశేష నియమాన్ని విధించారు.

బిల్వ పత్రై: యజేత్‌ దేవీం
తధాజాతి ప్రసూన కై
నానా పిష్టక నైవేద్యై:
ధూప దీపై: మనో హరై:

అని లక్ష్మీ అమ్మవారిని బిల్వపత్రములతో, జాజిపూలతో, బహువిధములైన పిండి వంటలతో ధూప,దీప,సుగంధ ద్రవ్యములతో ఆరాధిం చవలెనని నియమం.

ధనత్రయోదశి అనగా ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ప్రకృతి, మహాతత్త్వము, అహంకారము అను పదమూడు లీలావిభూతికి ధనముగా అభివర్ణిస్తారు. ప్రత్యేకించి ఈనాడు ప్రకృతి వనురులతో లక్ష్మీనారాయణులను ఆరాధించి మూడు దినములు జాగరముతో లక్ష్మీస్తవం చేస్తూ శ్రీసూక్తం, లీలాసూక్తం పారాయణాలతో లక్ష్మీదేవిని ఆరాధించాలి. ధనత్రయోదశి నాడు బంగారం కొని దాచుకోవడం పరిపాటి కాని దీనికి ఎటువంటి శాస్త్రప్రమాణం లేదు. ధనత్రయోదశినాడు పండితులకు, బ్రాహ్మణులకు వస్త్రదానం, సువర్ణదానం, ఆభరణదానం చేయడం వలన విశేష ఫలితం లభిస్తుంది. ”సర్వ దైవత్యం వైవాస:” అనగా దేవతలు వస్త్రమునందు అధివసించి ఉందురని అర్థం. అలాగే సువర్ణము లక్ష్మీదేవి ప్రతిరూపం, ఆభరణములు నారాయణుని ప్రతిరూపం కావున వస్త్రము, సువర్ణము, సువర్ణాభరణములు విరివిగా దానం చేసి లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందాలి.

- Advertisement -

— శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్య..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement