Sunday, April 28, 2024

భవ రోగాలకి దివ్యఔషధం నామస్మరణం

కలియుగంలో నామస్మరణకు మించినది ఏదీ లేదు. నామి కన్నా నామం మహా గొప్పది. శక్తివంతమైనది. నామస్మరణ ఆర్తిగా, ఆత్రంగా హృద యాంతరాలలోంచి రావాలి. భవ రోగాన్ని నిర్మూలించే దివ్య ఔషధం నామ స్మరణ. నామస్మరణ శాంతిని, మనశ్శాంతిని, ప్రశాంతతను ఇస్తుంది. పవిత్రతను ఇస్తుంది. పరమాత్మను ఇస్తుంది. పరలోక సుఖాన్ని ఇస్తుంది.
అందుకే ”కేవలం కలౌ తు నామ- మాత్రేణ పూజ్యత్‌ భగవాన్‌ హరి:” అం టారు శ్రీ మధ్వాచార్యులు తన ముండోకోపనిషత్‌ భాష్యంలో.
పరమాత్మను ఒప్పించడానికి, మెప్పించడానికి, కలియుగంలో మహా కష్టమైన, తీవ్రాతి తీవ్రమైన సాధనా ప్రక్రియలు అవసరం లేదు. భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికీ, భగవంతునికీ చేరువ కావడానికీ, ముందు యుగా లలో ఆచరించిన తపస్సు, యజ్ఞ యాగాలు, హోమాలు, వగైరా కఠినాతికఠిన మైన సాధనలు అక్కరలేదు. పైవాటన్నిటి కన్నా, సులభమైన మార్గం, సాధకుల కు మహర్షులు మనకు అందించిన మార్గం, మనకు దక్కిన మార్గం కలియు గంలో నామస్మరణ. సనాతన మార్గం మానవాళి మొత్తానికి అందించిన మహా వరం నామస్మరణ.
నామ ప్రభావాన్నీ, నామం ప్రాభవాన్ని మహర్షులు, మహనీయులు, మహానుభావులు, అవధూతలు వేనోళ్ళ వివిధ సందర్భాలలో కొనియాడారు. వివిధ మార్గాలలో సోదాహరణంగా వివరించారు. చిన్నచిన్న ఘటనలతో, సం ఘటనలతో సూటిగా #హృదయానికి హత్తుకునేలా వివరించి చెప్పారు. పురా ణాలలో యితిహాసాలలో నామస్మరణ ప్రాశస్త్యాన్ని చిన్న కథల రూపంలో, సన్నివేశాల రూపంలో అందించారు. వాటిలో ఓ నీతి, ఓ రీతి, ఓ పద్ధతి, ఓ ప్రణా ళిక, ఓ సందేశం పుష్కలంగా ఉంటాయి. పరోక్షంగా నామస్మరణ ఆవశ్యకత, విశి ష్టత ద్యోతకమవుతుంది. సామాన్యులకు సైతం సవివరంగా, సంపూర్ణంగా అర్ధం అయ్యేలా ఆ వివరణలు ఉంటాయి.
అయితే నామస్మరణ అనేది ఓ ప్రదర్శనలా ఉండకూడదు. మొహ మాటానికో, ఆర్భాటానికో, అహం ప్రదర్శనకో ఉపయోగపడే ఓ క్రియలా నామ స్మరణ సాగకూడదు, గొప్పదనం ప్రదర్శించుకునే ఓ చిహ్నం కాకూడదు.
వ్యక్తుల స్థాయినో స్థానాన్నో పెంచుకోవడానికి చేసే ప్రయత్నం నామస్మరణ కాకూడదు. వెరసి… అద్భుతాలు, మహమలు, లీలలు, అభూత శక్తులులాంటి విపరీత ధోరణులకు దారితీసే పరిస్థితికి, దోహదం చేసే ప్రక్రియ నామస్మరణ కాకూడదు. అయోమయానికి, గందరగోళానికి ఆధ్యాత్మికాన్ని గురిచేయడానికి నామస్మరణ హతువు కాకూడదు.
ఓ పర్యాయం ఓ గురువుగారు నామస్మరణ విశిష్టతను వివరిస్తున్నారు. ఆ ప్రసంగం గంగా ప్రవాహంలా సాగిపోతోంది. భక్తులు ఆ వాక్ప్రావంలో మునిగి తేలుతున్నారు. గురువుగారు చెప్పింది తదేకంగా వింటున్నారు. తన్మయత్వంతో ఊగిపోతూ, రసలోకాల్లో విహరిస్తున్నారు. కలియుగంలో నామస్మరణ ప్రాముఖ్యతను, ప్రాశస్త్యాన్ని ముందు యుగాలలోని తపస్సు యిత్యాది సాధనా పద్ధతులతో సరిపోల్చుతూ, నామస్మరణ ఎంత సులభమైన మార్గమో, భక్తు లందరికీ అర్ధమయ్యేలా, తన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటున్నారు. మనోహ రంగా మనోభావంగా స్మరణ సాగాలని, హృదయాంతరాలలోంచి నామస్మరణ సాగాలన్నారు. భగవంతుడ్ని ఒప్పించి మెప్పించేలా నామస్మరణ చేయాలన్నా రు. నామాన్ని స్మరిస్తూ, స్మరిస్తున్న ఆ నామాన్ని మనసులో మననం చేసుకుం టూ, నామాన్నిహృదయస్తం చేయాలి. ఆ రూప నామ ధ్యానత్వంలో తేలి పోతూ, స్మరిస్తున్న నామాన్ని రాస్తూ చేసే స్మరణ ఉత్తమోత్తమ నామస్మరణ అని గురువు గారు చెప్పారు. వింటున్న భక్తులలోంచి ఓ మహళ లేచుని నిలుచుంది. ఏదో చెప్పేందుకు ఆతృత పడుతోంది. ‘చెప్పు’ అన్నట్లు గురువుగారు సైగ చేసారు. ఆమె చెప్పటం మొదలు పెట్టింది.
”స్వామీ! నామస్మరణ గురించి ఎంత గొప్పగానో మీరు చెప్పారు. మనసుకి హత్తుకు పోయింది.” అని యింకా ఏదో చెప్పబోతోంది. ”పొగడ్తలు ఆపు. విష యం చెప్పు.” అని హచ్చరించారు గురువుగారు.
”అలాగే స్వామీ! నేను మీరు చెప్పినట్లే రోజుకు రెండుసార్లు నామాన్ని పుస్తకంలో రాస్తూ, గత రెండేళ్లుగా నామస్మరణ చేస్తున్నాను.” ఎంతో గొప్పగా చెప్పింది ఆ మహళ. ”సంతోషం” అన్నారు గురువుగారు. ”అదే స్వామీ! మొదటి ఆరు నెలలు 108 సార్లు చొప్పున ఉదయం సాయంత్రం రోజుకు రెండుసార్లు నామస్మరణ చేసాను. తర్వాత 6 నెలలూ చేస్తున్న 108 సార్లుని, 516 సార్లుకి పెంచి, రోజుకు రెండుసార్లు నామస్మరణ చేసాను. సంవత్సరం తర్వాత అంటే సంవత్సరం నుంచి చేస్తున్న 516 సార్లుని ఒక వేయి నూట పదహారు సార్లుకి పెంచి, నామాన్ని రాస్తూ రోజుకు రెండు పర్యాయాలు చేస్తున్నాను.” మహా గొప్పగా తను నామస్మరణ చేస్తున్న విధానాన్ని చెప్పిందా మహళ. ”ఏదీ మరో సారి చెప్పు.” అనడిగారు గురువుగారు. నామస్మరణను ఆమె ఎన్నిసార్లు నుంచి ఎన్నిసార్లకు పెంచుకుంటూ, ఎన్ని నాళ్ళు ఏ రకంగా చేసిందో, అంకెలను ఒత్తి పలుకుతూ తనెంత ఖచ్చితంగా, గొప్పగా నామస్మరణ చేసిందో వివరించి చెప్పింది. ”అంకెలను అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు?” అని గురువు గారు మళ్ళీ ప్రశ్నించేరు. అప్పుడా మహళ ”స్మరణ చేస్తున్న ప్రతిసారీ లెక్క ఏమాత్రం తప్పకుండా లెక్కించుకున్నాను. ఒకటికి రెండుసార్లు సరి చూచుకున్నాను స్వామి!.” వివరించిందా మహళ.
”ఆహా అలాగా!” ఓ చిరునవ్వు నవ్వారు గురువుగారు. నీ నామస్మరణ 108 నుంచి 516, 516 నుంచి 1116… యిలా పెరుగుతూ వచ్చింది కదా? అది కూడా మూడు విడతల్లో జరిగింది. రోజుకు రెండుసార్లు కదా? మొత్తం రెండేళ్లు అయ్యింది కదా?” అని మరోసారి ప్రశ్నించారు గురువు గారు.
”అవును స్వామీ! గత సంవత్సరంగా వేయి నూటపదహారుసార్లు చేస్తు న్నాను స్వామీ!!” మహదానందంగా చెప్పిందా మహళ.
”చాలాచాలా బావున్నాయమ్మా నీ లెక్కలు. నువ్వు చెప్పిందంతా విన్నాక, నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు చేస్తున్న నామస్మరణ కాస్తా ‘నెంబర్ల స్మరణ’గా మారిపోయినందుకు.” ఎక్కడ ఏ రకంగా ఎవర్ని ఎప్పుడు పడకొట్టాలో, అక్కడ ఆచితూచి వాతపెట్టారు గురువుగారు. వింటున్న అందరూ పగలబడి నవ్వారు. గురువుగారు మళ్ళీ ”అవును. నీ ధ్యాసంతా, నీ ఆలోచనంతా నెంబర్ల మీద ఉన్నప్పుడు, ఆ స్మరణ నామస్మరణ ఎలా అవుతుం ది? ‘నెంబర్‌ స్మరణ’ అవుతుంది. దాగున్న రహస్యాన్ని అందరికీ అర్ధమైనట్లు వివరించారు గురువుగారు. అప్పుడామెకు తన తప్పు పూర్తిగా తెలిసొచ్చింది. జ్ఞానోదయమైంది. అనంతుని మీద దృష్టి నిలిపి. అహాన్ని, అహంభావాన్ని, మమకారాలను వదిలి ఏకాగ్ర దృష్టితో చిత్తశుద్ధితో చేసేది నామస్మరణ.
– రమాప్రసాద్‌ ఆదిభట్ల. 93480 06669.

Advertisement

తాజా వార్తలు

Advertisement