Tuesday, March 26, 2024

మాపైనా ఈడీ దాడులు జరుగుతాయి.. అందుకు సిద్ధంగా ఉన్నాం: మంత్రి కేటీఆర్​

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను వేట కుక్కల్లా వినియోగించుకుంటోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తమపైనా ఈడీ దాడులు చేయించి, ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోందని.. ఆ దాడులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. 2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికలే తమ టార్గెట్ అని.. ప్రస్తుతం పార్టీ పేరు మార్చామని, లోక్ సభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుందని తెలిపారు.

కేసీఆర్ కు మంచి స్పష్టత ఉంది
దేశంలో రాజకీయ శూన్యత ఉందని.. జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ కు మంచి స్పష్టత ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీ పేరుకు జాతీయ పార్టీ అయినా.. దాన్ని కేవలం గుజరాతీలు నడుపుతున్నారని విమర్శించారు. గుజరాత్ మోడల్ అంతా ఫేక్ అని.. ప్రధాని మోదీ అసమర్థుడని ఆరోపించారు. తమకు అవకాశం వస్తే తెలంగాణ మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేసి చూపిస్తామని చెప్పారు.

పొరుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కు మద్దతు
బీఆర్ఎస్ ప్రకటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని.. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి మద్దతు వ్యక్తమవుతోందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు వంటి కార్యక్రమాలను దేశమంతా అమలు చేయాలన్న డిమాండ్లు ఉన్నాయన్నారు.

కాంగ్రెస్ కనుమరుగే..
జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్‌ ఈ దేశానికి గుదిబండ అని.. 2024 తర్వాత ఆ పార్టీ కనుమరుగయ్యే అవకాశాలే ఎక్కువని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement