Tuesday, May 21, 2024

భక్తుల ఇంటికే భద్రాద్రి తలంబ్రాలు

  • టీఎ స్ఆర్టీసీ కార్గో, పార్శిల్ సర్వీసు అందిస్తున్న సదావకాశం
  • భక్తజనం కోసం మహత్కార్యానికి శ్రీకారం చుట్టిన అధికారులు
  • వెల్లడించిన చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ.సజ్జనార్
    హైదరాబాద్: జగత్ కల్యాణంగా అభివర్ణించే భద్రాద్రి రామయ్య, సీతమ్మ కల్యాణ వేడుకలో ఉపయోగిం చిన కోటి గోటి తలంబ్రాలు కావాలనుకునే భక్తుల కోసం నామమాత్రపు ఛార్జీలతో ఆ తలంబ్రాలను అందించేందుకు టీఎస్ ఆర్టీసీ కసరత్తు చేసింది. ఎంతో నియమ నిష్టలతో గోటితో వలచిన కోటి గింజలను తలంబ్రాలుగా భద్రాద్రి రామయ్య కల్యాణంలో ఎన్నో ఏళ్లుగా ఉపయోగించడం తెలిసిందే. మనసా, వాచా, కర్మణా కొలిచే ఆ జగదభిరాముడి కల్యాణ మహోత్సవానికి వెళ్లలేని భక్తజనం, ముందుగా టీఎస్ ఆర్టీసీ పార్శిల్ సర్వీసులో బుక్ చేసుకుంటే హోండెలివరీ సేవలతో ఆ తలంబ్రాలను చేర్చనుంది. లోక కల్యాణం పచ్చతోరణంలో మీరూ భాగస్వాములుకండి అంటూ ఈ మహా క్ర‌తువుకు సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ.సజ్జనార్ లు మాట్లాడుతూ.. రాములోరి కల్యాణంలో వాడే అక్షింతలకు ఎంతో విశిష్టత ఉందని, ఆ తలంబ్రాలను భక్తులు నేరుగా ఇంటికి తెప్పించుకునే సదావకాశాన్ని తాము కల్పిస్తున్నట్లు చెప్పారు. టీఎస్ ఆర్టీసీ కార్గో, పార్శిల్ కౌంటర్లో కేవలం రూ.80 చెల్లిస్తే శ్రీరామ నవమి ఘట్టం ముగిసిన తరువాత ముత్యాల తలంబ్రాలను భక్తుల ఇంటివద్ద అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ సహకారంతో ఈ బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టామని తెలుపుతూ హోం డెలివరీ సేవల ద్వారా తలంబ్రాలను అందించేందుకు సంస్థ పార్శిల్ సేవా విభాగం తగు ప్రణాళికను సిద్ధం చేసిందన్నారు. భద్రాద్రిలో అంగరంగ వైభవంగా నిర్వహించే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఇతర వివరాలకు టీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ నెం. 040-30102829, 68153333 లేదా సమీప కార్గో. పార్శిల్ కౌంటర్లను సంప్రదించాలని వారు సూచించారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement